ప్రేమస్వరూపులారా! మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ ఆత్మతత్త్వమును అర్థం చేసుకొనకపోతే అన్నీ వ్యర్థమే. సంపాదన ప్రధానం కాదు. ఉద్యోగం స్థిరం కాదు. అయితే, ఉన్నంత వరకు ఇవన్నీ చేయవలసినవే. కానీ, ఇవే ప్రధానమని భావించకూడదు. విద్య యొక్క పవిత్రతను, విద్య యొక్క పరమావధిని అర్థం చేసుకోవాలి. మీరు నేర్చిన విద్యలను సమాజమునకు అర్పితం గావించి, సమాజ సంక్షేమమునకు కృషి చేసి జీవితాన్ని సార్థకం గావించుకోవాలి. ఈనాడు సమాజ సంక్షేమాన్ని ఆశించేవారు లేకపోలేదు. "జగతియందు పుణ్యపురుషులు లేకున్న జగములెట్లు వెలుగు పగలుగాను " కానీ, అలాంటి మహనీయులు చాల అరుదుగా ఉన్నారు. భగవంతుడుప్రేమ స్వరూపుడు. ప్రేమమయుడు. కనుక, భగవంతుణ్ణి పొందాలనుకుంటే ప్రేమనే మీ జీవితానికి పునాదిగా తీసుకోవాలి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు తగిన భద్రత నిచ్చేది ప్రేమయే. “సత్యంబ్రూయాత్” (సత్యము చెప్పవలయును) *ప్రియం బ్రూయాత్” (ప్రియము పలుకవలయును) “న బ్రూయాత్, సత్య మప్రియం"(సత్యమయినను అప్రియమగుచో చెప్పరాదు). ప్రియమని అసత్యమును చెప్పరాదు. ఇవే నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విలువలు. ఈ మూడింటి ఏకత్వమే మానవ జీవితము. మొట్టమొదట మానవ జీవితాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నవాడు కాలాన్ని వ్యర్థం చేయడు.
(స.సా.ఆ.99పు.270)
మానవ జీవితమనే బండిలో ప్రయాణం చేసే ప్రయాణికుడే ఆత్మ, ఆ బండిని నడిపే డ్రైవరు బుద్ధి. ఆ బండిని లాగేవి ఇంద్రియములు, వాటికి పగ్గములు వివేక వైరాగ్యములు. ఆ బండికున్న చక్రములు ఒకటి కాలచక్రము, మరొకటి కర్మచక్రము. ఆ చక్రములకున్న ఆకులే ధర్మనియమములు, వాటి చుట్టూ ఉన్న వర్తులాకారమేప్రేమ, ఇరుసు సత్యము. ఇక చేరవలసిన లక్ష్యము శాంతి!
(వ.61-62 పు.26)
ఈనాడు మీరు రక్షించవలసినది. దేశాన్ని కాదు. సత్యధర్మాలను రక్షించాలి. అనుసరించాలి. అవే దేశాన్ని రక్షిస్తాయి. ప్రేమను పెంచుకోవాలి. సర్యులను ప్రేమించాలి. సర్యులను సేవించాలి. కుల మత జాతి బేధములను త్యజించి, దైవ పితృత్వమును, మానవ సౌభ్రాతృత్వమును ప్రగాఢంగా విశ్వసించాలి. సోమరితనమును విసర్జించాలి. సమాజ సేవ చేయాలి. మీకు క్షేమాన్ని, సౌఖ్యాన్ని సదుపాయాల్ని సౌకర్యాల్ని సమకూర్చిన సమాజంపట్ల కృతజ్ఞతను ప్రకటించాలి. మానవతా విలువలను పోషించుకుని మాథవత్వమును అందుకునే ప్రయత్నం చేయాలి. దైవం నుండి ఆవిర్భవించిన మానవుడు దైవంయొక్క గుణములనే కలిగియుండాలి. "నేను మానవుడు" అని మీరు చెప్పుకుంటున్నారు. కానీ, ఇది పూర్తి సత్యంలో అర్ధ భాగం మాత్రమే."నేను పశువును కాదు" అనేదే మిగిలిన అర్ధసత్యం. మనిషి లక్షణాలు పశు లక్షణాలురెండింటితో కూడిన మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సు గలవాడు సగం గ్రుడ్డివానితో సమానం.
మానవత్వంలోని దివ్యత్వమును, భిన్నత్వంలోని ఏకత్వమును గుర్తించి అనుభవించాలి. అందు నిమిత్తమే భగవంతుడు మీకు ఈ దివ్యమైన భవ్యమైన, నవ్యమైన మానవ జీవితాన్ని అనుగ్రహించాడు. నీతిలేని వాణిజ్యము.సిద్దాంతము లేని రాజకీయము, మానవత్వము లేని శాస్త్ర పరిజ్ఞానము, శీలము లేని విద్య నిరర్థకము, అనర్థదాయకము. మానవ జాతికి నీతి, నిజాయితీలు ప్రధానమైనవి. జాతి గౌరవం నీతి పై నిలుచును; నీతి లేకయున్న జాతి చెడును. నీతి కలిగిన జాతియే నిజమైన జాతి. నీతి లేనివాడు కోతికంటే హీనుడు.
ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు మూడు - లోకాన్ని నమ్మవద్దు. దైవాన్ని మరువవద్దు. మృత్యువుకు వెఱువవద్దు. త్రికరణ శుద్ధిని, పవిత్రతను పెంచుకోండి. కోరికలను తగ్గించుకోండి. తృప్తిగలవాడే అందరికంటే ధనవంతుడు. మితిమీరిన కోరికలు గలవాడే అందరికంటేబీదవాడు. అణాలు ముఖ్యం కాదు, గుణాలు ముఖ్యం. జీవిత గమ్యాన్ని గుర్తుంచుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. ఆహార, నిద్ర. భయ, మైథునాదులు పశుపక్ష్యాదులకు కూడా ఉన్నవి. మానవులైన మీరు కూడా వీటికే పరిమితమైతే ఇంక మీకు, పశుపక్ష్యాదులకు తేడా ఏముంటుంది. ఈనాడు ముఖ్యంగా మీరు చేయవలసింది మరొకటి ఉన్నది - నోరు మూసుకోండి: హృదయాన్ని తెరుచుకోండి. సమాజ సేవకు మీ శరీరాన్ని అంకితం చేయండి: మీ లక్ష్యాన్ని దైవంపై ఉంచండి. తలలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి. చేతులతో సేవ చేయాలి. గ్రామ సేవయే రామ సేవ. మానవ సేవయే మాధవ సేవ. పల్లె ప్రజలకు పారిశుద్ధ్యమును గురించి. ఆరోగ్యమును గురించి వివరించండి. వారికి వైద్యసేవల నందించండి. నీటి సౌకర్యాన్ని కల్పించండి. దరిద్ర నారాయణ సేవ సల్పండి.. వారు దురభ్యాసములను విడనాడేటట్లు చేయండి. యజ్ఞ యాగ జప ధ్యాన అర్చనాదులకన్న సేవయే ప్రధానమైనది.అధికమైనది. కనుక, స్వార్థమును విసర్జించి పరార్థములో ప్రవేశించిండి. అహంకారము, అసూయ, అభిమానము, మమకారము మున్నగు దుర్గుణాలకు చోటివ్వక వినయము, నిరాడంబరత, విధేయత, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్యపాలన వంటి సద్గుణాలను పోషించుకోండి. దుర్గుణాలు పులులు, తోడేళ్ళవంటివి, సద్గుణాలు గోవులవంటివి. క్రూర మృగాలు గోవులను బ్రతకనివ్వవు కదా, కనుక మీ హృదయంలో దుర్గుణాలకు చోటివ్వక, మానవతా విలువలను నిర్భయంగా పోషించుకోండి.
(స.సా.సె.99పు.249/250)
మానవ జీవితమునకు ప్రధానమైనవి మూడు: వ్యక్తిత్వము, కుటుంబము, సమాజము. ఈమూడింటి యొక్క సంబంధమును ప్రతి ఒక్కరు గుర్తించాలి. కొందరు వ్యక్తిత్వమునకే ప్రాధాన్యతనిస్తారు. మరికొందరు కుటుంబానికి, వ్యక్తిత్వానికి ప్రాధాన్యతనిస్తారు. ఎక్కువమంది సమాజమును పట్టించుకోరు. కానీ అందరు గుర్తించవలసినది - సమాజము క్షేమముగా ఉండినప్పుడే కుటుంబము, వ్యక్తి క్షేమముగా ఉండగలరు అన్నది. మానవుడు సమాజములో పుట్టి సమాజములో పెరిగి సమాజములోనే అంతమవుతాడు. జలమునుండి వేరైన చేప ఏవిధంగా జీవింపజాలదో అటులనే మానవుడుకూడా సమాజమునకు దూరమై జీవించలేడు. సమాజము అనేక దళములతో కూడిన ఒక కమలమువంటిది. అందులోని దళములు వ్యక్తులనే సూచిస్తాయి. ఏ ఒక్క దళము వీడిపోయినా ఆ పుష్పముయొక్క పటుత్వము, శోభ తరిగిపోతుంది. కాబట్టి, విద్యార్థులు సమాజ క్షేమానికి కృషిచెయ్యాలి. సమాజ ధర్మములను గుర్తించి వర్తించాలి. సమాజ మర్యాదలను గుర్తించనివారిని సమాజమే దూరం చేస్తుంది. సమాజ ధర్మములను, మర్యాదలను గుర్తించినవారినే సమాజము ప్రేమిస్తుంది. సమాజము యొక్క క్షేమమునకు కృషి చేయదలచినవారు స్వార్థమును త్యాగము చేసి సేవ చెయ్యాలి. (స.సా. డి.2021పు.11)