శ్రీరాముని చరిత్రయందు, రాముడు కేవలం మానవ ఆదర్శపురుషుడుగా రూపొంది, తద్వారా దైవత్వము వరకుమ తీసుకొని పోయేటటువంటి ఘట్టములు, మనము రామాయణములో అనేకంగా చూస్తూ వచ్చాము. కానిఈ యొక్క మనస్తత్వాన్ని కొంతవరకూ లోకమునకు చాటి, అతడు తనలో ఉన్నటువంటి దివ్యమైన దైవత్వాన్ని మరుగుపరచి రహస్యంగా ఉంచాడు. అనేకమందిఋషులు దీనిని దాచి పెట్టారు. కారణమేమనగా మొదటి రామచంద్రుడు భగవత్స్వరూపుడనే సత్యమే ప్రకటితమైతే, రావణవధ జరుగదు. అందువలననే విశ్వామిత్రుడు. రామలక్ష్మణులను తన యజ్ఞ సంరక్షణకై తీసికొని వెళ్లుటకు వచ్చిన సమయమునందు "ఈ రామలక్ష్మణుల తత్వము నాకూ, వశిష్టులవారికి మాత్రమే తెలియును. నీకు తెలియదు" అనికూడను దశరథునికి స్పష్టముగా తెలిపాడు. అనంత కళ్యాణగుణములు కలిగినటువంటి రామచంద్రుని యొక్క తత్వము మహనీయులకు మాత్రమే అర్థమవుతుంది. సామాన్యులకు అది అర్థము కానేరదు. రాముడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. అట్టి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడైన రాముని తత్వము గ్రహించడము సర్వజ్ఞానకే గాని, అల్పజ్ఞుడైన మానవునికి అసాధ్యంకాదా? బ్రహ్మమును తెలుసుకొనటానికి బ్రహ్మతత్వాన్ని మనము అనుభవించాలి. "బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి"బ్రహ్మమును తెలుసుకొనే స్థాయిని మనము చెందినపుడే ఆ దివ్యత్వమును అర్థము చేసుకోటానికి వీలవుతుంది. కనుక రామ తత్వమును మనము అర్థము చేసుకోవాలనుకుంటే ఈ రామాయణముయొక్క పవిత్ర తను మనము కొంతవరకును అనుభవములోనికి తెచ్చుకోవాలి.
(ఆ.రా.పు.9/10)
రామునియందు ఉన్న ప్రత్యేకలక్షణము భూతదయ ఎట్టిజీవినైనను కూడా ప్రేమించి, ఆదరించి, దయచూపేటువంటిది రామతత్వము. తనకు అపకారము చేసినటువంటి వారిని, తనకు కీడు చేసినటువంటి వారిని కూడనుప్రేమించి, ఆదరించి వారికి మంచిని కోరేటటువంటిది రామతత్వము,ఇట్టి పవిత్రమైన తత్వము ప్రతి మనిషికి అత్య వసరము అని భావించవచ్చు. దీనినే క్షమ అని చెప్పవచ్చును. ఒకానొక సమయములో భరతుడు, తన తల్లియైన కైకను దూషించగా అప్పుడు రాముడు, మాతృదూషణ మహాపాపమని భరతుని చర్యను ఖండించాడు. ఇంతియేకాదు: రావణవధానంతరము, ఒకానొక సమయము నందు తన తండ్రియైన దశరథుని దర్శించాడు. ఆ సమయమునందు దశరథుడు ఆనందమును పట్టలేక "నీకు ఏమి కావలయునో కోరుకో" అని ఆజ్ఞాపించాడు. అప్పుడు రాముడు "తండ్రీ! మీరు ఈ విధమున నాకు దర్శనమివ్వటము చాలా ఆనందకర మైనది. కాని, మా మాతృమూర్తి అయిన కైకను క్షమించి, భరతుని క్షమించి, ఆదరించి, వారికి మీరిచ్చియున్న శాపములను ఉపసంహరింతురేని నేనింకనూ ఆనందింతుము. ఇదియే నాకు కావలసినది" అని అన్నాడు. రాముని అరణ్యమునకు పంపే సమయమున దశరథుడు పట్టలేని దుఃఖములో, క్రోధముతో కైకా! నీకు నరకప్రాప్తి చేకూరుగాక! నీ కుమారుడు అయిన భరతుని చేతి పిండమును కూడా నేను అందుకోను" అని అన్నాడు. ఆ విధమైనటువంటి మాటలను ఉపసంహరించుకోవాలని, రాముడు తండ్రిని ప్రార్థించాడు. ఇలాంటి పవిత్రమైన హృదయము మానవాదర్శములకు ఎంత ఉపకరిస్తుందో యోచించాలి. రాముడు జీవితమున పూర్తిగా ఆదర్శమానవుడుగానే నటించి, లోకమునకు ఆదర్శ మూర్తిగా కూడను కీర్తిని పొందినాడు. ఇంతేకాదు: యుద్ధ సమయమునందు రావణుని సైనికులు కొంత రహస్యమునను తెలుసుకోవాలని వానరులలో చేరి, మారు వేషములతో సంచరించు సమయమునందు విభీషణుడు వారిని పట్టినాడు. ఆ సమయములో సుగ్రీవాదులు వారిని హింసించుచుండగా, వారు రాముని శరణాగతి పొంది, "రామా! మమ్ము రక్షించుమని" కోరినప్పుడు రాముడు క్షమించి వదలినాడు. రాజదూతలను హింసించటము సరియైన రాజనీతికాదని, విభీషణాదులకు బోధించినాడు. నిజముగా రాముడు లోకమునకు చేసిన సేవ, లోకమునకు అందించిన ఆదర్శము. మానవత్వములో ఉన్న దివ్యత్వమును గుర్తింపచేసిన పరమతత్వమును మనము క్షణక్షణమునందు గుర్తించుకొనుట అత్యవసరము. ఈనాడు రామాయణములో తెలుసుకోవలసినది కానీ, చూడవలసినది కానీ రామచరిత్రలు కావు. రామ లీలలుగా రాముని యొక్క ఆదర్శమును తెలుసుకోవాలి.
(ఆ.రా.పు.44/46)
"రామ" అనగా సర్వవ్యాపకమైన స్థితి. ఎక్కడ చూచినా రామ నామమే. ఏ ప్రదేశము చూచినా రామనామమే. సర్వదా సర్వకాలేషు సర్వత్ర రామచింతనమ్’. రామతత్త్వ మనేటటువంటిది సర్వైశ్వర్య సంపన్నమైన ఈశ్వరత్వమే. ఈశ్వరతత్వానికి రామ తత్వానికి భేద మేమాత్రమూలేదు.
నిరంతరమూ నిత్యమై, నిర్మలమై, నిస్స్వార్థమై యున్నది రామతత్త్వము ఒక్కటియే.
ధర్మమే ప్రధాన మని, ధర్మమే ఆచరణ యుక్తమైనదని ప్రబోధలు సల్పు యుజుర్వేదమే రామచంద్రుడు. రామాజ్ఞనే యజ్ఞముగా భావించి, రామమంత్రమును వల్లెవేయుచూ ఆనందమును అనుభవించుచున్నటువంటి లక్ష్మణుడేఋగ్వేదము. రామనామమే పరమతారక మని భావించి నిరంతరమూ రామనామమునే గానము చేయుచున్నటు వంటి భరతుడే సామవేదము. ముగ్గురు అన్నల ఆజ్ఞను శిరసావహించి, అంతః శత్రువులను, బహిశ్శత్రువులను హత మార్చే శక్తి గలిగినటువంటి శత్రుఘ్నుడే ఆధర్వణ వేదము.
(రా.సా.పు.3/5)
దైవత్వము పొందేటప్పటికి ఎంత అధిక్యములో జీవితము ప్రకాశిస్తుందో మనము యోచించుకోవాలి. దైవత్వము లోపల అల్బత్యము చేరటానికి వీలుండదు. అల్పత్వములో దైవత్వాన్ని ప్రకటించటానికి సాధ్యము కాదు. సీతను పదినెలలు అశోకవనములో వుంచుకొని రావణుడు చాలా బాధపడుతున్నాడు. పది నెలలై నప్పటికిని యీమె యేమాత్రము అతని ముఖము చూడటం లేదు. ఒక్క పలుకైనా పలకటం లేదు. ఎన్నిరకములైన మాటలు ఆడినప్పటికీ ఆమె యేమాత్రము లక్ష్యము చేయలేదు.
బాధను గుర్తించిన మండోదరి భర్త చెంతను చేరి బోధిస్తూండాది. రావణా! నీవు అనంతశక్తిని కల్గినవాడవు. ఈశ్వరుని పరమభక్తుడవు. మహాతపస్సు నాచరించిన వాడవు. నీలో యే విధమైన శక్తినైనను మార్చుకునే సామర్థ్య ముంటుండాది. సీతను తీసుకొని రావాలనుకుంటే సన్యాసివేషమును ధరించి ఆమెను అపహరించటానికి ప్రయత్నించినట్టి వాడవు, ఏరూపానయినా మార్చుకునే శక్తి కలిగినవాడవు. సీతకోసమై ఈ విధముగా బాధపడేదాని కంటె ఒక్క తూరి రామస్వరూపాన్ని ధరిస్తే సీత నీకు సులభముగా వశమవుతుందిగదా! ఎందుకు ధరించటము లేదని ప్రశ్నించింది. అప్పుడు రావణుడు మండోదరీ! పవిత్రమైన రామస్వరూపమును నేను ధరిస్తే యీ కామబుద్ధులు నాకెందుకుంటాయి అన్నాడు. కనుక అట్టి రామతత్వములోకి, అట్టి దివ్యతత్వములోకి మనము పోయేటప్పటికీ యీ అల్పత్వము ఏమాత్రము మన దగ్గరకు చేరదు.
(శ్రీ. గీ..పు.188/189)
ఒక ఆదర్శమూర్తియైన మానవుని తత్వము రామాయణ మని పిలవబడుతూ వచ్చింది. ప్రతి మానవుడు ఆదర్శమూర్తి అయిన రాముడే. అయితే, ఆ రామునియొక్క ఆదర్శములు తనయందున్నావా లేవా అనే విచారణ ప్రతి వ్యక్తి సలుపవలసినటువంటిది. వ్యక్తి ధర్మములు, కుటుంబధర్మములు, సామాజికధర్మములు - ఈ సర్వధర్మముల ఏకత్వమే రామతత్వమనే సత్యాన్ని నిరూపించినది రామాయణము. ఇది జరిగి వేల సంవత్సరము లైనప్పటికీ ఇప్పటికీ కూడా క్షణక్షణము ఈ రామాయణము జరుగుతూనే ఉంటున్నది. రమ అనగా సీత, కనుక, సీతా చరిత్రమునకు రామాయణమని పేరు. రమ అనగా స్త్రీ. ఈ స్త్రీ సీతయే. ఈ సీత భూజాత. ప్రకృతియందు ఆవిర్భవించిన ప్రతి మానవుడు తన తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి. ప్రకృతి పుత్రుడైన ప్రతి మానవుడు ఆదర్శమూర్తిగా తయారు కావాలి. వాల్మీకి రాముని ఆదర్శమానవునిగా విశ్వసించి రామాయణము వ్రాస్తూ వ్రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు. కాని, తులసీదాసు రాముడు సాక్షాత్ నారాయణమూర్తి అని ప్రారంభించి కట్టకడపటికి రాముడు ఆదర్శమూర్తి అని నిర్ణయించుకున్నాడు. ఇక కంబరామాయణంలో నరుడే నారాయణుడు. నారాయణుడే నరుడు, మానవుడే రాముడు, రాముడే మానవుడు అని తెలుపబడింది. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పవిత్రమైన రామచరిత్రమును వ్రాస్తూ వచ్చారు. ఇప్పటి కాలానుగుణ్యముగా ప్రతి వ్యక్తికీ రామతత్వము అత్యవసరం.
(శ్రీ.భ..పు.39)
రాముని తనతో సంపుమని దశరథుని అడుగుతాడు. మొదట మాటయిచ్చి తరువాత బంకుతాడు రాజు. ఆ యజ్ఞ రక్షణభారాన్ని తెలిసికొని “బాలుడు రాముడు, అగృహితాస్త్రుడు. కోమలుడు, అతడు మహా బలసంపన్నులైన ఆ మారీచ సుబాహులను జయింపగలడా? అక్షౌహిణి సైన్యంతో నేను బయలు దేరి వచ్చినా ఆ మహాబలుణ్ణి సాధించలేను. అట్టి వాణ్ణి ఈ బాలుడు జయిం పగలడా" అని ఆర్తిని భజిస్తాడు. విశ్వామిత్రుడు అంటాడు - పుత్ర వ్యా మోహంతో నీవు శ్రీరామ తేజాన్ని తెలుసుకోలేక పోతున్నావు. నాకు ఆ రామ తత్త్వము తెలుసు. సత్యపరాక్రముడైన ఆ శ్రీరాము డెవరో నాకు తెలుసు. కాని, నే నేమో నీకు పరాయివాణ్ణి. నీకు అంత నమ్మకం కావా లంటే నీ పురోహితుడైన వసి ష్టుని అడిగి తెలుసుకో. మేమిద్దరమూ కూడపలుక్కొని మాట్లాడుతున్నామని నీవు ఏమై నా అనుకొంటావేమో, ఈ సభలో కూర్చొన్న మహర్షుల నెవ్వరినైనా అడుగు. సత్యపరాక్రముడైన నీ కుమారుడు నారాయణుని అంశతో పుట్టాడు. ఈతడు చేయవలసిన కార్యం అనంతముగా ఈ లోకంలో వున్నది. దానిని చేయించటానికి నేను పేరకునిగా ఇక్కడకు వచ్చాను అని విశ్వామిత్రుడు దశరథునికి వివేకం కలిగేటట్లు ప్రబోధిస్తాడు. (రామ కథ సాయి సుధ పు 72)
శ్రీరామతత్త్వము
రామనామము వేదసారము. రామచరితము పాలసంద్రము. నాడు మొదలు నేటి వరకును ఏ ఇతర దేశములందుకాని, ఏ ఇతర భాషలందు కానీ, ఇంతటి మహాకావ్యము పుట్టలేదనియే చెప్పవచ్చును. అన్ని దేశములకు, అన్ని భాషలకు అంతర్వాహినిగా ఆధారమై నిలచిన ఈ ప్రధాన కావ్యము భారతీయుల భాగ్యమా అన్నట్లు హిందువుల ఇలవేల్పయి, ఇంటి పేరనో, వంటి పేరనో, ఈ రామరసమును గ్రోలని భారతీయుడు లేడనియే చెప్పవచ్చును. పండితులు మొదలు పామరులవరకును, కోటీశ్వరుడు మొదలు కూటి పేదవరకును, రోగులు మొదలు యోగులవరకును - రామాయణము - పారాయణ గ్రంథమై ప్రకాశించుచున్నది. సమస్త దోషములను హరించి, పాపములను రూపుమాపి, తన ప్రాపును రూపముతో చూపునట్టి సుందర నామము ఈ రామం. .
సమస్త జలము సాగరమునుండియే పుట్టినటుల, సమస్త జీవులు రామం నుండియే పుట్టుచున్నవి. జలములేని సాగరము, రామం లేని జీవనం లోకమునము, లేదు రాదు. సాగరమునకు, సర్వేశ్వరునకు సన్నిహిత సంబంధము కలదు. సాగరమే సర్వేశ్వరునికి నివాసము. పాలకడలి శయనుడు అను పదమునకు ఇది ప్రమాణము. కనుకనే ప్రచేతసుని కుమారుడగు మహాకవి వాల్మీకి రామాయణ భాగములకు కాండములని పేరిడెను. కాండమన జలమనియు, చెరుకనియూయూ అర్ధములు కలవు. చెరకు ఎన్ని వంకరలు తిరిగినను రసమునందలి - యెట్టి మార్పునూ లేనటుల రామకథారస వాహిని అనేక వంకరలు తిరిగి, ప్రవహించినను అందులోని కరుణా రసమున కెట్టి మార్పును లేదు. రామకథా ప్రవాహము విచారము, విషాదము, వింత, హాస్యము, అద్భుతము, రౌద్రం, శృంగారం ఇత్యాది వంకరలతో ప్రవహించినది. దీని అంతర్ మర్మము ధర్మప్రధానమై యున్నది.
సరయూనది వంటిది రామకథారస ప్రవాహము. మానస సరోవరమే దీని జన్మస్థానము. లక్ష్మణుడు గంగవంటివాడు. ఇది చిత్తమను శిరస్సున పుట్టినది. రామవాహిని- కరుణారసము, లక్ష్మణ ప్రేమ-భక్తి రసము. సరయూనది గంగలో చేరినటుల కరుణారసము భక్తిరసమున లీనమగును, రాముడు లక్ష్మణునితో ఏకత్వమయినాడు. కరుణా ప్రేమల మిళితమే రామ అభిమతము. అదే భారతీయుల మతము, భక్తుల వ్రతము. (రామకథా రసవాహిని ప్రధమ భాగం పు1-2)
రమ్ అనే ధాతువునుండి పుట్టినది రామ శబ్దము. ఇ అనే ధాతువునుంది. పుట్టినది అయన శబ్దం. రామ అనగా రమించటం, ఆనందించటం, ఆనందింప చేయటం, ఆహ్లాదము కలుగజేయటం. చలనం, గమనం, స్పందనం ఈ మూడింటి తత్త్వమే అయనం. ర అనగా ఆత్మ, మ మనస్సు, మనస్సును ఆత్మలో చేర్చటమే రామతత్త్వము. ఆనందతత్వమును ప్రపంచవ్యాప్తము గావించటమే _ రామ అయనం. ఆనందమును అనుభవించి, పెంచి, పంచటమే రామతత్త్వము. సర్వవ్యాపకము గావించునది అయనము. ఆహ్లాదమును - సర్వవ్యాప్తి – గావించటమే రామతత్త్వము. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు 3)