ప్రజలారా! ఇహపరలోక సుఖముల ననుభవింపగోరు వారు నా మాటలను లక్ష్యములో నిడుకొని వానిని మరువక సంచరించుతారు. అన్ని మార్గములకంటే సంసారమును దాటుటకు భక్తిమార్గమే సులభము, మనోహరమైనది. సంసారమును దాటుటకు జ్ఞానమార్గమే కష్టము. ఆ మార్గమున అనేక విఘ్నములు కలుగును. మనో నిగ్రహము దుర్గభము, జ్ఞానమార్గమున నడచినవానికి భక్తిలేని యెడల నాకు ప్రియుడు కాడు. భక్తివంటిది మరొకటి లేదు. దానికి స్వతంత్రము కలదు. దాని వలన సకల సుఖములు కలుగును. సత్సాంగత్యము లేనియెడల భక్తి కలుగదు. ఓ జనులారా! మీకు మరొక రహస్యమును చెప్పుచున్నాను, వినుడు. శివకేశవుల కేవిధమగు భేదములు లేవు. భగవంతుడు ఒక్కడే అని విశ్వసింపుడు. రూప నామములు వేరువేరు గాని దివ్యాత్మ ఒక్కటే. అది అందరియందునూ సమముగనే యున్నది అనిన రాముని అమృతపానమగు వచనములను విని పురజనులు శ్రీరామచంద్రునకు శిరస్సులు వంచుకొని నమస్కరించిరి. (రా.వా.రె.పు.226)
భక్తి మార్గము గోనుడు,
ఇహపరములిచ్చి, సత్యముగ
మిమ్ము సాకును సాయిబాబ.
(స. సా. జ.2013 పు. 21)