His story is History.
ఈ రోజు రామాయణ గాథను గురించిన ఉపన్యాసమును ముగించే ముందు ఒక్కసారి సీతారాముల కళ్యాణ ఘట్టమును జ్ఞప్తికి తెచ్చుకుందాం. పూర్వం మిథిలాపురంలో సీతారాముల కళ్యాణం జరుగుతుండే సమయంలో పండితులనుండి పామరులవరకు ఆబాలగోపాలము రాముని గుణగణాలను తల్చుకుంటూ వచ్చారు. “ఎటువంటి వాడు రాముడు! పరిశుద్ధమైన హృదయం గలవాడు, పవిత్రమైన భావములు గలవాడు. తన చేష్టలుగాని, కర్మలుగాని అన్నీ పవిత్రమైనవే,” అని వర్ణించుకుంటూ పవిత్రమైన రామకల్యాణమును చూడడానికి తండోపతండాలుగా ప్రజలు తరలిపోతున్నారు. స్త్రీలు ఇలా పాడుకుంటూ పోతున్నారు.
రారే చూడగపోదాము రాముని పెండ్లి ||రారే||
రారే చూడగ పోదాము రమణులందరు కూడి
భద్రాదీశుని పెండ్లి రారే చూడగ పోదాము
శ్రీలు మించిన దిక్కుటాలు, వింతల బంగళాలు
ముత్యపుతోరణాలు, మూలల కిటికిటీలు
వజ్రాల తలుపులు, తాపిన నీలాలు
నీలాలు వెయ్యర్లు, నూరార్లు, బజార్లు ||రారే॥
స్త్రీల కెక్కువ భూషణాలు, ఉత్తర దర్పాలు
సీతకు రాముడు సూత్రము కట్టుతాడు
ఇద్దరి నొక్క ఈడుజోడుగ కూర్చినారు
సీతకు తగువాడు శ్రీరాముడు ||రారే॥
మించి మగల కడనుంచి సిగ్గున తలవంచి
వసిష్ఠు రప్పించి ఖడ్గములు తెప్పించి
దూలా లపై గుప్పించి ఇప్పించి
మెప్పిం చి రప్పించుట ||రారే||
ఈ విధంగా స్త్రీలు తరలివస్తుంటే, మగవారు ఇంకొక విధంగా పాటలు పాడుకుంటూ వస్తున్నారు.
చూతము రారండి,
కౌసల్యాతనయుని కల్యాణము చూతము రారండి
చూచు వారలకు చాల పుణ్యమట
భక్త్యావేశ మగునట్టివారలకు కళ్యాణము
అంబారి పై అలగు తేజమట
భగధగ మెరిసే రామచంద్రుడట
వామ అంకమున రమణ సీత అట
సీతారాముల సోదర సేవట
అందరి కీ క్షేమమడుగునట ||కళ్యాణ||
ఈ విధంగా స్త్రీలు, పురుషులు సీతారాముల గుణగణములు వర్ణించుకుంటూ, వారికంటే మించినవారు ఈ జగత్తులో లేరు, అని నిర్ధారించుకుంటూ, “రాముడు
సా క్షాత్తు పరమాత్ముడు” అని అయోధ్యావాసులే కాకుండా మిథిలా పురివాసులు కూడా భావిస్తూ వచ్చారు. రాముని విషయం ఎవరూ సందేహించ నక్కర్లేదు. రాముని నమ్మినవాడు ఏనాటికీ చెడడు. "నమ్మక చెడినవార లున్నారుగాని, నమ్మి చెడినవారు లోకాన లేరు, లేరు.” రామకథ సాక్షాత్తు కథ (Story). అదే సువర్ణాక్షరాలతో లిఖింపబడిన చరిత్ర (History). His story is History. రామాయణంలో అతిసూక్ష్మ మైన రహస్యాలు ఇంకా ఎన్నో ఉంటున్నాయి. పూర్వం చెప్పాను - సీతారాముల తత్త్వము ఎంతో పవిత్రమైనది. రాముని సోదరుల తత్త్వము ఎంతో రహస్యమైనది. సుమిత్ర, కైకేయిల సంబంధము ఎంతో పవిత్రమైనది. రామాయణతత్త్వాన్ని తెలుసుకోవడానికి ఇంకా మనకు పదిదినములంతా ఉంటున్నది. ఇంకా గుట్టు అయినవి, గోప్యమైనవి, ఎవరికీ తెలియని విషయాలు మున్ముందు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఎంతమంచి తీపు మీరంతా సేవింపుడి....
రామా కోదండరామా....
(తేది: 21.05.2002 సాయంత్రం సాయిరమేశ్ సభాప్రాంగణము (బృందావనం)లో శ్రీవారు అనుగ్రహించిన దివ్యసందేశము ]
(రామాయణ దర్శనము (వేసవి తరగతులు 2002 పు 87-89)
రావణ సంహారం జరిగిన తరువాత సీతను రామునివద్దకు తీసుకువస్తున్నారు. వానరులు సీతామాతను దర్శించుకోవాలని తహతహలాడుతున్నారు. అసలే కోతులు! ఒకరిపైన ఒకరు ఎగిరెగిరి పడుతూ చూస్తున్నారు. అప్పటికి సీత రాముణ్ణి చూసి పదినెలలైంది. రామవియోగంలో చిక్కి శల్యావస్థలో ఉన్నది. రాముణ్ణి చూడాలని ఎంతో ఆశతో వచ్చింది. కానీ రాముడు ఆమె వైపు చూడకుండా తలవంచుకున్నాడు. లక్ష్మణునివైపు తిరిగి “చితి పేర్చు” అని ఆదేశించాడు. “సీత అగ్నిలో ప్రవేశించాలి. అగ్నిసాక్షిగా సీత నిర్దోషి అని వెల్లడైన తర్వాతనే నేనీమెను స్వీకరిస్తాను” అని చెప్పాడు. సీత మహాపతివ్రతయని, నిర్దోషియని రామునికి తెలియక కాదు. కానీ లోకులు కాకులు, పదినెలలపాటు లంకలో ఉన్న సీతను రాముడెలా స్వీకరించాడని పరిపరి విధాలుగా మాట్లాడే అవకాశముంది. కాబట్టి, అగ్నిసాక్షిగా సీత నిర్దోషియని, పవిత్రమైనదని నిరూపణ అయితే ఇంకెవ్వరూ నోరెత్తడానికి వీలుండదని రాముని ఉద్దేశ్యం. సీత రామునికి నమస్కరించి, అగ్ని చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి అందులోకి ప్రవేశించింది. తక్షణమే అగ్నిదేవుడు ప్రత్యక్షమై “రామా! సీత నిర్దోషి. నిర్దోషి, నిర్దోషి. ఈమె మహాసాధ్వీమణి, మహాగుణవంతురాలు. ఈమెను ఇంకేవిధమైన పరీక్షకు గురి చేయక స్వీకరించు” అని చెప్పి అదృశ్యుడయ్యాడు.
ఈలోపల విభీషణుడు పుష్పకవిమానమును తీసికొనివచ్చాడు. ఆ విమానము ఎక్కడిది? ఆ కాలములో కూడా విమానం ఉండేదా! అని కొందరికి ఆశ్చర్యం కల్గవచ్చు. అది రావణుని సవతి తల్లి కుమారుడైన కుబేరుడిది. యుద్ధంలో అతనిని జయించి దానిని తెచ్చుకున్నాడు రావణుడు. మొట్టమొదట సీతారామ లక్ష్మణులు అందులో కూర్చున్నారు. విభీషణుణ్ణి కూడా అయోధ్యకు రమ్మని కూర్చోబెట్టుకున్నారు. సుగ్రీవ, - హనుమంతాది వానర యోధులను కూడా ఎక్కించుకున్నారు. అందరూ కలసి అయోధ్యకు బయల్దేరారు. అదే సమయంలో అక్కడ భరతుడు సీతారాములకోసం రథమును సిద్ధంచేసి పెట్టుకున్నాడు. “రామచంద్రుడు సరిగ్గా పద్నాల్లు సంవత్సరములు అరణ్యవాసం పూర్తిచేసుకొని, ఈనాటికి వస్తానని వాగ్దానం చేసాడే! కాని, ఇంకా రాలేదే!” అని చాలా ఆందోళనగా, నిరుత్సాహంగా ఉన్నాడు. ఇంతలో ఆకాశమునుండి పుష్పక విమానంలో సీతారామలక్ష్మణులు తదితర పరివారము క్రిందికి దిగుతున్న దృశ్యం కనిపించింది. అయోధ్యా ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఈ పధ్నాలుగు సంవత్సరాలపాటు రామదర్శనం లేక వాళ్ళు పరితపించిపోయారు. స్త్రీల సంగతి వేరే చెప్పనక్కర్లేదు, చాలా బాధపడుతున్నారు. కొందరు స్త్రీలు మరణించారు.
పౌరులందరూ ఆకలిదప్పులను మరచిపోయి నిరంతరము రామచింతన గావించుకుంటూ సీతారామలక్ష్మణుల రాకకోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. సీతారామలక్ష్మణులు పుష్పకవిమానమునుండి క్రిందికి దిగారు. భరతుడు, సీతారాములకు నమస్కరించి, రాముణ్ణి పుష్పమాలాలంకృతుని గావించాడు. సీతారాములను అయోధ్యానగరానికి తీసుకు వెళ్ళడానికి భరతునితోపాటు శత్రుఘ్నుడు కూడా వచ్చాడు. పద్నాల్లు సంవత్సరాలపాటు నిరంతరం రామచింతన చేయడంవలన భరతుడుకూడా రామునివలె నీలమేఘ శ్యాముడైనాడు. వారిరువురూ ఒకే మాదిరిగా కనిపించారు. చాలాకాలం తర్వాత రాముణ్ణి, భరతుణ్ణి ఒకేచోట చూసేసరికి, వారిరువురిలో రాముడెవరో, భరతుడెవరో పోల్చుకోలేక జనులు తికమకపడ్డారు. అప్పుడు లక్ష్మణుడు రాముణ్ణి చూపించగా శత్రుఘ్నుడు అన్నగారికి మాలవేశాడు. వదినగారి చేతికి మాల ఇచ్చాడు. అక్కడినుండి సీతారాములను ఊరేగింపుగా, అయోధ్యానగరంలోకి తీసుకువెళ్ళారు. అయోధ్య నిత్యకళ్యాణం, పచ్చతోరణంగా కళకళలాడింది.
ఈ విధంగా పధ్నాలు సంవత్సరాల తర్వాత సీతారామలక్ష్మణులు అయోధ్యకు చేరుకున్నారు. ఇదంతా తల్లియొక్క ఆశీర్వాద బలమే. కౌసల్య ముందే చెప్పినది రామునితో, “నాయనా! ఈ పద్నాల్లు సంవత్సరాలు నీకు పద్నాల్లు నిమిషాలుగా గడచిపోవుగాక! నీకెట్టి ఆటంకములూ కలుగవు. సుక్షేమంగా అయోధ్యకు తిరిగి రాగలవు" అని. సీతారామలక్ష్మణుల __కితా_ సుమిత్ర ఎంతగానో ఆనందించింది. అయితే ఆమెకు మొదటినుండి ఆనందమే! ఏనాడూ తాను విచారించలేదు. ఎందుకంటే, రామునికెవ్వరూ హాని తలపెట్టలేరని, రాముణ్ణి బాధ పెట్టగల్గేవారు ఈ జగత్తులోనే పుట్టలేదని ఆమెకు గట్టి నమ్మకం. ఆమె తన కోడలు ఊర్మిళను తీసుకువచ్చింది. ఊర్మిళ తన భర్తయైన లక్ష్మణుణ్ణి చూసి పదునాల్గు సంవత్సరాలైనది. ఆమె వస్తూనే అతని పాదాలపై పడి, “స్వామీ! మీ రామభక్తియే మిమ్మల్నింతవరకూ కాపాడుతూ వచ్చింది. మీరు నిరంతరం రామచింతన చేస్తూ వచ్చారు. ఆ రామనామమే మిమ్మల్ని రక్షిస్తూ వచ్చింది” అని చెబుతూ తన నుదుటి పై నున్న సిందూరమును తీసి లక్ష్మణుని పాదాలపై అద్దింది. అది ఆనాటి ఆచారము. సుమిత్ర ఊర్మిళను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, “నీ సద్గుణములే లక్ష్మణుణ్ణి ఇన్ని సంవత్సరాలు రక్షిస్తూ వచ్చాయి. నీవు గుణవంతురాలవు కాకపోతే నా కుమారుడు జీవించేవాడు కాదు” అని చెప్పింది. కైక కూడా వచ్చింది. ఆమె దుర్మార్గురాలేమీ కాదు.
రామునిచేత ఆవిధంగా రాక్షస సంహారం జరగాలని ఆమెకు ముందే తెలుసు. ఆమె రామునికి విలువిద్య నేర్పే సమయంలో ఒకనాడు రాముడు, “పిన్నీ! నేను రాక్షస సంహారం కోసం వచ్చాను. నీవు దీనికి తగిన ప్లాను వేయాలి” అని కోరాడు. ఆనాటి నుండి కైక దీనికోసం మాస్టర్‌ప్లాన్ వేస్తూ వచ్చింది. తదనుగుణంగా ఆమె రాముణ్ణి అరణ్యానికి పంపవలసిందిగా దశరథుని కోరడం, ఆ తరువాత రాముడు రాక్షస సంహారము గావించడం జరిగాయి. రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు రత్నాలవంటి కుమారులు. సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి వీరు నల్గురూ రత్నాలవంటి బిడ్డలే. ఆమె ఆ నల్గురినీ దగ్గరకు చేర్చుకొని ఆశీర్వాదం చేసింది. రాముడు సీతాసమేతుడై అయోధ్యానగరానికి రాజుగా పట్టాభిషిక్తుడై, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల సహాయంతో ఎంతో ధర్మబద్ధంగా, న్యాయంగా పరిపాలన చేస్తూ, ప్రజలకు - సుఖశాంతులు చేకూర్చుతూ, సత్కీర్తిని పొందుతూ వచ్చాడు.
1. రామనామమను మిఠాయి ఇదిగో, రండి భక్తులారా!
భూమిలో దొరకు మిఠాయిని కొని తిని
పామరులై చెడిపోకండి!
వేదసారమను గోధుమపిండిలో
వేద వాక్యమను క్షీరము పోసి
ఆనందమను పెద్ద భాండము తీసి
ఆదిమునులు దీని బాగుగ కలిపిరి
రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా!
నిబద్ధియను కండచక్కెర దెచ్చి
సుబుద్దియను ఆవు నెయ్యి వేసి
అబద్దమనియెడి మలినము తీసి
ఆదిమునులు దీని పాకము బట్టిరి
రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా!
2. రామా కోదండ రామా రామా పట్టాభిరామా
3 రామా కల్యాణరామా...... రాఘవా
రామా నీదొక్కమాట రామా నాకొక్కమాట
రామా నీపాటే పాట రామా నీ బాటే బాట
రామా నాకెవరూ తోడు రామా క్రీగంట చూడు
రామా నేను నీవాడు రామా నాతో మాటాడు ||రామా కోదండ||
రామా సీతాపతి రామా నీవే గతి
రామా నీకు మ్రొక్కితి రామా నీ చేజిక్కితి
రామా నీ నామమే మేలు రామా నీ చింతనే చాలు
రామా నామమే మేలు రామా చింతనే చాలు
నీ నామమే మేలు నీ చింతనే చాలు
నామమే మేలు చింతనే చాలు .
నీ నామమే మేలు నీ చింతనే చాలు
రామా నేను నీవాడు రామా నాతో మాటాడు ||రామా కోదండ||
(రామాయణం లోని రహస్య ములు : సాయి భగవానుని ధర్మ వివరణలు (పు 54-57)