రామచంద్రుడు సత్యవాక్పరిపాలకుడు; గుణశీలుడు. అంతేకాదు, అతను మహాసౌందర్యవంతుడు. రామచంద్రుని సౌందర్యాన్ని వర్ణించే సమయములో వాల్మీకి తన్మయుడైపోయాడు. అతని ఒక్కొక్క అంగమును కూడను వర్ణిస్తూ, ఇటువంటి ఆదర్శమైన అందగాడు లోకములో నున్నాడా? అని తానుభ్రమించాడు. చివరకు వర్ణించలేక "పుంసాం మోహన రూపాయ"(పురుషులు కూడను మోహించేటువంటిమోహనరూపుడు) అని అన్నాడు. అలాంటి రామచంద్రుడు కేవలము మానవాకారమును ధరించి, లోకములో ఉన్న మానవులకు ఆదర్శమైన జీవితాన్ని నిరూపించే నిమిత్తమై, తాను ఈ విధమైనటువంటి క్రియల యందు అనేకరకములైన పవిత్ర మార్గాలను నిరూపిస్తూ వచ్చాడు.
(ఆ.రా.పు.101)
ఆ రామచంద్రుడే ఆరామచంద్రుడై
తన బంటులను కనుగొనగ వచ్చె
ఆ నందబాలుడే ఆనందబాలుడై
తనవారి గుర్తింప తరలి వచ్చె
ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై "
తన ఆయుధములు చేకొనగ వచ్చె
ఆ యీశుడే బాలసాయీశుడై నేడు
తన గుంపుతో నాడుకొనగ వచ్చె
అల్ల పరమాత్మయను బొమ్మలాటగాడు
తాను జీవుల రంగస్థలాన నిలిపి
ఆడు ఆనాటి యీనాటి యాట లరసి
సుంత వర్ణించి సంతసంబు కొంత గనుడు.
- బాబా (శ్రీ వాణి నవంబ ర్ 2021 పు 60)