"ఇంద్రియంబులు మనసు నిల్పిన
అంధుడైనను మోక్ష మందును
ಇಂద్రియంಬು ನಿಲకడలేనిది
చంద్రుడైన పసందు పొందడు."
(శ్రీ స.వే.ప్ర పు.59)
ఒక యింద్రియము ఒక విషయము పై పరుగెత్తునప్పుడు ఆ విషయమునుండి తప్పించి యింకొక విషయము పైన మరలించటానికి తగిన శిక్షణ యివ్వాలి. ఇంద్రియమునకు ధికమైన విషయమును నిరూపింపచేసినప్పుడు దాని మార్గము వదలి సరైన మార్గములో ప్రవేశిస్తుంది. ఒక దొంగపశు వుందనుకోండి. అది పంటలో పడి మేయటానికి పోతుంటాది. అంతకంటే మంచి పచ్చిగడ్డిని మనము యింటిలో వేస్తే అది పంటకే పోదు. ఇంటి దగ్గరనే వుండి మేస్తుంది. ఆశించిన దానికంటె వుత్తమమైన దానిని మనము అందిస్తే ఉత్తమమైన మార్గములో ప్రవేశిస్తుంది. ఇంద్రియములను పశువులు అన్నారు. బయటి దృష్టి కలిగినది పశువు; లోదృష్టి కలిగినవాడు పశుపతి అన్నారు. మానవుడు పశుపతి కావాలిగాని పశువు కాకూడదు. మాస్టర్ కావాలిగాని స్లేవ్ కాకూడదు. ఇంద్రియానికి బానిసలైపోతే స్లేవ్ అయిపోతాయి. ఇంద్రియానికి నీవు మాస్టర్.
(బృత్రపు ౫౦)
ఈ యింద్రియములను నియమించటానికి అనేక రకములైన మార్గములుంటున్నాయి. ఈ యింద్రియములు భోగము ఎక్కడనుండి పుట్టింది అని విచారణ చెయ్యాలి. ఇవి దుఃఖమునుంచే పుట్టాయి. .
(బృత్రపు ౫౦)
మన యింద్రియములను సరైన రీతిగా అదుపులో పెట్టుకోవటమే కాదు. వానిని సమన్వయ పరుచుకోవాలి. "యోగః చిత్తవృత్తి నిరోధ:" అన్నారు. చిత్త వృత్తి నిరోధించటము మహాకష్టము. అసాధ్యము. సమన్వయము గావించుకోవటము సులభము. మంచిని స్వీకరించు. చెడ్డ తనంతతానే దూరమై పోతుంది.
(బృత్రపు ౫౩)
ప్రతివ్యక్తియందు తన యింద్రియములచేత కలిగే ప్రమాదము లధికముగా వుంటాయి. కనుక మానవుని యందు యీభ్రమ పూర్తిగా పోవాలి. ఈ భ్రమ మానవుని చాలా క్రుంగదీస్తుంది.
(బృత్ర.పు, ౫౩ /౫ ౪)
ఇంద్రియములు మహాశక్తివంతమైనవి. సమస్త సుఖ దుఃఖములకు ఈ ఇంద్రియములే మూల కారణము. కనుక వీని స్వభావాన్ని గుర్తించి వీని రూపనామములు అనుభవించి వీనిని సరియైన మార్గములో ప్రవేశపెట్టటానికి తగిన కృషిచేయాలి. ఒక గొప్పకవి ఇంద్రియముల గురించి గానం చేసాడు.
దుర్బుద్ధులు తలలున్నా దూరులు చెప్పే నోరున్నా
పొంచి చూచుకనులున్నా పంచలవిను చెవులున్నా
వంచనగుణ చిత్తమున్న వంచించే మనసున్నా
ఈ వికృతులు చూడగనే న్యాయము ఇక బ్రతుకదన్నా.
(బృత.పు. ౫౮)
ఇంద్రియములకు మాత్రా అను పేరు గలదు. "మీయతే అనయామాత్రా". అనగా కొలతలను నిర్ణయము గావించుటయే యీ యింద్రియముల ప్రభావము. ఇంద్రియములు కొలత ఏవిధముగా గావించు చున్నది? ఈ ఫలము తీయగా ఉన్నది, లేక పుల్లగా ఉన్నది అని నిర్ణయించే అధికారము దేనికున్నది? దీనిని కొలతవేసే యింద్రియము ఏమిటి? అదియే నాలుక. ఈ చిత్రములను నిర్ణయించే కొలత దేనికి వున్నది? దీని కొలంబద్ధ కన్ను మాత్రమే. ఇది దుర్గంధము యిది సుగంధము అని నిర్ణయించే కొలతబద్ద ముక్కు. ఇది సుస్వరము యిది దుస్వరము అని నిర్ణయించే కొలత బద్ద కర్ణము. ఇంద్రియములకు నిర్ణయించే ఆధికారమున్నది కనుకనే దీనికి మాత్రా అని పేరు.
ఇంద్రియములకు మాత్రా అనగా పరిమిత మని మరొక అర్థము. ఒక్కొక్క యింద్రియమునకు ఒక్కొక్క పరిమితిని మాత్రమే నియమించినాడు భగవంతుడు. కన్ను చూడగలదే గాని వినలేదు. నోరు మాట్లాడగలదే గాని చూడలేదు. ఇట్లా ఒక్కొక్క యింద్రియమునకు ఒక్కొక్క విధమైన, నిర్ణీతమైన నిబంధన ఉంది. ఈ నియమములను ఎవరు సక్రమముగా నడచుకొందురో వారే భగవదాజ్ఞను పరిపాలించిన వారవుతారు. ఎవరీ నియమముల నుల్లంఘింతురో వారు శిక్షకు గురి అవుతారు. కనుక ఒక్కొక్క యింద్రియమును దాని నిర్ణయానుసారముగా ఉపయోగించుకొని దానిని రక్షించుకోవటానికి ప్రయత్నించాలి.
(బృత్రపు ౪౪/౪౫)
ఇంద్రియములను సమన్వయపరిచే మార్గము ఒకటి వున్నది. మంచి చెడ్డలు రెండును సమత్వముగా భావించి ఆనందముగా కాలము గడపాలి ...
ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఎవరిచేతకాదని నిరుత్సాహ పడనక్కరలేదు.భ క్తి ప్రపత్తులచేత యింద్రింయములను స్వాధీన పరచుకోవచ్చును. వాతావరణము యేమాత్రము అడ్డురాదు. మన భావము పరిశుద్ధముగా వుండాలి. మనం బయటి వాతా వరణమును యేమాత్రము పాటించరాదు. నీయొక్క చిత్తము, నీయొక్క పవిత్రమైన భావము పరిశుద్ధమైన సమన్వయము గావించుకోవాలి.
(బృత్రపు ౪౮.౪౯)
ఇంద్రియములకు లొంగినవాడు Mister.
ఇంద్రియములకు లొంగనివాడు Master.
(భా.త్ర. పు. 1)
" ఇంద్రియములను నిల్పెనా అంధుడై నను మోక్ష మొందును
ఇంద్రియంబుల నిగ్రహించనిచంద్రుడైనను వర్చస్సు లేదు”
(భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నవరాత్రిదివ్యోపన్యాసములు పుట118)
ఇంద్రియాలు మానవుణ్ణి ఉన్నత లక్ష్యం నుండి క్రిందికి లాగుతుంటాయి. అందుకే వాటిని వశపరచుకోవాలి. ఇంద్రియాలమీద ఆధిపత్యం లేనంతకాలం ధ్యానంలో గడిపే గంటలు, ఉచ్చరించే పవిత్రమైన పలుకులు, చేసే పూజలు అన్నీ వ్యర్థం. అవి కేవలం శారీరక కసరత్తుల వంటివి. (సనాతన సారథి, సెప్టెంబరు 2021 పు17)