మానవుడు ప్రపంచంలో జీవించుటకు ప్రధాన ఆధారం పాదములే. మానవ శరీర మంతయు పాదములపై ఆధారపడి ఉంటున్నది. "బ్రాహ్మణోస్యముఖమాసీత్ బాహూరాజన్యకృత:..." అన్నది వేదం. దృష్టి శ్రవణము, వాసన, వాక్కు,స్ప ర్శ - ఇవన్నీ ముఖమునందు మాత్రమే ఉంటున్నాయి. కనుకనే దీనికి బ్రాహ్మణుడని పేరు పెట్టారు. ఈ దేహమును రక్షించే నిమిత్తమై ఏర్పడిన బాహువులకు క్షత్రియులని పేరు పెట్టారు. ఇంక, ఉదరము తనలో ప్రవేశించిన పదార్థములను జీర్ణింపజేసి సర్వాంగములకు సప్లై చేస్తున్నది. కనుకనే, దీనికి వైశ్యుడని పేరు పెట్టారు. ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని జీవితం గడపటానికి పాదములే ప్రధానమని నిర్ణయించి వాటిని శూద్రులని అన్నారు. ఇలాంటి యథార్థమును గుర్తించడానికి ప్రయత్నించక ఈనాటి మానవులందరూ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను ప్రత్యేక తెగలుగా భావిస్తున్నారు. ఇది పొరపాటు. ఒక్కొక్క అంగమునందు ఒక్కొక్క దివ్యమైన భావాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము. అన్ని దేహంలో ఏకంగా ఉంటున్నవే! ముఖము, భుజములు, ఉదరము ఈ మూడింటిని కాపాడే పాదములే శూద్రులు. కాని, శూద్రత్వ మనగా కేవలం పనికి మాలినదని మనం భావిస్తున్నాము. కాదు, కాదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు (ముఖము, బాహువులు, ఉదరము) శూద్రుల పైననే (పాదముల పైననే) ఆధారపడి ఉంటున్నారు.
అన్నింటికంటే ప్రధానమైనది, ప్రమాణమైనది పాదము, పల్లెల్లో ఏదైనా పోట్లాట జరిగినప్పుడు న్యాయనిరూపణ చేసే సమయంలో "తప్పు చేశావు. వాని పాదాలపై పడు, క్షమిస్తాడు" అంటారు. అనగా, దోషాన్ని క్షమింపజేసేది పాదము, మన కన్ను ముఖము పైన ఉంటున్నది; పాదము క్రింద ఉంటున్నది. అయితే మనం బజార్లో నడుస్తున్నప్పుడు కన్ను ముల్లును చూసిన తక్షణమే కాలు దానిని దాటుకుంటుంది. కన్నేమైనా వచ్చి కాలుకు చెప్పిందా? లేదే! ఇదే ఆంతర్ సంబంధము. అంతేకాదు కాలికి ముల్లు గుచ్చుకుంటే కన్ను ఏడుస్తుంది. చూడండి వీటికి ఎంత అంతర సంబంధ మున్నదో! అసలు దీని అర్థమేమిటి? శూద్రునికేమైనా కష్టం కలిగితే బ్రాహ్మణుడు చాలా బాధపడాలి.కాని, ఈనాడు అలా జరగటంలేదు. "వాడి బాథవాడే అమభవించుకోనీ, అది వాడి కర్మ" అని ఊరికే ఉంటాం. ఇది సరియైన సంబంధము కాదు. అంతర్ సంబంధమైన ఆత్మతత్త్వాన్ని ఏకంగా భావించాలి. అప్పుడే జగత్తు నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. ఈనాడు మనం ఎవరినైతే బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని భావిస్తున్నామో వారందరూ మన దేశంలోని వివిధ అంగముల వంటివారే! కాని, వీటిని మనం వేర్వేరు కులములుగాను. మతములుగాను భావించుకొని పోతున్నాము. ఇవి కులమతములకు సంబంధించినవి కావు. మన మతికి సంబంధించినవి. "మతులు మంచివైన మతమేది చెడ్డది?" కనుక, మతములో ఏ దోషమూ లేదు: మతిలోనే దోషమున్నది..
(స...సా. అ..95.పు.212/213)
ఒకసారి విష్ణుమూర్తి వామనావతారము ధరించి, బలిచక్రవర్తిని ఉద్ధరించే నిమిత్తమై వచ్చి, బలిచక్రవర్తిని మూడడుగుల నేలను దానము కోరినాడు. బలిచక్రవర్తి విష్ణుమూర్తికి మూడడుగుల నేలను దానం చేసినాడు. ఒక పాదముచేత భూలోకమును, రెండవపాదము చేత ఆకాశమును విష్ణుమూర్తి ఆక్రమించుకొన్నాడు. ఇటువంటి విష్ణుమూర్తి విశాలత్వం, దివ్యత్వమును, పవిత్రతను, విశ్వవిరాట్ స్వరూపముమ గుర్తించుకొన్న బ్రహ్మ, ఆ శ్రీ మహావిష్ణువు పాదపద్మములను కడగాలని ఆశించినాడు, పాదాలు కడగాలంటే నీరు కావాలి. ఆ నీరును తెచ్చే నిమిత్తమై బ్రహ్మ మనస్సులో సంకల్పించుకొన్నాడు. అప్పుడే ఒక వ్యక్తి క్రిందికి దిగివచ్చినాడు. బ్రహ్మ సంకల్పముచేత ఆవిర్భవించినవాడు కనుకనే, అతనికి బ్రహ్మమానసపుత్రుడని పేరు కల్గినది. అతను వచ్చినది. దేనికోసము? నీరు తెచ్చే నిమిత్తమై ఆవిర్భవించినాడు. నీరును తెచ్చి ఇచ్చినవాడు కనుకనే, అతనికి ‘నారద అని పేరు వచ్చినది. నార అనగానీరు. దఅన గా ఇచ్చినవాడు, నారదఅనగా నీరును తెచ్చి ఇచ్చినవాడు అని అర్థం.
(స.సా. అ.. 90పు 259/260)
(చూ|| కృష్ణుడు, భక్తుడు)