ప్రేమ్ చంద్ పేరు ప్రఖ్యాతులు గాంచిన రచయిత. ఒక రోజున అతడు సతీసమేతంగా నైనిటాలికి ప్రయాణమై వెళుతుండగా, వారికి వీడ్కోలు చెప్పడానికి అతని ఇద్దరు కుమారులు అలహాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చారు. ట్రైన్ బయల్దేరే ముందు పెద్ద కుమారుడు తలిదండ్రు లిద్దరికీ పాదాభివందనం చేశాడు. రెండవ కుమారుడు మాత్రం పండ్లాము జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడుతూ రైలు బయల్దేరగానే "టాటా" అంటూ వారివైపు చేతులూపాడు. రైలు బయల్దేరిన తరువాత ప్రేమ్ చంద్ ముభావంగా ఉండటం గమనించి అతని భార్య కారణం అడిగింది. "చూశావా, చిన్నవాడు మనకి నమస్కరించ లేదు" అన్నాడు. "పోనిద్దురూ, వాడు నమస్కారం చేయక పోతే మనకొచ్చిన నష్టమేమిటి?" అన్నది. దానికి ప్రేమ్ చంద్ "మనకి నమస్కరించ లేదని కాదు. వాడి మనస్తత్వాన్ని గురించి, వాడి భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నా" అన్నాడు. కాలక్రమేణ అతని పెద్ద కుమారుడు అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితు డయ్యాడు. చిన్న కుమారుడు అదే కోర్టులో గుమాస్తా పనిలో చేరాడు. హైకోర్టుకి వచ్చిన వారందరూ పెద్ద కుమారునికి నమస్కరిస్తుంటే, వచ్చిన వారందరికీ చిన్న కుమారుడు నమస్కరించవలసి వచ్చింది. తల్లిదండ్రులను గౌరవించలేని వ్యక్తి సమాజంలో గౌరవాన్ని పొందలేడు.
(స. సా.. మా99, వెనుక కవరుపుట)