ఇస్లామ్ మతమునకు చంద్రుడు, నక్షత్రము ప్రధానమైన చిహ్నములు. దీనిని హిందువులు కూడా అను సరిస్తున్నారు. "చంద్రమా మనసో జాతః" మనస్సు అనేది చంద్రుడని చల్లగా, తెల్లగా ప్రకాశిస్తూ సర్యులకు శాంతి భద్రతలు కల్పించేది అని దీనికి సరియైన అర్థము.
హజరత్ మహమ్మద్ వాక్యాన్ని అనుసరించి ఈనాటికి రంజాన్ నెల మొదటి చంద్రుని దర్శనముతో ప్రారంభించి రెండవ చంద్రుని దర్శనముతో ఉపవాస దీక్షను విరమిస్తుంటారు మహమ్మదీయులు.
ఖురాన్లో అందరూ ఐకమత్యముతో, ప్రేమలో అన్యోన్యమైన అనురాగముతో దైవత్వమును మాత్రమే చింతించాలని ఉంది. ఆధునిక యుగములో దేహసంరక్షణ నిమిత్తమై దినమునకు ఐదు పర్యాయములు మానవుడు భుజిస్తున్నాడు. అస్థిరము, అశాశ్వతము అయిన దేహము కోసము 5 పర్యాయములు మనము భుజిస్తుంటే, నిత్య సత్యమైన ఆత్మ తత్వమునకు కూడా ఆహారమును అందించవలసిన అవసరము లేదా అని ఇస్లామ్ వాదిస్తుంది. ఆత్మ ప్రకాశమునకు కూడా ఆహారము అవసరమని చెప్పింది. ఏమిటి ఈ ఆహారము? ప్రార్థన, 5 పర్యాయములు ప్రార్థన చెయ్యాలి. బుద్ధి వచ్చి బాలుడు మొదలుకొని, అంతిమ శ్వాస విడువనున్న వృద్ధునివరకు రోజూ ఐదు పర్యాయములు ప్రార్థన విధిగా చెయ్యాలని ఇస్లామ్ నిబంధన. అందు లో ఏకాంత ప్రార్థన కేవలము స్వార్థ పరమైనదని సామూహిక ప్రార్థన సరియైనదని కూడా ఇస్లామ్ బోధించింది.
ఎంత ద్వేషము, విరోధ మున్నప్పటికీ - ఒకరిమీద ఒకరు కక్షలు సాధిస్తున్న వారు కూడా సమాజమునందు ప్రార్ధనలోనూ, అంత్యసమయములోనూ ఏకము కావాలని ఇస్లామ్ శాసించింది. ఏకాభిప్రాయమును ఆచరించి అనేకత్వములో ఉన్న ఏకత్వాన్ని నిరూపించడమే ఇస్లామ్ పరమ లక్ష్యము.
దీక్ష ఇస్లామ్ కి మాత్రమే పరిమితమైనది కాదు. హిందువులు కూడా మాఘమాస వ్రతమని, శ్రావణమాస వ్రతమని ఒక్కొక్క మాసమునందు ఒక్కొక్క వ్రతమును పాటిస్తుంటారు. అదే విధముగ ఇస్లామ్ మతమేకాక, పర్షియన్ మతమునందు, జోరాష్ట్ర మతమునందు, క్రైస్తవ మతమునందు ఒక్కొక్క మాసములో ఒక్కొక్క ఉపవాస దీక్షను అనుసరిస్తున్నారు. ఈ విషయాన్ని అర్థము చేసికొనక, భేదాభిప్రాయములను పెంచుకొని కక్షలకు దిగుతున్నారు. అన్ని మతములు ఐకమత్యమునే బోధిస్తున్నాయి. ఐకమత్యములేని మతము మతము కాదు. దైవము అన్నిటియందు ఒక్కటిగా ఉంటూ ఒకే మార్గాన్ని బోధిస్తున్నాడు.
ఇస్లామ్ మతము నీతి, నిజాయితీలను నిరూపిస్తూ వస్తున్నది. భగవంతుని ప్రసన్నుని గావించేవి పాండిత్యము గాని, ధనముగాని, దేహశక్తులు గాని కావు. నీతి నిజాయితీలతో కూడిన ప్రేమే భగవంతుని ప్రసన్నుని గావిస్తుందని ఇస్లామ్ చెప్పింది. పవిత్ర ప్రేమను ప్రతి మతము కూడా బోధిస్తున్నది. అయితే ఈనాడు మనము ప్రేమ తప్ప అన్నింటిని అనుసరిస్తున్నాము. ఈ రంజాన్ సమయములో దూరపు బంధువులంతా చేరుతుంటారు. ద్వేషమున్న వారంతా ఏకమై పోతుంటారు. ఇదంతా కూడా మానవత్వ ఏకత్వాన్ని నిరూపించడం కోసం. మసీదు దాని కొక చిహ్నము. దేహజీవతత్వాలను విసర్జించి ఆత్మతత్వాన్ని స్థిరముగా నిలుపు కోవడమే అమరత్వమునకు చిహ్నమని ఈ రంజాన్ దిన సందేశము. అనిత్యమైన దేహ భావములను, జీవితత్వాన్ని సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకొని, సత్యమైన ఆత్మతత్వమును ప్రకటింప జేయడానికి, ప్రకాశింప చేసు కోవడానికి తగిన కృషి చెయ్యడమే రంజాన్ అంతరార్థము. దీనిని గుర్తించి నేటి నుండీ, ఏ మతమైనా, అన్ని సమత్వాన్ని గురించి చెప్పేవే గనుక - అందరూ ప్రేమను సహనాన్ని, సానుభూతిని సత్యమును ప్రకటించుకోవాలని, స్థిరము చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
(స. సా..ఆ.83, పు. 186/187)
(చూ॥ ఖురాన్, హిందువు)