కారణంబున కలుగు ఘన మోహ బంధంబు
మోహమందు పెరుగు, మూర్ఖ బుద్ధి
మూర్ఖబుద్ధి యందు మరియును కర్మంబు
కర్మఫలమువలన కలుగు జన్మ
(సా| పు. 153)
విద్యార్థులారా! మీరు పవిత్రమైన సంకల్పాలను అభివృద్ధి పరచుకుంటూ పవిత్రమైన భావాలతో మీ జీవితాన్ని సార్థకం గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరుల కందించండి. తాత్కాలికమైన సుఖసంతోషముల నిమిత్తమై దుస్సంకల్పములను దుర్భావములను దుశ్చేష్టలను అభివృద్ధి పరచుకోకండి. అవి మీకు అప్పటికప్పుడే తగిన ఫలితమందిస్తున్నాయి. కాని అంతకుమించి పదిరెట్లు నూరురెట్లుప్రమాదముసంభవిస్తాది. భవిష్యత్తును మీరు లక్ష్యములో పెట్టుకొండి ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అనే సత్యాన్ని - విశ్వసించండి. నీవు చేసినవన్నీ నీకు తత్ఫలితంగా అందుతాయి.
ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో
ఆఫలములే మీకు అందుచుండు
జననిగర్భమునుండి జన్మించినప్పుడు
కంఠమాలలనేవి కానరావు,
మంచిముత్యపు సరుల్ మచ్చునకునులేవు
రత్నాలహారముల్ రంజిల్లగా లేవు
పచ్చల పేర్లను వెదకలేరు
కలదు కలదొక్క మాల మీ కంఠమందు
పూర్వ జన్మల కర్మలు పొందుపరచి
మంచియైనను చెడుగైన త్రుంచకుండ
బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల
కర్మలన్నియు చేర్చిన కంఠమాల..
అదే వనమాల. కనుక మనము మంచిని చేసి మంచి మాలను ధరిస్తాము. చెడ్డ పనులు చేసి చెడ్డమాలను ధరించనక్కర లేదు.
(బృత్ర. పు. 22/10)
కర్మ ఫలితమనేది ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుందో, ఎలాంటిది వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. అది అప్పటికప్పుడే రావచ్చు. కొన్ని గంటలలో రావచ్చు. కొన్ని దినములలో రావచ్చు. కొన్ని నెలలలో రావచ్చు. కొన్ని జన్మలలో రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ : పొరపాటున చేయి కోసుకుంటే తక్షణమే రక్తం వస్తుంది. భోజనం చేసిన తక్షణమే ఆహారం జీర్ణం కాదు, జీర్ణం కావడానికి రెండు మూడు గంటలు పడుతుంది. విత్తనం నాటిన తక్షణమే అది వృక్షం కాదు. మూడు నాల్గు దినములకు మొక్క బయలు దేరుతుంది. అది వృక్షం కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ తరువాతనే ఫలము లభ్యమవుతుంది. కనుక, కర్మఫలితం ఈ జన్మలోనే గాక వచ్చే జన్మలో కూడా వెంటాడుతుంది. మంచిగాని, చెడ్డగాని కర్మఫలితం తప్పదు. అయితే, కర్మఫలితం తప్పనప్పుడు ఇంక, దైవాన్ని ప్రార్థించటం ఎందుకు? అని మీరు ప్రశ్నించవచ్చు. దైవాన్ని ప్రార్థించవలసింది. ఈ బాధల నివారణ కోసం కాదు : మనశ్శాంతికోసం దైవాన్ని ప్రార్థించాలి. అది మీకు లభ్యమైతే ఈ కష్టములు, నష్టములు దూరమైపోతాయి. దైవానుగ్రహం మీ కర్మఫలితాన్ని రద్దు చేయగలదు. అది రద్దు కావటానికి మీ ప్రార్థన అవసరం, దైవ ప్రార్థనవల్ల మీకు ఎన్నో విధములైన మేలు జరుగుతుంది. అయితే, ఆ ప్రార్థన మీరు హృదయ పూర్వకంగా చేయాలి. ప్రేమస్వరూపులారా! మీ కష్టములకు, నష్టములకు భగవంతునిపై నింద వేయకండి. ఎలాంటి పరిస్థితులందైనా భగవంతుణ్ణి ప్రార్థించటం మీ కర్తవ్యం. ఎంత వరకు? నేను జీవుడను, తాను దేవుడు" అనే భేదం ఉన్నంత వరకు ప్రార్థించాలి. నేనే ఆతడు, అతడే నేను అనే ఏకత్వ స్థితి వచ్చినప్పుడు ఇంక ప్రార్థించ నవసరం లేదు.
(స. సా. మే 99. పు. 135)
ఒకానొక సమయంలో మండోదరి “రావణా! నీవు చేయరాని పనులను చేస్తున్నావు. పవిత్రమైన స్త్రీలను బాధిస్తున్నావు. ఇది మంచిది కాదు. స్త్రీలు అగ్నితో సమానం. వారిని చూపులతో గాని, మాటలతోగాని, చేష్టలతో గాని హింసించడం మహాపాపం. ఈనాటి నీ చెడ్డ చూపులు, చెడ్డ భావములే రేపు చెడ్డ ఫలితముల నందిస్తాయి. కర్మ ఫలితము తప్పదు. నేడో రేపోకాకపోయినా వచ్చే జన్మకైనా తప్పించుకోలేవు. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించు. నేను చాల గొప్పదాననే, నాతండ్రి రాక్షస చక్రవర్తి, నాభర్త రాక్షస చక్రవర్తి, నా కుమారుడు ఇంద్రుని జయించిన మహావీరుడు. అయినప్పటికీ ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయం నన్ను పట్టి పీడిస్తున్నది. కనుక నీవు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది" అని హెచ్చరించింది. కాని రావణుడు మండోదరి మాటలను లెక్క చేయలేదు.
చివరికి మండోదరి భయపడినట్లుగానే యుద్ధంలో రాక్షస వీరులందరూ మరణించగా రావణుడు మాత్రమే మిగిలాడు. మండోదరి ఇంక ఆఖరియత్నంగా మళ్ళీ రావణుని వద్దకు వెళ్ళి "రావణా! రాముడు సామాన్యుడు కాడు. కోతులను పట్టుకొని సముద్రంపై వంతెన కట్టాడంటే ఇది మానవమాత్రునికి సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికైనా కాలం మించిపోలేదు. నా మాట విని సీతను రామునికి అప్పజెప్పి అతని పాదము పట్టి క్షమించమని ప్రార్థించు" అని బోధించింది. "నా ప్రాణమునైనా విడుస్తాను కాని,
రాముని పాదం మాత్రం పట్టను" అన్నాడు రావణుడు. మండోదరి "వినాశకాలే విపరీత బుద్ధి:" అని చింతిస్తూ వెళ్ళిపోయింది.
(శ్రీ భ..పు.83)
(చూ: త్రిగుణములు, త్యాగము)