మానవత్వము

సత్యము ధర్మముతో చేరాలి. ధర్మము ప్రేమతో ఉండాలి.ప్రేమ శాంతంతో అనుభవించాలి. ఈ శాంతము అహింసలో ప్రవేశించాలి. అప్పుడే ఇది ఏకత్వమనే దివ్యత్వంగా రూపొందుతుంది. అనేకత్వాన్ని ఏకత్వంగా చేసినప్పుడే ఈ ఏకత్వంలోనే మానవత్వం వస్తుంది. ఇట్టి మానవత్వంలోనే ఏకత్వం సులభంగా ఏర్పడుతుంది. ఈ ఏకత్వంలో స్వచ్ఛత సహజంగా వస్తుంది. ఈ స్వచ్చత దివ్యత్వంలో ప్రవేశిస్తుంది.ఏకత్వం, దివ్యత్వం, స్వచ్ఛత మూడింటి సమ్మిళిత స్వరూపం ఈ మానవత్వం. దీనిని పిల్లలకు ఏరీతిగా మనం బోధించాలి? బోధించడానికి ముందు అధ్యాపకులు-బోధకులు తాము అనుభవించి తామ ఆచరణలో పెట్టినప్పుడు చూచి నేర్చుకోవటం మరింత సులభమవుతుంది. అధ్యాపకులు ఒక పుస్తకంగా తయారు కాకూడదు. ఆచరణతో మస్తకాన్ని తయారుచేసుకోవాలి. మానవత్వ గుణమనే దానిని కేవలం ఒక విషయ మాత్రంగా మనం తీసుకోకూడదు. Information కాదు, Transformation కావాలి. ఈ విధంగా పరివర్తితులై పిల్లలకు చెప్పడానికి ప్రయత్నించాలి. ఈ మానవత్వ గుణములను ఒక బోధనా విషయంగా భావిస్తున్నాము. ఇది ప్రత్యేక బోధనాంశం కాదు. మన జీవిత కర్తవ్యమనే మాట మరచి ఇదేదో బోధన పరమావధి ఏమిటి అని మొదట మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మానవత్వం - ఇదే మన జీవిత పరమార్థం. శరీరము, మనస్సు ఆత్మల చేరిక ఏర్పడితే ఈ మానవత్వం అలవడుతుంది. ప్రత్యక్ష పరోక్షములందు కూడా మనం ఏకత్వంగా ప్రవర్తించాలి. ఎక్కడికి వెళ్ళినా మానవత్వ గుణమనేది శరీరాన్ని వెంబడించే నీడ మాదిరిగా ఉండాలి.

(స.సా.పి.85 పు.42)

 

పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్యా పునర్మహిః ,

ఏ తత్సర్వం పునర్లభ్యం నశరీరం పునఃపునః

ప్రేమస్వరూపులైన యువతీయువకులారా,

భావి ప్రపంచ పౌరులారా!

 

ధనము కోల్పోయిన మరల సంపాదించుకోవచ్చు. మిత్రుడు పోయినప్పటికి మరొక మిత్రుని సంపాదించుకోవచ్చు. భార్య పోయినప్పటికి మరొక వివాహమాడ వచ్చును. భూమిని కోల్పోయిన తిరిగి మనము దానిని సంపాదించుకోవచ్చు. శరీరము పోతే తిరిగి మనము సంపాదించుకోలేము. అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు. మానవుడు ఉత్కృష్టమైనవాడు, సౌజన్య సౌశీల్యముతో కూడినవాడు. ఇట్టి మానవత్వమును కోల్పోయిన యింక తిరిగి మనకు లభ్యము కాదు.

 (శ్రీ.స.పు.1)

 

నైతికము, ధార్మికము, అధ్యాత్మికము - ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే మానవత్వము. కాని, మానవు డీ నాడు ఈ మూడింటిని విస్మరించాడు. మానవత్వమనగా ఎంత పవిత్రమైనదో విచారిస్తే ఈనాటి మానవుడు సిగ్గుపడవలసి వస్తుంది. సత్యము. ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణముల చేత వర్ధిల్లిన ఈ భారత దేశంలో ఈనాడు ఎక్కడ చూసినా నిర్ధయ, స్వార్థము, కఠినత్వము ఇత్యాది దుర్గుణములు తాండవ మాడుచున్నవి. ప్రేమ అనేది ఎక్కడా కనిపించడం లేద. ఈనాడు మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. కాని, ఆయా మహానీయులు ప్రబోధించిన మంచి విషయాలను భూమిలో పూడ్చి పెడుతున్నారు. ఎందుకీ ఆడంబరాలు? ఎందుకీ నాటకాలు? విగ్రహములను పూజించడం, ప్రబోధములను విస్మరించడం మానవత్వం కాదు. మానవునికి మానవునికి మధ్య గల సంబంధ భాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వము,

(శ్రీభ.ఉ.పు.208)

 

సత్యాన్వేషణ సలిపి న్యాయమును విచారించి పవిత్రమైన ధర్మమార్గమును ప్రవేశింప చేసేదే మానవత్వము,మానవుడు సత్యవ్రతుడు, ధర్మపరాయణుడు న్యాయమే ఇతనికి ఆటపట్టు,

(బృత్ర.పు.58)

 

ఆకారము మానవకారముండవచ్చును. దానవ గుణములచేత ఈ మానవత్వాన్ని మరుగుచేయవచ్చును. ఆకారమును చూచి మానవత్వముగా భ్రమించరాదు. నిజమైన మానవత్వ మనగా: మానవ -మా అనగా కాదు నవ అనగా కొత్తది. కొత్తది కానిదే మానవత్వము. దీనికి మరొక అర్థమున్నది. మూడక్షరములతో కూడిన మా....మా అనగా అజ్ఞానము న అనగా లేకుండా, వ అనగా వర్తించటము. అజ్ఞానము లేకుండా వర్తించేవాడు అనేది సరైన అర్థము. ఆజ్ఞానమునకు గురియై అశాంతికి లోనై దివ్యమైన ఆత్మజ్ఞానము లభించాలంటే ఏరీతిగా సాధ్యమవుతుంది? ఈ మానవత్వమనే దివ్యత్వమునుమొట్టమొదట అర్థము చేసుకోవాలి. అర్థము చేసుకొనక నానార్థములతో అనర్ధములు మాత్రమే ఉంచుకొని యధార్థమును విసర్జించటంచేత సత్యస్వరూపమును గుర్తించటానికి వీలుకాదు.

 

ఆకుపచ్చ పక్షులన్ని చిలుకలవలె పలుకునా?

పువ్వులపై పారాడెడు పురుగులు తుమ్మెదలగునా?

పులిచర్మము కప్పినట్టి గాడిద తా పులియగునా?

ఏనుగంత బలిసియున్న పంది ఏనుగగునటయ్యా?

 

మానవత్వమనగ మనసు మాట క్రియయు, అన్ని ఒక్కటిగానె అతికి యుంట,మాటయందు వేరు పనులయందు వేరు, వచనమందు వేరు" ఈ విధమైన మార్గము అనుసరించినప్పుడు మానవత్వము ఎట్లా అవుతుంది? దహింపబడేది కనుకనే యిది దేహము, జీర్ణించేది కనుకనే యిది శరీరము. ఇలాంటి తత్వముచేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి. దేహము ఒక నీటిబుడగవంటిది. ఏక్షణములో యీబుడగ నీటిలో లీనమవుతుందో, ఈ నీటి బుడగ ఎక్కడనుండి వచ్చింది?

 

నీటియందె పుట్టి నీటియందె పెరిగి

నీటియందడంగ నీటిబుడగ

నరుడు బద్బుదంబు నారాయణుడు నీరు

 

ఈ బుడగ నీటినుండే పుట్టినప్పుడు నరుడుకూడను నారాయణునినుండియే ఆవిర్భవించినవాడు. ఈ సత్యాన్నిగుర్తించినప్పుడే శరీరమును అలక్ష్యము చేయక అశ్రద్ధ చేయక తగినరీతిగా దీనిని పోషించుకోవటానికి కృషి చేస్తాము. ఇది ఒక పనిముట్టు అయినప్పటికిని దీనికి తగిన హద్దులు, హంగులు ఉండాలి.

(బృత్ర.పు.29/30)

 

అసలు, మానవత్వమంటే ఏమిటి? మనసు, మాట, క్రియ అన్ని ఒకటిగా అతికి యుండుట. మనసువేరు, మాట వేరు క్రియవేరు. అయిన ప్రయోజనమేమి? తలచిన తలపులు, మాటలతో ఉచ్చరించి ఉచ్చరించిన మాటలు క్రియలలో ఆచరించాలి. దీనినే "మనస్యేకం,వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం అట్టి మహాత్యుడే రాముడు. మనస్యన్యత్, వచస్యన్యత్, కర్మణ్యన్యత్ దురాత్మనం" అట్టి దురాత్ముడే రావణుడు. మానవుడు ఆచరించ వలసినటువంటి సత్కర్మలను మనస్సు నందుతలంచి, వాక్కులతో ఉచ్చరించి, క్రియలలో ఆచరించాలి. ఇట్టి మానవత్వాన్ని మనము పోషించాలి.

(స.సా.జూ.1989పు.143)

 

“మానవత్వముయొక్క అద్వితీయమైన విలువను గుర్తించలేనప్పుడు మానవుడుగా పుట్టి ఉపయోగమేమిటి? జంతూనాం నరజన్మ దుర్లభం. మానవజన్మ అత్యుత్తమమైనది. అటువంటి పవిత్రమైన మానవజన్మ యెత్తినందుకు మానవుడు బాల్యమునుండి తన సకలేంద్రియములను భగవంతునివైపు మరల్చాలి”  (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు6)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage