ప్రప్రథమముననే మనకొక వింత భావము కానవచ్చును. ఇవియే ఋక్కులు. అనగా తేజోరూపులను గూర్చినవి. ఇట్టి దేవుళ్ళు అనేకులు కలరనియు, ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు, పర్జన్యుడు అనునవి కొందరి పేర్లు. వీరు ఒకరి వెనుక ఒకరు కనుపింతురు. ఇట్టివాడే వజ్రాయుధుడగు ఇంద్రుడు. భూలోకమునకు వర్షము వచ్చునట్లు చేసిన ప్రతీతుడు. అందువలన భారతీయులు ఇంద్రుని పూజింతురు. ఇంద్రుడనగా ఇంద్రియములకు అధిపతియైన మనస్సుకు ఇంద్రుడని పిలిచిరి. ఇతనికి పురుహూతుడని రెండవ పేరు. పురు అనగా అనేక పర్యాయములు; హూతుడు అనగా ఆహ్వానింప బడువాడు. మనస్సు ఇంద్రునిగా రుద్రునిగా వేదములలో కీర్తింపబడినది. ఇంద్రియములను జయించి తాము వానిలోనికి సర్వాంతర్యామిత్త్వం పొందుచున్నపుడు ఆ మనస్సే రుద్రుడు.
అందువలననే వేదములోని ఇంద్రుడు, రుద్రుడు, రెండు నామములుగా వైభవముగల ఒకే దేవతగా వర్ణించిరి.
తక్కిన దేవతలను గూర్చి కూడా ఇట్టి వర్ణనముల నెన్నియైన ఉదాహరింపవచ్చును. చివరి కొకే విధమున అంతా వర్ణింపబడుచుందురు.
(స.వా, పు.13)