"మనిషి జన్మించేది మరల జన్మ పొందకుండా ఉండే మార్గం తెలుసుకోవటానికే
(శ్రీ. స. ప్రే. ప్ర పు.1)
ఏ వ్యక్తి అయినా భారతదేశంలో కాని మరేదేశంలోనైనా కాని ప్రమాదవశాత్తూ జన్మించడు. అతనిజన్మకు ప్రత్యేకమైన సార్థకత పొందవలసిన విధి ఒకటి ఉంటుంది. తన తెలివితేటలను, శక్తియుక్తులను వృద్ధిపరచుకొని వాటిని తనసోదరమానవుల అభ్యుదయం కోసం, దేశాభ్యుదయం కోసం అంకితం చెయ్యాలి.
(శ్రీ స. ప్రే. ప్ర. పు. 402)
జన్మమున నెనిజజను లై! జన్మించిన వారుండరు!
జన్మము తరువాత! మిగిలి జన్మించిన వారెందరు?
జన్మమెత్తి ధర్మ కర్మ శూన్యులైన వారెందరు?
జన్మమంత తిరిగి నరజన్మము కనుగొనగలెరు!
జన్మించిన వారెందరు? జన్మమెత్తిన వారిందరు?
(భ.ప్ర.పు.117)
జనన మరణ మధ్యమందు! జగన్నాటక రంగమందు.
కామక్రోధగానములు: లోభమొహ గీతములు!
మదమాత్సర్య వేషములు! వ్యామోహముల ప్రదర్శనలు!
నవరకముల ప్రదర్శనలు తుదకు శాంతి పాఠములు.
(భ.ప్ర.పు.125)
మువ్వగోపాలుడు ముసిముసి నవ్వులు నవ్వుచూ కాచిన కాలము సమీపించినదని సంతసించి, "బావా! విను,లోకులు సూర్యోదయము, సూర్యాస్తమయమని అనుటలో
అర్థమేమి? అదికేవలము లోకుల దృష్టియందే కాని సూర్యుని దృష్టియందు కాదు. సూర్యుడు, ఉదయించుటలేదు, ఆస్తమించుటాలేదు, అవునా,కాదా? నేనును అంతే, నాకు జన్మమే లేదు. సామాన్య మానవుల దృష్టికి నేను అనేక కాయములము ధరించి అనేక జన్మల నెత్తితనని తలంతురు. లోకోద్ధరణమునకు అవసరమొచ్చినపుడంతా ఒక కాయము ధరించి లోకమునకు రూప నామములతో గోచరించిననూ, యెన్ని జన్మల విషయమయిననూ నాకు జ్ఞాపకముండును. నేను సర్వజ్ఞుడను, సర్వశక్తుడను. నాకే కాదు, నీకు కూడనూ అంతా తెలియును. అయితే నీ జ్ఞానశక్తిని అజ్ఞానముచే ఆవరించుటవలన నీకు తెలియజాలకున్నది. నేను జ్ఞాన మయుడును. కనుక నాకు సర్వవేళలయందునూ స్పష్టముగా తెలియుచుండును. బావా! సూర్యుడు అద్దములో అగుపించినంత మాత్రమున స్థానభంగము కాని, అధికార భంగము కాని యేర్పడునా? ఉన్నవాడు ఉన్నట్లే ఉండి అద్దమందు ప్రతిబింబించు చున్నాడు. అటులనే నేను కూడను ప్రకృతి అను అద్దమందు ప్రతిబింబించుచున్నంత మాత్రమున నా సరజ్ఞత్వమునకు, సర్వశక్తికి, భంగమురాదు: లేదు. నేను జన్మరహితుడను. మానవ జన్మమునకు మునుపు చేసిన పుణ్య పాపకార్మలు కారణములగును. అయితే, అవతార జన్మలకు కూడనూ అవే కారణమని తలంతువేమో? కాదు కాదు. మానవజన్మ కర్మ జన్మ, నాజన్మ లీలా జన్మ. ప్రార్థనలు, సాధుకృత్యములే. నాజన్మకు కారణము, దుష్టుల దుష్కర్మలు, సజ్జముల యొక్క సత్కర్మలే నా జన్మకు కారణము" అని కృష్ణుడుపదేశించెను.
(గీ.వా.పు.61/62)
నిజముగా దుఃఖమునకు కారణము జన్మ. జన్మకు కారణము కర్మ, కర్మకు కారణము రాగద్వేషములు. రాగద్వేషములకు కారణము పరిస్థితుల ప్రభావము. పరిస్థితుల ప్రభావమునకు కారణము బుద్ధి, బుద్ధికి కారణము ద్వైతము, ద్వైతమునకు కారణము అజ్ఞానము, కావున అజ్ఞానమే దుఃఖమునకు కారణము. దృష్టి ఎప్పుడైతే జ్ఞానమయమవుతుందో, అప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయంగా గోచరిస్తుంది.
శ్లో|| ధ్యాయతో విషయాన్ పుంస: సంగస్తేషూప జాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే
శ్లో|| క్రోధాత్ భవతి సమ్మోహ: సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి
శ్లో|| విహాయ కామాన్య స్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః
నిర్మమో నిరహంకారః స్సశాన్తి మధిగచ్చతి
అరిషడ్వర్గములలో మొట్టమొదటివి - కామక్రోధములు. మానవునకు కామ, క్రోధములు అని రెండు పదములు ఉండినప్పటికిని మొదటి పదము యొక్క పరిణామమే రెండవ పదము. లోభ, మోహ, మద మాత్సర్యములు మొదటి పదము యొక్క పరిణామములే. అరిషడ్వర్గము లనగా కామము యొక్క పరిణామము. కామము యొక్క పరివర్తనే వీటి యొక్క స్వరూప స్వభావములకు మూల కారణము. కామము వల్ల అపేక్ష పెరుగుచున్నది. ఈ అపేక్ష ఫలించకుండిన అనగా విఫలమైనచో అది క్రోధముగా మారుచున్నది. ఈ క్రోధమే సమ్మోహనంగా తిరుగుచున్నది. ఈ సమ్మోహనమే కడపటికి పెరిగి పెరిగి స్మృతి భ్రష్టుని గావించుచున్నది. ఈ స్మృతి బ్రష్టుడే కష్టము వల్ల బుద్ధి క్షీణత పొందుచున్నాడు. ఈ బుద్ధి నాశనము వలన సర్వమూ నాశనమగుచున్నది. సర్వ దుఃఖములకు, సర్వనాశనమునకు, అపకీర్తికి ఈ కామమే మూలకారణము. మనము వాంఛలను తగినంత అదుపులో ఉంచుకొని తగినరీతిగా జీవించటానికి ప్రయత్నించాలి.
సర్పమింటియందు సంచరించుచుండ
ఎవరు సుఖనిద్ర చెందగలరు?
విషయ సర్పముండు విషమయ దేహాన
జీవయాత్ర దేహి సల్పుచుండ
కోపము కలిగిన వానికి
ఏ పనియు ఫలింపకుండ ఎగ్గులు కలుగునో
పాపము పనులనే చేయుచు
ఛీ పొమ్మనిపించు కొనుట చేకూరును సుమీ.
సాధనలు చేసి ఫలమేమి శమము లేక
జపము లొనరించి ఫలమేమి కాంతిలేక
చవిటి భూమిని దున్నిన సరళి కాదె.
విషయములు ధ్యానించు వానికి వాటియందు ఆసక్తి కలుగును. అట్టి విషయాసక్తి వలన కోరిక, కోరిక వలన కోపము కలుగును. కోపము వలన అవివేకము, అవివేకము వలన స్మరణ భ్రంశము కలుగును. స్మరణ జ్ఞానము పోవుట వలన బుద్ధి నశించును. బుద్ధి నశించిన తోడనే తానే నశించును. కాన, విషయచింతన యుండరాదు. ఎవడు సమస్త కోరికలను, శబ్దాది విషయములను త్యజించి, వాని యందే మాత్రము ఆశలేక, అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే కాంతిని పొందుచున్నాడు.
కోరు కోరికలన్నియు తీరుచున్న
భక్తి దైవమున హెచ్చు. రక్తి హెచ్చు
కోరు కోరికలెవ్వని తీరకున్న
భక్తి తరుగుచు, దైవ విరక్తి పెరుగు.
(శ్రీ.భ.ఉ.పు.12/13)
బాల్యంబున పలువురితో కూడి
అట పాటల యందు ఐక్యుడగును
యవ్వనంబలరిన అలరు విలుని పోల్కి
కామనీ లోలుడై క్రాలుచుండు
అర్ధవయస్సున ఐహికంబున మునింగి
ద్రవ్య మార్జించుట దవిలియుండు
ముదమి వచ్చిన యంత మురహరి తలవక
అది ఇది లేదని ఆలపించు
వివిధ దుర్వ్య సనంబుల వీడలేక
భక్తి మార్గంబు వెలుక ఆసక్తి లేక
కర్మ పంకిలమున కాలుచుండు
మట్టి కల్పును జన్మంబు మానవుండు
(ము.ము.పు.27)
(చూ॥ అవతారము, ఆత్మ, కర్మఫలము,తల్లి తండ్రులు, త్రిగుణములు