గాయత్రి మంత్రమందు "భూర్భువస్సువః"అని ఉన్నది. ‘భూర్’ అనగా, భూలోకమని అనుకుంటున్నారు. భూలోకమంతయు కేవలం పదార్థములయొక్క (మెటీరియల్స్) చేరికయే. అన్ని మార్పు చెందునవే, ఏదీ శాశ్వతం కాదు. ఈ దేహము కూడా నీరు, సున్నము, ఇనుము, సబ్బు మున్నగు పదార్థములతో కూడినది. కనుక, భూర్ అనగా దేహమే. ఇదే మెటీరియలైజేషన్ (materialisation). రెండవది భువః ఇదియే ప్రాణమయము. దీనినే వైబ్రేషన్ (vibration) అన్నారు. దేహమనే మెటీరియలైజేషన్ ఉన్నప్పటికీ ప్రాణమయమనే వైబ్రేషన్ లేకపోతే దేహానికి ఏమాత్రము చలనం ఉండదు.
ఈ వైబ్రేషన్ సోర్సు ఏది? దీనియొక్క సోర్సు ఫోర్సు ప్రజ్ఞానం నుండి ప్రారంభమవుతున్నది. దానినే రేడియేషన్ (radiation) అన్నారు. ఇదే వేదమునందు “ప్రజ్ఞానం బ్రహ్మ", "అయమాత్మా బ్రహ్మ", "తత్త్వమసి", "అహం బ్రహ్మస్మి" అనే మహా వాక్యాలలో చెప్పబడింది. ఆ రేడియేషన్ ద్వారానే ప్రాణమనే వైబ్రేషన్ పని చేస్తున్నది. రేడియేషన్ లేకపోతే వైబ్రేషన్ కే ఏమాత్రం చలనం లేదు. ‘వైబ్రేషన్ లేకపోతే మెటీరియలైజేషన్’ (దేహము) జడమైనదిగా రూపొందుతుంది. ఈ మూడింటి చేరికయే మానవత్వం.
(సా.శ్రు.పు.30/31)
(చూః హిరణ్య గర్భ తత్త్వం)