దేవుడిని చూశారా?
దైవత్వమునుగురించి అనేకమంది మహనీయులు పరిశీలన సల్పి సాధనల చేత గుర్తిస్తూ వచ్చారు. ఈ కలియుగమందు రామకృష్ణ పరమహంస దగ్గరకు కూడా కొంతమంది వచ్చారు. స్వామీ! మీరు దైవాన్ని చూసారా?” అని ప్రశ్నించారు. ఆ.. చూసాను అన్నాడు. ఏ రూపంలోచూసారు?” అని అడిగారు. నిన్ను నేను, నన్ను నీవు చూసినట్లుగా చూసాను అన్నాడు. ఇదెట్లా సాధ్యమౌతుంది? అని మరల ప్రశ్నించారు. తప్పక సాధ్యమౌతుంది. కాని, దైవాన్ని చూడాలనే ఆరాటము మీలో లేదు. ప్రజలారా! ధన కనక వస్తువాహనాదుల నిమిత్తమై, ఆలుబిడ్డల నిమిత్తమై మీరు అనేకవిధములుగా తపిస్తున్నారు. ధనం కావాలని రాత్రింబవళ్ళు యేడుస్తున్నారు. కాని, ఈ ఏడుపు దైవం కోసం ఏడ్చినారా?
యాచింతా భువి పుత్ర మిత్ర భరణే వ్యాపార సంభాషణే
యాచింతా ధనధాన్య భోగ యశసాం లాభే సదా జాయతే
సాచింతా భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే
కాచింతా యమరాజ భీమ సదన ద్వారే ప్రయాణే ప్రభో!
పుత్ర మిత్ర భరణ వ్యాపారముల పై వ్యామోహంతో మీరు యేవిధంగా పరితపిస్తున్నారో, ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై మీరు యే విధంగా చింతిస్తున్నారో అందులో క్షణకాలమైనా భగవంతుని పాదముల నిమిత్తమై చింతిస్తున్నారా? మీరు పరితపించేది ప్రాకృతమైన చింతలకు, కోరేది దైవదర్శనము! ఇది అసాధ్యము. దైవాన్ని కోరితే దైవము నిమిత్తమై పరితపించాలి. అప్పుడే మీకు దైవం లభ్యమౌతాడు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇలాంటి పరిస్థితిలో దైవత్వాన్ని మీరు గుర్తించలేరు అని రామకృష్ణుడు బోధించాడు. (దివ్యఙ్ఞాన-దీపికలు ద్వితీయ భాగం పు 98)