విద్యారణ్యులవారు దాసోహం దాసోహం అనే చింతనలో సాధన ప్రారంభించాడు. దాసోహం అనే మంత్రములో ప్రారంభించిన ఈ సాధన క్రమక్రమేణ కొంతకాలం తరువాత సోహంగా మారిపోయింది. ఒకనాడు విద్యారణ్యులవారు తన శిష్యులకు బోధిస్తున్నాడు. శిష్యులు గురువును ప్రశ్నించారు. "స్వామీ! యింతకాలము దాసోహం దాసోహం అనే సాధనచేత తాము యింత స్థాయికి వచ్చారు. కానీ యీనాడు శివోహం శివోహం శివోహం లేదా సోహం సోహం సోహం అంటున్నారు. ఈ మార్పునకు కారణమేమిటి?" అన్నారు. “బిడ్డలారా! యింతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడనై పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిత్తచోరుడు, బృందావనవిహారి, గోపీ మానస సంచారి, వచ్చి ఆ దా ను అపహరించాడు. దాసోహం దాసోహం అనే పదములో కృష్ణుడు దాకారాన్ని ఆపహరించటం చేత సోహంగా మారిపోయింది" అన్నాడు. ప్రారంభములో నీవు దాసుడుగా ప్రయాణము సలిపావు. నాయనా యిప్పుడు నన్ను సమీపించావు. నాతో ఐక్యుడై పోతున్నావు. కనుక నీవు సోహం సోహం అనే మార్గమును అనుసరించు" అన్నాడు.
రామకృష్ణ పరమహంస దగ్గర ఒక గృహస్తుడైన భక్తుడు, ఒక సన్యాసియైన భక్తుడు వుండేవారు. నాగమహాశయుడు గృహస్థ భక్తుడు. వివేకానంద సన్యాసి భక్తుడు. నాగమహాశయుడు నిరంతరము దాసోహం దాసోహం నేను దాసానుదాసుడను అని సాధన ప్రారంభించాడు. దాసోహం అనే పదముతో సాధనను ప్రారంభించినప్పుడు మానవునియందు అహంకారవృత్తులు శూన్యమవుతాయి. అహంకారముండినంతవరకు ఆత్మజ్ఞానము ప్రాప్తించదు. ఈ అహంకారమనే గాండీవమును పారవేసి "కరిష్యే వచనం తవ" అని శరణాగతుడు కావటంచేతనే అర్జునునికి కృష్ణుడు అనేక విధముల ధైర్యము ప్రోత్సాహము అందిస్తూ వచ్చాడు. ఆహంకారముండినంత వరకు ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపము లభ్యము కాదు. పరమాత్మ అనుగ్రహము చిక్కినా అహంకారముండుటకు వీలులేదు. ఒకే సమయమునందు ఒకే ప్రదేశములో వెలుతురు చికటి వుండుటకు వీలులేదు కదా! కనుకనే నాగమహాశయుడు మొదలు దాసోహం దాసోహం అని తనను అల్పస్థాయికి తీసుకొని వెళ్ళాడు. కానీ వివేకానందుడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనే సాధనలో విశాలహృదయుడుగా తయారయ్యాడు. ఈ యిరువురిని గురించి నిరంజనానందస్వామి చెప్పాడు. నాగమహాశయుడు, వివేకానందుడు యిరువురు కూడను మాయ అనే బంధనచేత కట్టుబడినారు. ఈ కట్టులో నుంచి నాగమహాశయుడు దాసోహం దాసోహం అని స్వల్ప రూపాన్ని ధరించి తప్పించుకొని వెళ్ళాడు. కానీ వివేకానంద శివోహం శివోహం శివోహం అని తన ఆఖండస్వరూపాన్ని విశాలమైన తత్వాన్ని అభివృద్ధి గావించుకొని ఆ మాయాబంధనలు ఛేదించుకొని వెళ్ళాడు. నేనే దేవుడను అనే ఉన్నతభావమును, ఉత్తమభావమును అభివృద్ధి పరచుకొన్నవానికి యేవిధమైన బంధనలు బాధించవు. ఇది మాటలలో చెప్పినంత మాత్రమున ప్రయోజనము లేదు. అనుభూతికి రావాలి. దేహభ్రాంతిని వీడాలి. ఇంద్రియనిగ్రహం చెయ్యాలి. సతతం యోగినః" అనే ఏకాత్మభావం పెంచుకోవాలి. అట్టివారే యీవిధమైన జ్ఞానమును పొందగలరు. అయితే భక్తుడైనవాడు అహంకారమును దూరము చేసుకొని ఆత్మానందములో లీనమవుతాడు. దీనికి ద్వైత విశిష్టాద్వైత అద్వైతమనే మూడు మార్గములను బోధించాడు.
(శ్రీ.గీ.పు.59/61)
(చూ॥ హనుమంతుడు)