వాల్మీకి రామాయణాన్ని రచించిన తరువాత ఋషులందరినీ సమావేశపరచి రామకథను ఎలా ప్రచారం చేయాలి. ప్రచారం చేయగల సమర్థులెవరు అని విచారణ చేశాడు. ఆ ఋషు లందరూ నమస్కరించి "మహర్షి! మేము వృద్ధులమైపోయాము. వీధివీధిలో తిరిగి రామకథను ప్రచారం చేసే శక్తి మాకు లేదు" అని తమ అశక్తతను వెలిబుచ్చారు. దూరంగా కూర్చుని ఇదంతా గమనిస్తున్న లవకుశులు ముందుకు వచ్చి "గురూజీ! దివ్యమైన రామకథను వీథి వీథిలోను, ఇంటింటా చాటడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని పలికారు. ఒక చేత్తో తంబుర, మరొక చేత్తో చిఱతలు పట్టుకొని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి, నుదుట విభూతి పెట్టుకొని బయలుదేరారు.“వినుడు వినుడు శ్రీరాముని గాథ వినుడీ ప్రజలారా!" "శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా! శీలవతి సీత కథ వినుడోయమ్మా!" అని వీధి వీధిలోను రామకథను గానం చేస్తూ వచ్చారు. "ఓ ప్రజలారా! దివ్యమైన రామ చరిత్రను వినండి. మీ చరిత్రను కూడా రామ చరిత్రగా మార్చుకోండి" అని బోధించారు. ఈనాటి పిల్లలకు ఈ విధంగా భగవంతుని గురించి ప్రచారం చేయాలంటే చాల అవమానంగా ఉంటుంది. భజన చేయాలంటే అవమానం! విభూతి పెట్టుకోవాలంటే అవమానం! కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు విభూతి పెట్టుకుంటారు. బయటికి వెళ్ళే ముందు తుడుచు కుంటారు. పరులను దూషించడం, పరిహసించడం వంటి చేయరాని పనులు చేయడానికి వారికి అవమానం లేదుగాని, భగవన్నామం చెప్పాలంటే అవమానంగా భావిస్తారు. పరదూషణను మించిన పాపం లేదు.పరదూషణ చేయడానికి అసలు నోరు ఎలా వస్తుందో అర్థం కాదు. నాలుక నిచ్చినది భగవన్నామం స్మరించడానికి, పవిత్రమైన పలుకులు పలకడానికేగాని, పరులను దూషించడానికి కాదు. "పరులు పరులుకాదు, పరమాత్ము డగునయా!" మీకు తెలుసు - నేటి రాజకీయాల్లో ఒకరి నొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటున్నారు. పరదూషణలో జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా! మంచి చేయడానికే మీరు పుట్టారు. పరోపకార నిమిత్తమే మానవ జన్మ ఏర్పడింది. కనుక, పరోపకారంలో ప్రవేశించి జన్మను సార్థకం చేసుకోండి.
ఒకానొక సమయంలో రాముని తల్లియైన కౌసల్య వద్దకు హనుమంతుని తల్లి వచ్చింది. కొంత సేపటికి అగస్త్యుని తల్లి కూడా వచ్చింది. "అమ్మా! ఎవరు మీరు? ఎందుకోసం వచ్చారు?" అని ప్రశ్నించింది కౌసల్య. మొదటి వ్యక్తి "అమ్మా! నేను హనుమంతుని తల్లిని. నా కుమారుడు పెద్ద సముద్రాన్ని దాటి భయంకరమైన లంకలో ప్రవేశించి అనేకమంది రాక్షసులను సంహరించాడు" అన్నది. రెండవ వ్యక్తి "అమ్మా! నేను అగస్త్యుని తల్లిని. నా కుమారుడు సముద్రాన్నంతా ఒక్క గుటకలో మ్రింగీ గొప్ప కీర్తి గడించాడు" అన్నది. అప్పుడు కౌసల్య నవ్వి "నా కుమారుడైన శ్రీరాముని మహిమవల్లనే కదా. మీ కుమారులు ఈ మహత్కార్యములు చేయగల్గారు." అన్నది. సరిగ్గా ఆ సమయానికి రాముడు ప్రవేశించి "అమ్మా! ఏమి చెపుతున్నావు? హమమంతుడు మహా భక్తుడు, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు. అగస్త్యుడు కూడా మహాభక్తుడే. వారు తమ భక్తి ప్రపత్తులచేతనే ఈ మహత్కార్యములను సాధించగల్గారు. ఇందులో నా గొప్పతనమేమీ లేదు" అన్నాడు.
రామ చరిత్ర చాల పవిత్రమైనది. రావణుడు ప్రాణం విడిచే ముందు ప్రజలకు ఒక మాట చెప్పాడు. "ఓ ప్రజలారా! నేను కామాన్ని అదుపులో పెట్టుకోలేక నా కొడుకులను చంపుకున్నాను, వాంఛలను అరికట్టుకోలేకనా వంశమునే నాశనం చేసుకున్నాము. మీరు నావలె ప్రవర్తించి మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. రామునివలె సత్యాన్ని పలికి, ధర్మాన్ని ఆచరించి మీ జన్మము సార్థకం చేసుకోండి."రామాయణము యొక్క అంతరార్థమును, పవిత్రమైన సూక్తులను అందరూ తెలుసుకొని ఆచరణలో పెట్టాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది. "రమయతీతి రామ!", రమించడమే రామతత్వం. ఆ రమించే గుణము మీలోను ఉన్నది. కాబట్టి, మీరందరూ రామస్వరూపులే. ఆత్మకే రామ అని పేరు. ‘ నా ఆత్మారామునికే తెలుసు" అంటాం కదా! ప్రతి ఒక్కరియందున్న ఆత్మరామ స్వరూపమే.రాముడు అందరి హృదయంలో ప్రతిష్టింపబడి ఉన్నాడు. "సర్వతః పాణిపాదం....." సర్వత్రా ఉన్నాడు. అట్టిదైవాన్ని విస్మరించి ఏవో ప్రాకృతమైన ఫలితాలకోసం ప్రాకులాడటం చాల పొరపాటు. వచ్చిన జన్మను సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలంటే దైవాన్ని స్మరించాలి, దైవానికి ఆర్పితమైపోవాలి. అదే మీ జీవితం యొక్క ప్రధాన లక్ష్యము.
(స.. సా. నం.99 పు. 321/322)
ధర్మ సంరక్షణార్థమై ఆవతరించు దైవము, సమస్త ప్రాకృత లీలలను సాధారణ మానవునివలె చేయుచుండును. చేయవలెను. కారణము లోకులకు ఆదర్శము నందించుటకు, అనుభూతులు కలిగించుటకు లీలలు చూచుటకు సామాన్యమైనటువంటివిగా కంటికి కనిపించినను అందులోని రసము సరసము సౌందర్యము పుష్టి విశ్వమును మోహింపజేయును, హృదయముల పరిశుద్ధపరచును. మనసుల మరపించును, మాయను వదిలించును, మధురత్వమును అందించును.ప్రాకృతములుగా కనుపించు తన లీలలన్నియును ఆప్రాకృతములే, మాననీయములే, దివ్యములే. రామచరిత్ర వ్యక్తి చరిత్ర కాదు, విశ్వచరిత్రమనియే చెప్పవచ్చును. రాముడు సమిష్టి స్వరూపుడు సర్వవ్యాపకుడు, రామచరిత్ర కొంతకాలము మాత్రమే జరిగెనని తలంచరాదు. ఇది అద్యంతరహితమయినచరిత్ర, రామేచ్చ లేక చీమైనము కుట్టదు, ఆకైనను రాలదు. ప్రకృతియందలి పంచభూతములు రామేచ్ఛవలననే తమ తమ కర్తవ్యములను నిర్వర్తించుచున్నవి. దృక్ గోచరమగు సమస్త వస్తుజాలములందు గల ఆకర్షణ శక్తియేఆ రామచంద్రుడు. ప్రకృతి ఆకర్షణ చేతనే లోకము జరుగుచున్నది. ఆకర్షణ లేకున్న ప్రకృతియే లేదు. అనగా రాముడు లేకున్న లోకమే లేదు.
(రా.వా.మొ.పు.6)
(చూ: అయోధ్య)