పంచ భూతముల, పంచ ప్రాణముల, పంచకోశముల లోపల యున్నది ఆత్మతత్వము. దానిని సాధన ద్వారా అనుభూతిలోకి తెచ్చుకోవలయును. విలువైన సామ్ము ఇంటిలోపల భద్రం చేస్తారు. అట్లాగే ఆత్మ తత్వమును అంతరంగంలో వెతకాలి. నౌకరు స్థితిలో యున్న వారికి అది దొరకదు. యజమానుడుగా తయారు కావాలి ....... అప్పుడే ఆత్మ రత్నమునకు అర్హుడు. బహిర్దృష్టి వున్నంతవరకు బానిసలే. అంతర దృష్టిని సంపాదించిన తక్షణమే గుహలోని ఆత్మాకారము నందు జ్యోతి ప్రకాశించి ప్రకటమగును.
(సా. పు. 270)
చిన్న చిన్న విషయాలలో కూడా మనం విచారణ చేస్తే, సత్యం ఉండదని సులభముగా అర్థమవుతుంది. I want peace, నాకు కావాలి శాంతి అంటారు. ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి. అంటే Ego దీనిని తీసివెయ్యి. Want అంటే కోరిక. ఇది కూడా తీసి వెయ్యి. మిగిలినది peace. Ego and Desire ప్రక్కన పెట్టుకొని, peace కావాలంటే ఏ విధంగా లభిస్తుంది? కనుక మనము ఆధ్యాత్మిక విషయాలలో కూడా, సరియైన రీతిగా అద్వైత భావంలో యోచిస్తే ఆత్మతత్త్వము ఎంత సులభమైనదో ఎంత సున్నితమైనదో, ఎంత గౌరవమైనదో, మనకు సులభంగా అర్థమవుతుంది.
(పా. పు. 278)
నిజముగా ఆత్మతత్వము వస్తువులను ప్రకాశింపచేసేదే గాని మరొక చైతన్యము చేత ప్రకాశింపబడేది కాదు. ఇది సమస్తమునకు ద్రష్టస్వరూపమును ధరిస్తుంది. వస్తు స్వరూపమును చూచిన సమయమందు సమస్త జగత్తు కూడా దృశ్యముగా రూపొందుతుంది. కన్నులుండి కూడా ఆలోచనా నిమగ్నుడగుట చేత, ఎవరెదురున్నారో, ఏమి చెప్పుచున్నారో వినటముగాని, చూడటముగాని జరుగదు. కన్నులు కూడా దృశ్యమే! మరొక స్థితి యందు మనస్సు కూడా దృశ్యముగా రూపొందుతుంది. సర్వసంకల్పముల చేరికయే మనస్సు. బుద్ధి కూడా మనస్సును అనుసరించియే ఉంటుంది. దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణముఇవన్నీఆత్మ యొక్క ఉపాధులే! ఆత్మతత్వమునకు మార్పులు ఉండవు. అది శుద్ధ చైతన్యము. దేహమునకు చావు పుట్టుకలు: పరిణామ క్షీణములు, అభివృద్ధి, అసంతృప్తులు. ఆత్మకు ఇట్టి పరిణామములు గాని,క్షీణదశలుగాని,చావు పుట్టుకలుగాని ఉండవు.
(శ్రీ భ. ఉ..పు.7)
ఒకసారి పోతే తిరిగి రానిది, ఒక్కసారి వస్తే తిరిగి పోనిది, రాకుండా- పోకుండా స్థిరంగా ఉండేది- ఈ మూడు విషయాలను గూర్చి మానవుడు తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. ఒకసారి వస్తే తిరిగి పోనిది - అదే జ్ఞానం, వచ్చి పోయేది జ్ఞానం కాదు. జ్ఞానం వచ్చిన తరువాత స్థిరంగా నిలిచిపోవాలి. ఒక్కసారి విశ్వాసం కలిగితే, ఆ విశ్వాసాన్ని పెంచుకొనుటయే మానవ కర్తవ్యం. మానవుడనగా “విశ్వాసం కల జీవి" అని ఉపనిషత్తు తెలిపియున్నది. కాని, నేటి మానవులలో శ్వాస ఉన్నది కాని, విశ్వాసం లేదు. ఏమి ప్రయోజనం? విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టాలి. కొంతమంది "పూర్వం నాకుభక్తి చాలా ఉండేది గాని, ఇప్పుడు ఎందుకో సన్నగిల్లి పోతోంది" అని అనుకొంటారు. ఇది చాలా పొరపాటు. ఇప్పుడు నీలో భక్తి సన్నగిల్లి పోతోందంటే, పూర్వం కూడా ఆ భక్తి నీలో స్థిరంగా ఉండి యుండదు. భక్తి ఉంటే ఎప్పటికీ తగ్గిపోదు. తగ్గిపోతే భక్తి ఉండినది కాదు.
ఇంక రెండవది: ఒక్కసారి పోతే తిరిగి రానిది, అదే-- అఙ్ణానం, మూడవది: పోకుండా రాకుండా స్థిరంగా ఉండేది అదే - "బ్రహ్మతత్వం". ఇది నిర్గుణం. నిరంజనం,సనాతనం,నికేతనం,నిత్యశుద్ధ,బుద్ధ,ముక్త నిర్మల స్వరూపం. అదే ఆత్మ తత్వం.
(శ్రీ భ.. ఉ.పు.125)
“ఆత్మతత్త్వ మెరుగ ఆనందమబ్బును
తత్త్వ మెరుగకున్న తామసుండగు
బ్రహ్మమెరిగినంత బ్రహ్మంబె అగునయా
సత్యమైన మాట సాయిమాట".
బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనే సూక్తి ననుసరించి బ్రహ్మమెరిగినవారు సాక్షాత్తూ బ్రహ్మయే యగుదురని ఒక సందర్భంలో ఉద్ఘాటించారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. అట్టి బ్రహ్మజ్ఞానమును బోధించుటయే తత్త్వవేత్తలైన గురువర్యుల కర్తవ్యము, కృషి, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మనుండి కలియుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి వరకు అవతార పురుషులందరూ బోధిస్తున్నది, నిగూఢమైన ఆత్మతత్త్వమే! అదియే నిజమైన జ్ఞానము. (భాష్యార్థ గోప్యములు పు. 143)