సత్సాంగత్యముచేతను, మహనీయుల సందర్శనము చేతను, వారి దివ్యబోధనలను ఆలకించుటచేతను, భగవదనుగ్రహముచేతను మీ మనో ప్రవృత్తులు మారవచ్చును. అంగుళీమాలునికి బుద్ధభగవానుని దర్శన సంభాషణలచేత జ్ఞానోదయం కలిగింది. రత్నకారుడు నారద మహర్షి యొక్క ప్రబోధలచేత వాల్మీకి మహర్షిగా మారిన ఉదంతము మీకు తెలియనది కాదు. క్షాత్ర ధర్మమును విస్మరించి, దర్మపరిరక్షణమనే కర్తవ్యాన్ని మరచి తమోగుణముచే విచారగ్రస్తుడై వ్యర్థ ప్రసంగము చేయుచున్న పార్థునికి కృష్ణుడు గీతబోధ ద్వారా కర్తవ్యాన్ని గుర్తు చేసి కురుక్షేత్ర సంగ్రామమును నడిపించిన సంగతి మీరెఱింగినదే. జనకుడు యాజ్ఞవల్క్యుని బోధనలచే సంపూర్ణ వైరాగ్యమును పొంది, దివ్యత్వమును అనుభవించి, శుద్ధ సత్వగుణ ప్రధానుడై జ్ఞానిగా నిలిచినాడు. రజోగుణ సంపన్నుడైన విశ్వామిత్రుడు వశిష్ఠుని శరణుజొచ్చి, సత్వగుణ శోభితుడై బ్రహ్మర్షి అయినాడు. ఈ ప్రకారం మీరు సాధనద్వారా భగవదనుగ్రహమును పొంది మీ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చును.
(స.సా.డి 99పు.375)