జ్ఞానికి పునర్జన్మలేదు. ఏమిచేసినా తాను చేసినాని అనుకోడు. అందుచేత అతనికి బంధములేదు. అజ్ఞాని ఏ పనిచేసినా, తానే చేశాననుకుంటాడు. తెలిసికోవలసినది తాను తెలిసికోడు. పూర్వ జన్మ కర్మల యొక్క బాధ్యత యిద్దరికి సమమే. దీనికంతటికి కారణము మనస్సే, జనన మరణములకు మనస్సేకారణం. మోక్షానికి మనస్సే కారణము. అన్ని విషయాలకు కారణం మనస్సే.
(సాజ పు. 429)
జ్ఞానులలో నాలుగు విధములు కలరు. 1) బ్రహ్మవిత్
2) బ్రహ్మ విద్వరః 3) బ్రహ్మవిద్వరీయాన్ 4) బ్రహ్మవిద్వరిష్టు –
ఇది జ్ఞాని యొక్క సాత్విక గుణాభివృద్ధి ననుసరించి నాలుగు విధములుగా చేసిన విభజన.
ఇందులో మొదటివాడు బ్రహ్మవిత్తనెడి జ్ఞాని పత్యపత్తి అనేది నాలుగవ భూమికలో నుండును. రెండవ వాడైన బ్రహ్మ విద్వరః అనెడి జ్ఞాని అసంసక్తి అనేడి ఐదవ భూమిక యందుండును. మూడవవాడైన బ్రహ్మవిద్వరీయాన్ అను జ్ఞాని పదార్థభావన అనేది ఆరవ భూమిక యందుండును. నాలుగవవాడైన బ్రహ్మవిద్వరిష్ట: అనెడి జ్ఞాని ఏడవ భూమికయందు తురీయావస్థలో నుండును. ఏడవ భూమికయందున్న బ్రహ్మ విద్వరిష్టుడు ఎల్లప్పుడు సమాధిస్థితి యందుండును. బ్రహ్మవిద్వరిష్టుడు విదేహముక్తుడు, అతనికి అన్న పానాదులు సహితము బలాత్కారముచే తినిపించ వలసివచ్చును. లోకమునకు ఏ పనియూ చేయడు. అట్టివారికి దేహస్పృహ యుండదు. బ్రహ్మవిత్తుగాని, బ్రహ్మవిద్వరుడుగాని, కొంత దేహజ్ఞానమును కలిగియుందురు. వారి వారి యొక్క సంస్కారమును అనుసరించి ప్రపంచమున పనిచేయుదురు. ఇట్టివారికి మనోనాశనము ప్రధానము. మనోనాశనమనగా మనస్సును అంతమొందించుట. ఇవియు రెండు విధములు. 1. స్వరూప నాశమనగా చిత్తములో కూడా రూపమును నాశనమొనరించుట. 2. అరూపనాశము అనగా చిత్తమును మాత్రమే నశింపవేయుట.
ఎవనియందు రాగద్వేషములు మద మాత్సర్యములు ఉండవో, ఎవనికి ఇంద్రియ భోగములందాసక్తి యుండదో, అట్టి మానవుడు ఎవడైనను సరే, వాడు మనోనాశము కలవాడని చెప్పబడును. అతని చిత్తము ఏ విధముగను వృత్తులు కలిగి యుండదు. స్వరూప నాశమనెడి చిత్తముకల జీవన్ముక్తునికి రాజస తామసములు నశించి సత్వము మాత్రము మిగిలి యుండును. అట్టి శుద్ధ సత్వగుణముచేత అతడు మైత్రి కరుణ కలవాడై యుండును. విదేహ ముక్తుని యందు శుద్ధ సత్వము కూడా నశించును.
(జ్ఞా, వా, పుట 15)
శాస్త్రజ్ఞానమును ఆచార్యులద్వారా శ్రవణము చేసిన కొంత సహాయ కారులే కానీ నిజాకారమును చూపించలేరు. అనుభవజ్ఞానముతో పాటు అసూయరహిరుడై పరమ రహస్యమైన ఆత్మతత్త్వమును యెవడు తెలుసుకొనునో వాడే పరిపూర్ణ జ్ఞాని అని తెలుపవచ్చును. .
(గీ. పు. 161)
మట్టి రోడ్డుపై బస్సు ప్రయాణిస్తుంటే దాని వెనుకనే మట్టి కూడా లేస్తూ వస్తుంటుంది. అయితే, బస్సును నిలుపకుండా పోయినంత కాలం ఈ మట్టి బస్సు పైన పడలేదు. కాని, ఎక్కడైన బస్సు నిలిపితే, వెంటనే వెనుక మట్టి వచ్చి బస్సుపై పడుతుంది. అయితే, బస్సును తారు. రోడ్డుపై నిలిపితే ఇంకదానిపై మట్టి పడదు. అదేవిధంగా మనం, మొట్టమొదట కర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ క్రమ క్రమంగా ఉపాసనా మార్గంలో ప్రవేశించాలి. ఉపాసనా మార్గం "కంకర రోడ్డు" వంటిది. ఇక్కడ మట్టికూడా తక్కువగా ఉంటుంది. ఈ ఉపాసనా మార్గం నుండి మరల ప్రయాణిస్తూ జ్ఞాన మార్గమనే "తారు రోడ్డులో" చేరాలి. అంతవరకూ మనం కర్మలను మానకూడదు. అదే ఒక దీక్ష. కర్మతో ప్రారంభమై, జ్ఞానముతో అంత్యము కావాలి. కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. అప్పుడు ఆకర్మయే జ్ఞానంగా మారి పోతుంది. ఇది ఎట్లంటే - పుష్పమును మనం పోషిస్తూ వస్తే అది కాయగా మారుతుంది. కాయను మనం సంరక్షించుకుంటూ వస్తే అదే పండుగా మారుతుంది. కాబట్టి పుష్పం - కర్మ మార్గం, కాయ - ఉపాసనా మార్గం, పండు - జ్ఞాన మార్గం. కాని ఈ మూడు ఒక్కటే. కనుక, కర్మనుండియే జ్ఞానం లభిస్తుందనే విశ్వాసాన్ని పెంచుకోవాలి. కర్మమార్గంలో ప్రవేశించకుండా జ్ఞానాన్ని పొందలేము. చాలమంది "నాకు జ్ఞానం ఉంటే చాలులే" అని భావిస్తుంటారు. అటువంటి వాడే అజ్ఞాని, కర్మలో మునిగిన వాడే నిజమైన జ్ఞాని.
(శ్రీభ.ఉ. పు. 124/125)
జనకుడు జ్ఞాని. నిత్యమూ అద్వైతానుభూతిలో ఉండేవాడు. సులభ అనే ప్రఖ్యాత తార్కికురాలు ఒకనాడు జనకుని దగ్రకు వెళ్ళి వాదించింది, ‘ జ్ఞానదృష్టికి మానవులందరూ ఒక్కటే! కాబట్టి నన్ను నీ రాణిగా స్వీకరించి,పండితులు సమదర్శనులని నిరూపించు అంటుంది. అప్పుడు జనకుడు, జ్ఞానదృష్టికి అందరూ ఒక్కటే కనుక, స్త్రీ పురుష విభేదం ఉండదు అని చక్కగా సమాధానము చెప్పి సులభకు నిజమైన జ్ఞానోదయం కలిగించాడు. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు 86-87)
(చూ|| ఆత్మధర్మము,
నన్ను చేరగోరువారు, పండితుడు, బ్రహ్మసాక్షాత్కారజ్ఞానము, వెలుగు, శివుడు, శుభేచ్ఛ భూమిక, సంశయము)