నిర్గుణీ నిష్క్రియో నిత్య నిర్వికల్పో నిరంజనః
నిర్వికారో నిరాకారో నిత్యముక్తో హి నిర్మలః
గుణములు లేనిది. ఎట్టి కర్మలూ ఎరుగనిది, నిర్వికారమైనది. ఆకారము లేనిది ఒకటున్నది. అదియే ప్రేమ. ఈ ప్రేమకే ఆత్మ అని పేరు పెట్టారు. ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు ఏ రీతిగా గుర్తించగలడు? ఈ ప్రేమ బుద్ధియొక్క వ్యాయామము కాదు, మానసిక మార్గము కాదు, స్వప్నమునందలి ప్రతిబింబము కాదు. అన్నింటి యందు ప్రాణసమానమైన సత్యము ప్రేమయే. అయితే ప్రేమస్వరూపము ఎట్లా ఉంటుంది? ఆచరణ స్వరూపములో ఇది మనకు సాక్షాత్కరిస్తుంది. ప్రేమను వర్ణించుటకు కవిత్వము చాలదు. భాషలేదు. మనస్సునకు, వాక్కునకు అతీతమైనది. ప్రేమస్వరూపమే భగవత్స్వరూపము. భగవంతుడు ప్రేమస్వరూపుడు.
(ద.స.98 పు.84)