సత్సంగములోని పవిత్రత్వము అనుభవములో అర్థమవుతుంది కానీ, కేవలము మాటలతో అర్థముకాదు. ఉన్నతస్థాయికి పోవుటకు కాని, ఆధమస్థాయికి దిగజారుటకు కానీ సంగమే కారణము. సంగమనగా స్నేహము. ఇసుక, గాలితో స్నేహముచేసి గగనము వరకుఎగిరిపోతుంది. అదే ఇసుక, నీటిలో చేరి గుంటలోపలకు దిగిపోతుంది. ఆకాశమున కెగురుటకు ఇసుకకు రెక్కలు లేవు. క్రింద గుంటకు దిగుటకు కాళ్ళు లేవు. పైకి పోవుటకు కాని క్రిందికి దిగజారుటకు కానీ అది గాలిలోను నీటిలోను చేసిన స్నేహమే కారణము. ఇనుమును మట్టిలో వేసినపుడు త్రుప్పుపడుతుంది. దాని యొక్క శక్తిని కూడను కోల్పోతుంది. అదే ఇనుమును అగ్నిలో వేసినపుడు అది తనయొక్క రూపమును మార్చుకుంటుంది. మెత్త దనమును చేకూర్చుకుంటుంది. తనలో ఉన్నటువంటి మాలిన్యమును కూడను పోగొట్టుకుంటుంది. అట్టి పరిస్థితులకు అది మట్టితోను, ఆగ్నితోను చేసిన స్నేహమే కారణము. కనకనే, మానవునికి సత్సంగమనేది చాలా ప్రధాన మైనది. శంకరాచార్యులు చెప్పారు. "సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం, విశ్చలతత్వే జీవన్ముక్తిః" అని జీవన్ముక్తికి సత్సంగమే చాలా ప్రధానమైనటు వంటిది. ఆదే ప్రధమ సోపానము.
(ఆ.రా.పు.81/82)
"జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులే
పాడుచేయుచుండె పరిసరములు
అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు
సమను మమత మనుజు హక్కుకాదా!"
ప్రేమస్వరూపులారా!
జన్మించినప్పుడు మానవుని హృదయము నిర్మలంగా విశ్చలంగా నిస్వార్థంగా ఉంటుంది. క్రమక్రమేణ పరిసరముల వాతావరణము, స్నేహితుల సంబంధం ఇత్యాది గుణముల చేత తన సౌశీల్యమును మానవుడు పోగొట్టుకుంటున్నాడు. ఈ లౌకిక సంబంధ బాంధవ్యముల చేత మానవుడు తన హృదయమును కలుషితం గావించుకుంటున్నాడు. మానవుడు చెడిపోవటానికి గాని, బాగుపడుటకుగాని పరిసరముల ప్రభావం పైననే ఆధారపడి ఉంటుంది. దీనిని పురస్కరించుకొనియే ...మనం ఎట్టివారి సంఘముతో సంచరిస్తామో, వారియొక్క ప్రభావం మన మీద పడుతుంది. కనుక మానవుడు మంచి సంఘమును కోరుకోవాలి. ఇలాంటి మంచి సంఘములో చేరినప్పుడు మానవుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. కనుక ఈనాడు మానవుడు తన సంకల్పం. సంపర్కముల చేతనే చెడిపోవటంగాని, బాగుపడడంగాని జరుగుతున్నది.
లోకంలో జన్మత: అంతా మంచివారే. కానీ ఈ చెడు స్నేహములచేతనే మానవుడు తన జీవితాన్ని పాడుచేసు కుంటున్నాడు. ఈనాడు మంచి చెడ్డలను గురించి ఏమాత్రం విచారించటం లేదు. కాని మంచి చెడ్డలను సరీగా విచారించి మంచివారితో స్నేహం చేస్తుండాలి. కనుకనే వేదాంతము:
సత్సంగత్వే నిస్సంగత్వం,నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం,నిశ్చల తత్వే జీవన్ముక్తి:
అని బోదించింది. కనుక మన సర్వేంద్రియములు మనకు హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగంలో చేరాలి. సత్ అనగా శాశ్వతము. ఈ జగత్లో ఏది శాశ్వతము? అన్నియూ ఆశాశ్వతములే, ఒక్కక దైవత్వం మాత్రమే శాశ్వతము. కనుక అట్టి శాశ్వతమైనటువంటి దైవ సంబంధాన్ని మనం కల్పించునప్పుడే మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటు వంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా అమృతతత్వమైనటు వంటివిగా, ఆమరత్వమైనటువంటివిగా రూపొందుతాయి. కనుక మొట్టమొదట సంఘదోషము వలన మనం చెడిపోతున్నామనే సత్యాన్ని గుర్తించటం అత్యవసరం.
(శ్రీ.పి.2000 పు7)
సత్సంగమనగా ఏమిటి? ఏదో కొంతమంది సత్పురుషులతో చేరి ఆధ్యాత్మిక విషయాలను, భగవత్త త్త్వమును సంప్రదించడమే సత్సంగముగా మీరు భావిస్తున్నారు. కానీ, అది కాదు. సత్సంగము ఇంతకు ముందు సచ్చిదానందం కూడా తన ప్రసంగంలో సత్సంగము గురించి చెప్పాడు.
సత్సంగత్వే నిస్సంగత్యం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్యం
నిశ్చల తత్త్య జీవమ్మకిః
పదిమందితో చేరటం కాదు సత్సంగము. సత్ - అనగా దైవం కనుక, దైవముతో చేరడమే సత్సంగము. అంగములోని జంగము, జంగములోని సంగము, సంగములోని లింగము, ఆ లింగమే ఆత్మస్వరూపం, అంగములోని జంగమే జీవితత్త్యము. జంగములోని సంగమే సత్య ధర్మ శాంతి ప్రేమల సంగము. ఆ సంగములోని లింగమే ఆత్మస్వరూపం. కనుక, దైవంతో కూడుకున్నదే సత్సంగము. సత్ - దైవత్వం, చిత్ - జీవిత్వం. ఈ రెండింటి ఏకత్వమే ఆనందము. జీవ బ్రహ్మ ఐక్యామసంధానమే ఆనందము. అందరూ ఆనందం కావాలని ఆశిస్తున్నారు. కానీ ఎక్కడ లభిస్తుంది ఆనందం? దండిగా ధనం సంపాదించవచ్చు. కానీ, దానితో ఆనందం వస్తుందా? ధనమునకు ఏ ప్రమాదం సంభవించునో అని భయం వస్తుందిగాని, ఆనందం రాదు. మీరు సర్వ విధముల కీర్తిని సంపాదించవచ్చు. కానీ కీర్తివల్ల కలిగే ఆనందం ఆనందం కాదు. అదంగా తాత్కాలికమైన ఆనందం. మీరు గొప్ప బిరుదులు అందుకోవచ్చు. కానీ, ఈ బిరుదులన్ని వచ్చిపోయేవే. ఏది మీ నిజమైన బిరుదు? "శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర:" అన్నది వేదం. కనుక, మీరు ధనంకోసం, పేరుప్రతిష్ఠలకోసంప్రాకులాడవద్దు, దివ్యమైన ఆనందం కోసం ప్రాకులాడండి. కానీ, ఈనాటి మానవుల పరిస్థితి ఏవిధంగా ఉన్నది?
ధనము కోసం దైవధ్యానాలు బోనాలు
కోటి పన్నాగాలు పన్నేరయా
భూమి సూర్యునిచుట్టు జనులు ధనముచుట్టు
గిరగిరా తిరుగుచుంటారయా..
శాశ్వతమైన ఆనందం దైవ ప్రేమవల్లనే ప్రాప్తిస్తుందిగాని, ధనం వల్ల లభించదు. దైవ ప్రేమను పొందుటయే ఆనందము. అట్టి దైవత్వాన్ని పొందే నిమిత్తమై సత్సంగంలో చేరాలి. అదియే మాణిక్యవాచికర్ చేసిన జ్ఞానబోధ.
(సాశు.పు. 71/73)
సత్సంగము పామరులను పావనులుగా మారుస్తుంది.
(ము.ము.పు.37)