తనకంటె వేరైనది జగత్తునందు లేదు.ఉన్నదంతా వున్నదానియెక్క ప్రతిబింబములే. లోక సంబంధమైన విషయాలకు, కర్త కర్మ క్రియ యీ మూడు వుంటుంటాయి. కానీ ఆత్మ సంబంధమైన విషయము నకు ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప, క్రియ, కర్మ ఉండవు. చేసేవాడు తానే, చేయించేవాడు తానే, చేయింపబడినదీ తానే. ఈ మూడింటి ఏకత్వముతో కూడిన ఆత్మతత్వమే సర్వత్రా నిండిన చైతన్యము. ఒక దగ్గరవుండి మరొక దగ్గర లేకుండా వుండటానికి వీలులేదు. ఈ చైతన్యమునే మూడు భాగములుగా విభజించి సామాన్య లోకానికి సంతృప్తిపడె నిమిత్తమై సత్ చిత్ ఆనందము అని పేరు పెట్టినారు. దాని ప్రతిబింబము యిది దీని ప్రతిబింబము అది అని వేదాంతులు చూపుతూ వచ్చారు. దీనినే వేదాంతమునందు అస్తి భాతి ప్రియం అన్నారు. ఈ మూడు కూడా ఒక్కటే. ఈ టంబ్లరు యిక్కడ వున్నది. ఇది అస్తి; సత్. ఇంక చిత్ అది మనము చూస్తున్నాము. చూడటమే కాకుండా యిది టంబ్లరని తెలుసుకున్నాము. సత్ చిత్. ఇంక ఆనందము దీనిని మనము అనుభవిస్తున్నాము. ఇదే ఆనందము. సత్ చిత్ ఆనందము మూడైందా యిది? లేదే?; ఒక్కటే. ఉన్నది ఒక్కటే, ప్రకాశించేది ఒక్కటే, ఆనందింపచేయునది ఒక్కటే, ఒక దాని యందు అనేక భ్రాంతులచేత అనేకత్వముగా అనుభవించి అనేక రూపనామములు కల్పిస్తున్నాము. కనుక ఆత్మతత్వము అనగా ఏకత్వముతో కూడిన దివ్యత్వమనే సత్యాన్ని గుర్తించాలి. ఆత్మ అనగా రూపములేనిది. అనేక రూపములు ధరించేది.
(బృత్ర, పు. ౧౨౮)
చైతన్య తత్వము తత్వాన్ని అర్థము చేసుకోవటం చాల కష్టము. ఈ చైతన్యమును Consciousness అన్నారు. ఈ Consciousness ను గుర్తించటానికి, అర్థము చేసుకోవటానికి దాని భాగమైన Conscienceను తయారు చేసుకున్నాము. దీనినే witness అని, awareress అని, సాక్ష్యము అని, చెప్పారు. ఈ సాక్ష్యమునకు ఏదైనా ఆధారము కావాలి కదా? దానివల్లనే ఈ conscience నుండి conscious వచ్చేసింది. Consciousness, conscience, conscious ఈ మూడింటి తత్వము మూడు గుణములుగా మారిపోయింది. conscious అనేది senses తో కూడినది. conscience అనేది మనసుతో కూడినది. Consciousness అనేది ఆత్మతో చేరింది. ఈ మూడింటి తత్వములనే లోకాచార నిమిత్మమై ఈ రకముగా విభజించినాము.(బృత్ర, పు ౧౨౮)
“సమస్తమూ చైతన్యమే. అంతా దైవమే" "ఈశావాస్య మిదం సర్వం" ఈ చరాచర సృష్టి అంతా దైవస్వరూపమే. దుర్లభమైన మానవజన్మ ఎత్తిన నీకు నీవు కూర్చున్న ఈమెట్లకు Body consciousness" (దేహాభిమానం )లో తేడా వచ్చింది. నీవు కూర్చున్న మెట్లలో కూడా చైతన్యముంది. ఆ మెట్టును నీవు చేతితో గట్టిగా కొట్టినావనుకో, నీకు నొప్పి కల్గింది కదా! అనగా, అది కూడా తిరిని నిన్ను కొట్టిందన్నమాట. దానిలో ఆ శక్తి ఉన్నది. అదే చైతన్యము.(స.సా..మే. 2002 పు. 156)
(చూ॥ ఆనందము, ప్రకృతి)