మానవతా విలువలలో ప్రధానమైనది, ప్రాణ సమానమైనదిప్రేమ. ప్రేమ లేక సత్య, ధర్మ,శాంతి, అహింసలు ఉండలేవు. ఇట్టి ప్రేమతత్యాన్ని మరచిపోవడం చేతనే మానవుడు స్వార్థమునకు లోనై దుఃఖానికి గురి అవుతున్నాడు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను మానవుని పంచ ప్రాణములైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములతో పోల్చ వచ్చును. మానవుడు తన కష్ట నష్టములను నివారించుకొనవలెనన్న ఈ పంచప్రాణములను పోషించుకోవాలి. కానీ ఈనాడు మానవుడు పలికే పలుకునందు సత్యము సడలిపోతున్నది. మానవుడు వేసే ప్రతి అడుగు అధర్మంలో పడుతున్నది. మానవునిప్రేమ కేవలం లౌకిక మైనదిగా, కృత్రిమమైనదిగా కనిపిస్తున్నది. అందుచేత ఎక్కడ చూసినా శాంతి కనిపించడం లేదు. బుద్ధుడు "అహింసా పరమో ధర్మః" అన్నాడు. కాని ఈ నా డు అహింస అనేది కనిపించడం లేదు. ఎక్కడ చూసినా హింసనే, హింసనే! ఈ విధంగా ఈనాటి మానవుడు పంచప్రాణములను కోల్పోయిన శవం మాదిరి తయారైనాడు. ఇలాంటి పరిస్థితులందు మానవునికి శాంతి, సుఖములు ఏరీతిగా లభ్యమౌతాయి.
(స.. సా.ఆ.99పు.261)
(చూ॥ ఆరోగ్యమే మహాభాగ్యము, మానవజీవితము, భారతదేశము,శాంతి, హ్యుమానిటి)