యుగాది అంటే కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగములకు సంబంధించినది. ఏదో కొన్ని వేల సంవత్సరముల క్రిందట కృతయుగము పోయింది. అటు తరువాత కొన్ని వేల సంవత్సరాల క్రిందట త్రేతాయుగం పోయింది అని అనుకొంటూ - యుగాల క్రింద, కాలము క్రింద మనము గడుపుతున్నాము.
ప్రేమస్వరూపులారా! ఏదో కొన్ని వేల సంవత్సరాల క్రిందట కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు వచ్చినవి కాదు. ఇవన్నీ కేవలం "కేలండరులో" వారాలు వస్తున్నట్లుగా ఈ యుగములు కదలుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ కలియుగం పోతూనే తిరిగి కృతయుగము వస్తుంది. ఇది వేల సంవత్సరములకు సంబంధించినది కాదు. జీవితములోపల చక్కగా విచారిస్తే, నిత్యము ఒక్క దినంలో 24 గంటల లోపల నాలుగు యుగాలు మారిపోతున్నాయి. (1) తెల్లవారుఝామున నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కృతయుగము. మానవుడు ధర్మమును నాలుగు పాదములలోపల నడచటానికి తగిన శక్తి సామర్థ్యం కలిగి ఉంటుంది ఆ కాలం, (2) మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు ఇది త్రేతాయుగము. ఇక్కడ ధర్మము ఒక పాదము క్షీణించిపోతుంది. అనగా మానవ దేహములో ఉండిన శక్తులు కొంత నశించి పోతాయి. అక్కడ 3 పాదములు మాత్రమే సంచరిస్తూ ఉంటాయి. (3) సాయంకాలము ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు అది ద్వాపరయుగము. అప్పుడు రెండు పాదములతోనే ఉంటుంది. ధర్మం. అనగా శారీరక, మానసిక సంబంధములైనదంతా చల్లబడి ప్రాణములు, విజ్ఞానమయు మనేటటువంటివి రెండు మాత్రమే అక్కడ సంచరిస్తూవుంటాయి. (4) ఆ తరువాత రాత్రి పన్నెండు గంటల మండి తెల్లవారి నాలుగు గంటల వరకు కలియుగం. ఈ కలియుగములో - ఒక్క పాదము మాత్రమే వుంటుంది. ఏమిటి ఆ ఒక్క పాదము యొక్క ధర్మం? మైమరచి గురకలు కొట్టుకుంటూ నిద్రపోవటమే దాని ధర్మం.
కృతయుగం యొక్క కాలం 18,32,000, త్రేతా యుగము యొక్క కాలం 14,68,000. ద్వాపరయుగము యొక్క కాలం 8,32,000. కలియుగము యొక్క కాలం 4,63,000. ఇవన్నీ కూడితే ఎంత అవుతందో, అది బ్రహ్మకు ఒక్క పగలు అని, ఈలాంటివి అన్నీ చేరినప్పుడు - బ్రహ్మకు నూరు సంవత్సరములు అన్నారు. కనుక ఈ విధముగా చూచుకొంటే. మానవత్వము అర్థము చేసుకోవటానికి ఏమాత్రం వీలుకాదు. ఎవరు బ్రహ్మ? సోహమే బ్రహ్మ. ఈ బ్రహ్మ యొక్క వయస్సు అనాది. అనగా బ్రహ్మకు అనేక కోట్ల సంవత్సరములు ఒక పగలు. ఈ విధంగా మనము ఆలోచిస్తే, బ్రహ్మ అనాది కాక మరియేమిటి? కనుకనే “బ్రహ్మఅనాది" అని పేరు పెట్టారు. ఈనాటి సైంటిస్టులంతా ఏదో పెద్ద విజ్ఞానమును బోధించినవారమని, విజ్ఞానమును గుర్తించు కొన్నవారమని, ఈ అనాదికి ఒక కాలమును నిర్ణయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అన్ని కోట్లు అంటుంటే ఎవరు ఎంచుకొన్న వారమవుతాము? దీనికంటే అనాది అని చెబితే, ఎంత సులభముగా ఉంటుంది? అనాది అని చెప్పినవాడు "మొరటువాడు". ఇన్ని కోట్ల సంవత్సరములంటే "సైంటిస్టు". ఇది ఈనాటి ప్రచార ప్రబోధలు.
కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగము లంతా - ఒక్క దినం లోపల మార్పు చెందినటువంటివే. కనుకనే కాలమునకు - "భగవత్స్వరూపుడు"అని పేరు. యుగములకు "ఆదివాడు కనుకనే - "ఉగాది" అని పేరు వచ్చింది. "యుగాదైనమః" అని భగవంతునికి పేరు. కాలముతో కూడినవాడు భగవంతుడు. కాలమునే ఆత్మగా విశ్వసించినవాడు భగవంతుడు. కనుకనే అతనిని - "కాలాత్మకాయనమః" అన్నారు. ఆ కాలమునే తన గర్భమునందు ధరించిన వాడు కనుకనే - "కాలగర్భుడు" అని భగవంతునికి పేరు. కనుకనే - "కాల కాల ప్రపన్నాయనమః" అన్నారు. కాలమనే తత్త్వము కాయమును మ్రింగివేస్తుంది. కానీ, కాలమునే మ్రింగేటటువంటివాడు భగవంతుడు అని - "కాయమును మ్రింగేది కాలము - కాలమును మ్రింగేవాడు భగవంతుడు".
(స.సా.ఏ. 91 పు. 92/93)