ఇంద్రియ పటుత్వం లేనివాడు రాజ్యపాలనకు అనర్హుడని రామాయణం బోధిస్తున్నది. ఒకనాటి రాత్రి దశరథ మహారాజుకు దాహం వేసి ఒక జగ్గులో నుండి టంబ్లర్ లోకి మంచినీరు పోసుకొనుచుండగా తన చేయి అదరడం గమనించి తనకు వృద్ధాప్యం ప్రారంభమైనదనీ, ఇంద్రియ పటుత్యం సన్నగిల్లిందని గ్రహించాడు. ఇంక తనకు మహారాజుగా కొనసాగే అధికారం లేదని భావించి, వెంటనే వశిష్ఠుల వారిని రప్పించి, శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టించాడు. కానీ, ఈనాటి పాలకులను క్రేనుతో ఎత్తి ప్లేనులో కూర్చో పెట్టవలసి వచ్చినా, కనీసం సంతకం చేయడానికి కూడా శక్తి లేకపోయినా తమ పదవిని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడరు.
(స. సా.జులై,98, పుట,172)
ఒకనాటి రాత్రి దశరథుని కొక కల వచ్చింది. సముద్రంలో నీరంతా ఇంకిపోయి నట్లుగా, చంద్రుడు క్రిందపడి ముక్కలు ముక్కలై పోయినట్లుగా, మదపుటేనుగు క్రిందపడి ప్రాణం విడిచినట్లుగా, దానిపై నున్న సింహాసనము క్రింద కూలినట్లుగా అతనికి కనిపించింది. వెంటనే అతడు లేచి కూర్చున్నాడు. "ఏమిటీ విచిత్రము! నాల్గవ ఝాములో వచ్చిన స్వప్పం నిజమౌతుం దంటారు. ఇది నాల్గవ ఝామే కనుక ఈ స్వప్నము యొక్క అంతరార్ధ మేమిటో అని తనలో తాను చాల బాధపడుతున్నాడు. పడక పై నుండి క్రిందికి దిగి ప్రక్కనే ఉన్న నిలువుటద్దములో తన ప్రతిబింబాన్ని తాను చూసుకున్నాడు. తలపై అక్కడక్కడ తెల్లవెంట్రుకలు కనిపించాయి. అనగా తనకు వృద్ధాప్యము ప్రారంభమైనదని గుర్తించాడు. ప్రక్కనే ఉన్న జగ్గు నుండి కప్పులోకి నీరు పోసుకోవడానికి ప్రయత్నించగా చేతులు కాస్త అదిరాయి. అంటే ఇంద్రియశక్తి కూడా క్షీణించినదని గమనించాడు. "ఇంద్రియశక్తి ఉన్నంతవరకు ఈ రాజ్యాన్ని పరిపాలించాను. ఇప్పుడు నా ఇంద్రియశక్తి క్షీణించింది. కనుక, నేనింక రాజ్య పరిపాలన చేయుటకు అనర్హుడను" అని భావించాడు. వెంటనే తన గురుదేవులను, మంత్రులను పిలిపించాడు. "నేనింత కాలము ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించాను. ప్రజాభీష్టమే నా అభీష్టమని భావించాను. ఇప్పుడు నా ఇంద్రియశక్తి క్షీణించింది. కనుక నా జేష్టపుత్రుడైన రామునికి పట్టాభిషేకం చేయ దల్చుకున్నాను" అన్నాడు. కాని ప్రజలు, మంత్రులు "మహారాజా! మీకింకా రాజ్యపాలన చేయగల శక్తి ఉన్నది. కనుక మీరే ఇంకా కొంతకాలం పరిపాలిస్తే బాగుంటుంది" అన్నారు. ఈ మాటలు విని దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయడం వీరెవ్వరికీ ఇష్టం లేదేమో అనుకున్నాడు. పాపం! మంత్రులు వెంటనే, "మహారాజా! రాముడు మహాగుణవంతుడే కాని, మీకున్న అనుభవం అతనికి లేదు కదా! ముందు రాముని యువరాజుగా చేసి రాజ్యపాలనలో అతనికి మార్గదర్శకత్వం వహించండి" అన్నారు. చూశారా! ఇంద్రియ పటుత్వం లేనివాడు రాజ్యపాలనకు అర్హుడు కాడన్నాడు. దశరథుడు. కాని ఈనాటి నాయకులు కన్నులు కనిపించకపోయినా, చెవులు వినిపించకపోయినా, చేతితో సంతకం చేయడానికి వీలుకాకపోయినా ఇంకా రాజ్యం ఏలాలని ఆశిస్తున్నారు.
(స.పా.మే.97 పు 130/131)