ప్రేమస్వరూపులారా ! నిజంగా భారతదేశం ఎంతటి పుణ్యభూమో, జ్ఞానభూమో. కర్మభూమో, త్యాగభూమో, యెగభూమో చెప్పలేము. ఇట్టి పవిత్రమైన భారతదేశంలోనే పుట్టి ఇక్కడే మరణించాలని విదేశీయులు కూడా ఎంతో ఆశించారు. మ్యాక్స్ ముల్లర్ తనకు ఏ జన్మ వచ్చినా భారతభూమిలోనే జన్మించాలని కోరుకున్నాడు. వేదమును సరియైన రీతిలో విచారణ సల్పి నాడు మ్యాక్స్ ముల్లర్. భారతదేశములోని ప్రతి మట్టికణము పవిత్రమైనది అన్నాడు. ఇంతటి సత్యాన్ని గుర్తించినవాడు కనుకనే, మ్యాక్స్ ముల్లర్ ను "మోక్షముల్లర్ అన్నారు. విదేశీయులే ఇట్టి పవిత్రతను అందుకొని ఆనందాన్ని అనుభవిస్తుంటే భారతీయులు మాత్రం దీనిని మరచి పోతున్నారు. విత్తనం చెట్టుగా మారిపోతున్నది. గ్రుడ్డు పెట్టగా మారిపోతున్నది. బిడ్డ తల్లిగా మారిపోతున్నది. కాని, మానవుడు దేవుడుగా పరివర్తన చెందటంలేదు. మానవత్వం నుండి దానవత్వానికి మారిపోతున్నాడు. ఇది మంచిది కాదు. ముందుకుపోవాలి. ప్రమోషన్ రావాలి. కాని, రివర్స్ లో పరుగెత్త కూడదు పశుత్వం నుండి వచ్చారు. మానవత్వంలో జీవిస్తున్నారు. దివ్యత్వముతో అంత్యము కావాలి. ఇదే మానవత్వము. (స.సా.మా.96పు 69/70)
దేశమే మీ తల్లి, సంస్కృతే మీ తండ్రి
విద్యార్థులారా! “నా బిడ్డలైన భారతీయులు ఏవిధంగా ప్రవర్తిస్తారో, ఏవిధమైన అపకీర్తి తెస్తారో”, అనే చింతతో కంటిధారలు కార్చుతున్నది భరతమాత. కేవలం విద్యార్థులే కాదు, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలకు చెందినవారందరి గురించి చింత పడుతున్నది భరతమాత. ఏ ఆశ్రమం కూడా సరైన తృప్తిని అందించడంలేదు భరతమాతకు. కట్టకడపటికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి కూడా కంటిధారలు కారుస్తున్నది. “కేవలం మనిషి మారుతున్నాడే కాని, మనసు మారడం లేదే; గుడ్డలు మారుస్తున్నారే కాని, గుణములు మారడం లేదే. వీరి గతి ఏమిటి?” అని చింతిస్తున్నది. ఇంక, ఈ దేశంలో భరతమాత తత్త్వమును ఏవిధంగా గుర్తించుకోవడానికి వీలౌతుంది?! తల్లినే గుర్తించుకోలేని బిడ్డలు ఎలాంటి బిడ్డలు? తల్లియే మన దేశము. తండ్రియే మన కల్చర్. కాబట్టి, మాతృదేశమును, మన కల్చర్‌ను సరియైనరీతిలో కాపాడుకోవాలి.
అనేక దేశములవారు ప్రశాంతి నిలయానికి వచ్చి వారివారి సంస్కృతిని, ఆచారములను చక్కగా ప్రదర్శించినట్లుగా, మీరుకూడా ఎక్కడకు వెళ్ళినా మీ సంస్కృతిని వదలకూడదు. కాని, మనవారు పరదేశానికి పోతే మన ప్రాచీన సంప్రదాయాన్ని మరచిపోతారు. అసలు మన దేశభాషనే మరచిపోతారు. ఏమిటీ వింత! ఇంతకాలం ఈ దేశంలో పెరిగి ఒక్క పది దినాలు అమెరికాకు పోయారంటే, ఇంక అమెరికా భాష తప్ప మరొకటి రాదు వీళ్ళకి! ఎంతమందో మన ఆంధ్రదేశం నుండి అమెరికాకు వెళ్ళిన పిల్లలు వెనక్కి వచ్చిన తరువాత, "ఏమిరా! ఏమి చదువుతున్నావు?” అని ప్రశ్నిస్తే, I don t know Telugu (నాకు తెలుగు తెలియదు) అంటారు. ఇంక, ఏమిటి వీళ్ళకి తెలిసింది? తల్లిభాషనే మరచి పోయినవాడు తల్లిని మరవడా? ఏ దేశమువారైనా సరే, ఎవరి కల్చరు వారు పాటించాలి. వేరొకరి కల్చరు విమర్శించరాదు.
భవ్యభావాలు కలిగిన భారతీయ
దివ్యసంస్కృతి తత్వంబు తెలుసుకొనగ
భారతీయులె యత్నింప నేర్వరి
ఇంతకన్నను దౌర్భాగ్యమేమి కలదు!
ఒకానొక సమయంలో ఒక ఐ.సి.ఎస్. ఆఫీసర్ మ్యాక్స్ ముల్లర్ ను చూడాలని పోయాడు. ఆ సమయంలో మ్యాక్స్ ముల్లర్ వేదాలను ట్రాన్స్ లే ట్ చేస్తున్నాడు. అందులో ఏదో ఒక పదానికి అర్థం తెలియక డిక్షనరీలను తిరగేస్తున్నాడు. ఆ సమయంలో ఈ ఆఫీసర్ తన విజిటింగ్ కార్డును అతనివద్దకు పంపించాడు. ఆ కార్డుపైన చతుర్వేదశాస్త్రి అని ఉంది. మ్యాక్స్ ముల్లర్ దానిని చూసి, “ఆహా! వేదంలో ఏదో ఒక పదానికి అర్థం తెలియక నేను అవస్థపడుతుంటే - సమయానికి చతుర్వేదశాస్త్రీయే స్వయంగా వచ్చాడు” అని ఆనందంతో గేటు దగ్గరకు పోయాడు. సగౌరవంగా లోపలకు తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి కాఫీ, టిఫిన్ ఇచ్చాడు. “మీ రాకతో ధన్యుడనైనాను. ముఖ్యంగా, నేనిప్పుడు వేదాలను అనువదిస్తున్నాను. మీ పేరే చతుర్వేదశాస్త్రి. కనుక ఈ పదానికి అర్థమేమిటో చెప్పగలరా?” అని అడిగాడు. “నాన్సెన్స్! ఈ వేదాలంతా ఏమిటి? నాకేమీ తెలియదు” అన్నాడా ఐ.సి.ఎస్. ఆఫీసర్. "అయ్యో! భారతదేశంలో పుట్టి చతుర్వేదశాస్త్రి అని పేరు పెట్టుకొని, వేదములు నాన్సెన్స్ అంటున్నాడే! ఛీ, ఛీ.. ఇలాంటి భారతీయుల మొహం నేను చూడకూడదు” అనుకున్నాడు మ్యాక్స్‌ముల్లర్. విదేశీయులే మన సంస్కృతిని, వేదశాస్త్రాలను గౌరవిస్తుంటే మనవాళ్ళు మాత్రం ఈ గౌరవాన్ని కోల్పోతున్నారు. మొట్టమొదట మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి; వేదశాస్త్రాల సారాన్ని గ్రోలాలి; భారతీయులమనే కీర్తిని మనం నిలబెట్టుకోవాలి.
ఇది నాదు మాతృదేశము
ఇది నా ప్రియ మాతృభాష ఇది నా మత మం
చెదగొట్టి నుడువనేరని
బదికిన పీనుగొకండీ వసుధను గలడా!
దేశాభిమానము లేనివాడు చచ్చినవానితో సమానం. దేశముయొక్క పేరును నిలబెట్టినవాడే నిజంగా బ్రతికి ఉన్నట్లు లెక్క. ఈనాడు మనం సంపాదించినది స్వరాజ్యమే గాని స్వారాజ్యము కాదు. స్వారాజ్యము అంటే ఆత్మకు సంబంధించినటువంటిది. ఆత్మను మనము ఎప్పుడు అనుసరిస్తామో అప్పుడంతా క్షేమమే కలుగుతుంది; ప్రపంచమంతా క్షేమంగానే ఉంటుంది; ఉన్నత స్థితికి వస్తుంది. కనుక, మనం స్వతంత్ర్యం వచ్చిందని ఆనందిస్తే సరిపోదు; స్వారాజ్యమును సాధించాలి. (సనాతన సారథి, ఆగస్టు 2022 పు10-11)