ఆహారమే అన్నిటికి మూలము. ఈ దేహము ఆహారము ద్వారా తయారవుతుంది. ఆరోగ్యము లేకపోయిన ఏ పని చేయాలన్నా కష్టమే. ఉదరమును నాలుగు భాగములుగా విభజింపవచ్చును. అందు 1/4వ వంతు గాలి, 1/4వ వంతు ఆహారము, మిగిలిన సగము నీరు ఉండాలి.
ఈరోజులలో ఆహారమును అమితముగా తీసికొనడము జరుగుతున్నది. ఆ కారణముగా నీటికి చోటుండడము లేదు. భారత దేశములో వరి, గోదుమ ముఖ్య ఆహారము, మితంగా భుజించిన మంచిదే. కాని ఎక్కువగా భుజించి మందమతులవుతున్నారు. అమితాహారము బుద్ధి మాంద్యమును కలిగిస్తుంది. మితాహారము ఆరోగ్యము చెడకుండా చూస్తుంది. నేను భారతదేశములో అనేక ప్రాంతములకు వెళ్ళి వస్తుంటాను. ఆహారము వలన నేనెప్పుడూ ఆనారోగ్యమునకు గురికాలేదు. భక్తుల వ్యాధులను తీసికొన్నప్పుడే నేను వ్యాధి గ్రస్తుడనగుతాను కాని ఇంకొక విధముగా కాదు. అమితముగా పాలు తీసికొనడము చెరుపు చేస్తుంది. అది రాజసమును పెంచుతుంది. దేహమునకు ఆహారము చాలా ముఖ్యము. పుట్టుటకు కారణము కూడా ఆహారమే. తల్లిదండ్రులు ఆహారము వలన పోషింపబడి బిడ్డకు జన్మ ఇస్తారు. తల్లిదండ్రుల పెరుగుదలకు ఆహారమే ఆధారము. దేహము ఆహారపు మూట మాత్రమే. నీ ఆలోచనలు నీవు భుజించే ఆహారము పై ఆధారపడి ఉంటాయి. సాత్వికాహారము సాత్వికమైన ఫలితాలను ఇస్తుంది. రాజసము పెంచే ఉల్లిపాయల వంటివి కాక సత్వగుణమును పెంచే పండ్లు, పాలు వంటివేనైనా సరే మంచివే. మాంసము రక్తముపై పనిచేసి మోహమును, రేకెత్తించును. చేపలను తినుటవలన నీచమైన ఆలోచనలు వస్తాయి. చేప ఎప్పుడూ నీటిలోనే ఉన్నా అది దుర్వాసన వేస్తుంది.
దేహదారుడ్యమునకు ప్రాముఖ్యమునిచ్చువారు మాంసమును భుజించవచ్చును. కాని ఆధ్యాత్మిక జీవనమును గడపవలెనని అభిలషించు వారికి మాంసాహారము ఏమాత్రమూ మంచిది కాదు.
అవును. మాంసము శరీరమున కవసరమైన ప్రోటీన్లనందిస్తుంది. కాని మానసిక వికాసము నకవసరమైన ప్రోటీన్లుండవు. ఆధ్యాత్మిక జీవితమునుగడువవలెననేకృతనిశ్చయమునీకున్నట్లయితేమాంస భక్షణము కూడదు. అట్లుకాక ప్రాపంచిక జీవితమును గడుపవలెనను కుంటే మాంసభక్షణమును చేయవచ్చును. దీని కింకొక ఆధ్యాత్మికమైన కారణము కూడా ఉన్నది. నీవాక జంతువును సంహరించునపుడు దానికి ఎంతో బాధను, దుఃఖమును, హానిని కలిగించుచున్నావు. భగవంతుడు సర్వజీవులలో అంతర్యామియై యున్నాడు కదా! ఎవరైనా ఒక కుక్కను కొట్టినపుడు అది బాధతో విలవిలలాడును. కొడితేనే అంత బాధ ఉంటే ఇక మరణించే ముందు ఎంత బాధ ఉండాలి? జంతువులు మనుషులకు ఆహారము కావడానికి సృష్టింపబడలేదు. అవి వాటి జీవితములను గడుపుటకై ఏతెంచాయి. ఒక మనిషి మరణించినపుడు,నక్కలు,ఇతరజంతువులు శవమును తినవచ్చు. వాటికి ఆహారము కావడానికై మనము జన్మించలేదు. అట్లాగే జంతువులు మనిషికి ఆహారము కావడానికై జన్మించలేదు.కాని మాంస భక్షణము నోక అలవాటుగా చేసికొనుట మానవులకు పరిపాటి అయినది.
(ప.పు.29/31)
మన రాగద్వేషములు గాని అభిమాన మమకారములుగాని ఆహారము చేతనే సంభవిస్తున్నాయి. ఆహార నియమమనేది మనోబుద్ధులు అత్యవసరము. మనస్సు యొక్క తత్వము చాల విచిత్రము. శాస్త్రములన్నియు దీనిని యేవిధముగా నిర్ణయించాయంటే :–
మానవుడు ఇంద్రియముల సమసరించటంచేత పశువైపోతున్నాడు. బుద్ధిని అనుసరించుటచేత మహనీయుడౌతున్నాడు. ఆత్మను అనుసరించినవాడు తానే బ్రహ్మగా మారుతున్నాడు. మనము యింద్రియముల ననుసరించటం చేతనే పశువులుగా మారుతున్నాము. మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలువు, బుద్దిననుసరించి మహనీయుడు కాకపోయినప్పటికిని మనసు ననుసరించే మానవుడిగానైనా జీవించు. ఐతే చాలామంది మనసు కూడా చాలా చెడ్డదె కదా అని యిక్కడ సందేహించవచ్చును. మనసు ఎప్పుడు పరిశుద్ధమైనది. ఇంద్రియములను అనుసరించటంచేత మాలిన్యమును పొందుతుండాది.
(బృత్రపు ౮౧/౮౨)
పరిశుద్ధమైన దోషరహితమైన ఆహారమును భుజించాలి. ఎటువంటి పరిస్థితులయందైన దోషముతో కూడిన ఆహారమును స్వీకరించరాదు. "బిక్షం దేహార్థం, వస్త్రం శీతలార్థం" - మన దేహరక్షణకై, కానీ ఆనారోగ్యము కలిగించే ఆహారము సరియైన ఆహారము కాదు. భగవద్గీతయందు పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థశుద్ధి అత్యవసరమన్నారు. మనము భుజించే పదార్థములు ఏవిధముగా మనకు లభించినవి? అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అని విచారించాలి. ఈ నాటి మానవుడు అనారోగ్యమునకు అశాంతికి గురికావటానికి అన్యాయార్జితమైన ఆహారమే మూల కారణము. మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైన రీతిలో ఆహారమును సేకరించటం లేదు. తాత్కాలికమైన లౌకికమైన తృప్తి నిమిత్తమై విచక్షణలేక, విచారించక అనేక పెడ మార్గములు అనుసరించుచు అన్యాయార్జితమైన ఆహారమును సేకరించుకుంటున్నాము. మొట్టమొదట మలశుద్ధి నిమిత్తమై పరిశుద్ధమైన ఆహారాన్ని సేకరించాలి. ఏది అన్యాయము, ఏది న్యాయము అనే విచక్షణా జ్ఞానము సామాన్యులకు చాల తక్కువ. పాత్రశుద్ధి ఉన్నదో లేదో తెలియదు. పదార్థ శుద్ధి అంతకంటే తెలియదు. పాకశుద్ధి - వంటపని భావములు ఏవిధముగా ఉన్నవో మనకు ఏమాత్రము తెలియదు. ఈ అన్నింటి పరిశుద్ధి కోసము ప్రయత్నము చేస్తుంటే మన ఉదరము క్షీణించిపోతుంది. కనుకనే ఆహారము సేకరించిన తరువాత భగవర్పితము చేసినచో యిది పరిశుద్దమవుతుంది. ఎవరికి వారు భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్నించుకున్నప్పుడు తనలో నుండియే జవాబు వస్తుంది.
"అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణా పానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్"
నేను వైశ్యానర రూపములో నీ ఉదరము నందుండి నీవు భుజించిన ఆహారమును జీర్ణింపచేస్తున్నాను.అనిచక్కనిజవాబు.మనముభుజించుటచేత అనేకమాలిన్యములు,అనేకదోషములు.అనేక పాపములు దీనిలో ప్రవేశిస్తున్నాయి. కనుకనే “బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మాగ్నే బ్రహ్మణా హుతం" బ్రహ్మార్పణ భావముతో భుజించటంచేత అది ఆహారము కాదు ప్రసాదమౌతుంది. అందులో నుండిన దోషములన్నియు పరిహారమవుతాయి. తద్వారా మన మనస్సుకు అంటిన మాలిన్యములు క్రమక్రమేణా పరిశుద్ధము కాగలవు. తిరిగి మనస్సనే అద్దము పరిశుద్ధముగా మారుతుంది. ఐతే ఒక్క దినముతో ఒక నెలతో ఒక్క పర్యాయముతో పరిశుద్ధమయ్యేది కాదు. నిరంతరము అభ్యాసము చెయ్యాలి. పుట్టిన ప్రతిమానవుడు Walking, talking, eating, reading, writing అన్నీ ఆభ్యాసము చేతనే పొందగలుగుతున్నాడు. దీనికి కూడను అభ్యాసము అవసరము. "అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగ వేప తియ్యనుండు, సాన రాపిడి చేత సగమై పోవును". ఒక వజ్రమునకు వెల కావాలనుకుంటే అనేక రకముల కోతలు కొయ్యాలి. బంగారు పరిశుద్ధమైన అపరింజిగా ఉండాలనుకుంటే అనేక పర్యాయములు కాల్చి పరిశుద్ధము గావించాలి. అదే విధముగనే మనస్తత్వాన్ని సంస్కరింపచేసుకోవాలి. ఈ విధముగా చేయటంచేత మనస్సునకు అంటిన మాలిన్యము తొలగగలదు.
(బృత్రపు. ౮ం/౮౨)
జగత్తునందు పుట్టిన 84 లక్షల జీవ రాసులలో 83 లక్షల 99 వేల 992 జీవాలు తన సహజ ఆహారాన్ని అనుభవిస్తున్నాయి. పశుపక్షి మృగాదులు భగవంతుడు అందించిన సహజాహారాన్ని తింటున్నాయి. వీటికి అధిక జబ్బులు చేయటం లేదు. కాని మానవుడు జిహ్వా చాపల్యము చేతనే అనేకమైన రుచులకు మరిగి, కల్పితమైన పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు. టేస్టు నిమిత్తమై కుర్మాలు, బర్మాలు అన్ని చేసుకుంటున్నాడు. కాని ఆయువు ప్రమాణము ఎంత బర్న్ అయిపోతున్నదో యోచన చేసుకోవటం లేదు. కూరగాయలు ఆహారము తినేవారికి తక్కువ జబ్బులు వస్తున్నాయి. మాంసాహారము తినే వారికి ఎక్కువ ఇబ్బులు వస్తున్నాయి. కారణం ఏమిటి? ఇది హ్యూమన్ బాడీ అది యానిమల్ బాడీ. ఈ రెండింటికి చేరిక కుదరదు. డాక్టర్సు చెప్పుతుంటారు దీంట్లో ప్రోటీన్సు ఉంటాయి భుజించండి పుష్టిగా అవుతారని. ఇది వారి బలహీనత. త్రాగే పాలలో ప్రొటీను లేదా? తినే పెరుగులో ప్రొటీను లేదా? కూరగాయలలో ప్రొటీను లేదా? బేడలలో ప్రొటీను లేదా? ప్రోటీను ఎక్కడైన వుంటున్నది. ఇది శారీరకమైన అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యమును కూడా పెంచుతున్నది. మన మైండ్ ఎట్లా పోతున్నదంటే food, head, god. ఈ మూడింటికి సన్నిహిత సంబంధము అవుతున్నది. ఈ animal food ను మనం భుజించటంచేత animal thoughts మనలో ప్రారంభమవుతున్నాయి. ఎట్టిఆహారమో అట్టి భావము. ఈనాడు మానవత్వమునకు విరుద్ధమైన అమానుషత్వమును అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరం? మానవుని మనస్సు అడవులలో సంచరించే మృగములకంటే హీనమైపోతున్నది. నిర్దాక్షిణ్యముగా నిర్మోహంగా, అప్రీతిగా మానవత్వమును హింసిస్తుండాది. మానవునికి మానవునికి మధ్యనే సన్నిహిత సంబంధ బాంధవ్యము కోల్పోతున్నది. కారణము మన ఆహార దోషమే. కనుక విద్యార్ధులారా! ఆహార విహారాన్ని సరియైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి. ఏ ఆహారము సరియైన ఆరోగ్యమునకు, ఆనందమునకు అవకాశము నందిస్తుంది అనే విచారణ చెయ్యాలి. పూర్వీకులు దినమునకు రెండు పర్యాయములు భుజించేవారు. మహర్షులు దినమునకు ఒక్క పర్యాయమే భుజించేవారు. ఒక్క పర్యాయము భుజించేవాడు యోగి అన్నారు. రెండు పర్యాయములు భుజించేవాడు భోగి అన్నారు. మూడు పర్యాయములు భుజించేవాడు రోగి అన్నారు. ఈనాడు మూడు కాదు ఎన్నో పర్యాయములు పొట్టలోపల వేస్తుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి. కాఫీలు, టిఫిన్లు ఇవన్నీ వేస్తున్నాం. ఈ రకంగా జడమైన దేహమునకు ఆజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది? ఒక్కొక్క నిమిషమునకు ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతున్నది. జీర్ణమవుతున్నది. యువకులైనవారు 2000 క్యాలరీస్ చక్కగా తినవచ్చు. సరైన రీతిగా మనము బాలెన్స్ వుండాలంటే దినమునకు 1500 క్యాలరీస్ చక్కని ఆరోగ్యమనందిస్తుంది. కాని ఈనాడు 4000, 5000 క్యాలరీస్ తింటున్నాము. తద్వారా నిద్ర పట్టదు. నిద్రలేనివారు క్షుద్రాలు పన్నుతారు. వికారమైన భావాలంతా వస్తువుంటాయి. ఈ వికారమైన భావము లోపల తన ఆహారమును మరచి పోతున్నాడు. అనారోగ్యమునకు గురి అవుతున్నాడు. దేహమును సాధ్యమైనంత వరకు హద్దులో వుంచుకొని, ఆరోగ్యము పెంచుకొని, సక్రమమైన మార్గములో కర్తవ్య కర్మలు నిర్వర్తించటానికి పూనుకోవాలి.
(బ్బత్రపు ౩౯/౪౦)
అన్నదోషము చేతనే మనస్సు కల్మషము బొందుచున్నది కలుషమైన విత్తమందు ధర్మరహస్యము ప్రకాశించదు. ఎట్లన, మలిన జలముగల పాత్రలో ముఖబింబము శుద్ధముగా ప్రకాశించనట్లు మాలిన్య హృదయమున దైవసాక్షాత్కార ముదయించదు. అర్జునా! ఆహారము చేతనే మానవులు దృఢగాత్రు లగుచున్నారు. నీతివంతు లగుమన్నారు. విరుద్ధ ఆహారముచే రోగగ్రస్తులూ, అవినీతి పరులూ నీచులూ
అగుచున్నారు. కాన ఆహారమునుబట్టే వారిగుణము లిట్టివని చెప్పవీలగును" అని పలికెను.
"స్వామీ !సాత్త్విక ఆహార మెట్టిదో, రాజసి కాహార మెట్టిదో, తామసిక ఆహార మెట్టిదో ప్రీతితో అనుగ్రహించి తెలుపు మన్నాడు. అర్జునుడు.
అర్జునా! సాత్వికుల యాహారము మనసుకు, దేహమునకు, బలము చేకూర్చునదై యుండవలెను అధిక ఉప్పుకాని అధిక కారముకాని, అధిక పులుపుకాని ఆధిక తీపికానీ, అధిక వేడికాని వుండకూడదు. ఇంతియే కాక దాహమును కలిగించునట్టిదైనదిగా కూడనూ వుండ కూడదు. అన్నింటియందునూ మితమై యుండవలెను. కొంత మంది నీటితో ఉడికిన పదార్థములు రెండవదినమున తినుచుందురు. అనగా ముందుదినము వండిన అన్నమునుకూడానూ తినకూడదు.
నూనెలో నేతిలో వుడికిన పదార్థములు రెండవదినము మూడవదినమూ నిలువ పెట్టిన పదార్థములు అన్నమునకు, అనగా నీటిలో ఉడికినవాటికి సంబంధములేదు. కాని అవి కూడానూ దుర్వాసన వచ్చిన తరువాత తినుట మంచిది కాదు. దుర్వాసన రాకపూర్వమే తినుటలో తప్పులేదు. రజోగుణ ఆహారము చెప్పిన సాత్విక ఆహారము లన్నింటికిని విరోధమై యుండును. అనగా అతి ఉప్పు అతికారము,అతితిపి,అతివేడి,అతిపులుపు, దుర్వాసన కొట్టు పదార్దములు, ఇవి అన్నియూ రజోగుణమును పెంపొందింప జేయును.
పరమాత్మా: తెలియక అడుగుచున్నాను, క్షమింపుడు. ఇంత మాత్రము ఆహార మార్పులు చేసినంత మాత్రమున గుణములు సాత్వికము కాగలవా! లేక ఇంకనూ ఈ ఆహారమునకు శుద్ధిచేయు మార్గము లున్నవా? ఆట్లు ఉండిన కరుణించుము" అని అర్జును డడిగెను.
"బావా అర్జునా! ఇంత సులభముగా గుణములు సాత్వికముగా మారుచుండిన లోకమున దానగుణములు నిమిషమున నిర్మూలమయి వుండెడివి. దీనికి ఇంకనూ కొన్ని శుద్ధములు కావలసి యున్నవి. మొదటిది వస్తుశుద్ధి, రెండవది పాత్రశుద్ధి. మూడవది వండువారి లేక
వండించువారి శుద్ధి ప్రధానములు" అని యింకను క్రింది విషయములు చెప్పెను.
వస్తువులు మంచివిగానూ, శుద్ధముగానూ వున్నంత మాత్రమున చాలదు. ఆ వస్తువులు ఏవిధముగ లభించినవి, అవి లభించు మార్గము నందును అన్యాయము,అసత్యము, అక్రమము.అధర్మమువుండి యుండకూడడు అట్టి మాలిన్యములతో ఆ వస్తువులు చేరియుండకూడదు. లభించిన మార్గము కూడనూశుద్ధమైనదైసత్యమైనదై యుండవలయును. పాత్ర శుద్ధమైనదై చిలుముపట్టనిదై వుండవలెను. వండువాడు కూడనూ శుద్ధమైన బట్టలతో శుద్ధమైన హస్తములతో శుద్ధమైన ప్రవర్తన కలిగి అనగా దురభ్యాస, దుస్సంగ, దుర్భుద్ధులు, దుర్నడతలతో మాలిన్యమైన వాడుగా వుండ కూడదు. వంటచేయుచూ అపవిత్రమైన మాలిన్యమైన వాడుగా వుండకూడదు. వంటచేయుచూ అపవిత్రమైన చింతనలు చేయక, విసుగు,కోపము, ద్వేషము మొదలగు భావములతో మాటలాడక నగుముఖముతో విశ్వాస విధేయతలతో ప్రీతిగా వండుచుండవలెను. వండునంతవరకూ చెడ్డతలంపులు లేక వుండువాడై యుండవలయును. అట్లు కాక వండువాడు. చూచుటకు శుద్ధముగావుండి, తన చింతనలు వాదములపైనా, దుర్నడత పైనా వుంచుకొని విసుగుతో ఇంకా పని పూర్తికాలేదే అను కోపములో చిటపటమని గొణుగుతూ చేసిన పంట సాధకులకు ఏకాగ్రత చేకూర్చదు. అంతటితో పోక ధ్యానమందు, జపమునందు, వండువాడు తలంచిన దుష్ప్రభావములు దృశ్యముగా వచ్చి నిలుచును. కాన వండువాడు కొన్ని మంచి నడవడికలు కలవాడై యుండవలయును. అట్టివానినే విచారణ సలిపి నియమించుకొనవలయును. ఏదో మంచి రుచిగా వండు వాడనియు సులభముగా దొరకినాడ నియూ చూచుటకు పరిశుద్ధముగా నున్నాడనియు, ఈపై పై పూతలను మాత్రమే చూడక, బైట వాని ప్రవర్తనలను కూడనూ జాగ్రత్త చూచుట చాల అవసరము. మనో నిర్మలముపై జెప్పిన ఆహార శుభ్రతను పట్టి యుండును. మనో నిర్మల, మొక్కటుండియూ ఉపయోగముండదు. దానికి దేహము, వాక్కు నిర్మలము కూడనూ అవసరము; వీటినే శారీరక మానసిక వాక్కు తప్పనిసరి కూడనూ అందురు.
(గీ.పు. 230/232)
విత్తనంలో నుంచి మొట్ట మొదట చెట్టు వెలివడేటప్పుడు, ఒక చిన్న కాండం, రెండాకులుతో బయటకు వస్తుంది. అనంతరం అది పెరిగి నప్పుడు మ్రాను ఒక్కటి, కొమ్మలు అనేకము. ఒక్కొక్క కొమ్మ మ్రాను అంత పెద్దదిగా ఉండ వచ్చు. కాని వేళ్ళు చెట్టుకు కావలసిన ఆహారాన్ని ఒకే మ్రాను ద్వారా అందిస్తాయి. భగవంతుడు అన్ని దేశాల ప్రజల ఆధ్యాత్మిక ఆకలికి ఆహారాన్ని అందిస్తాడు. సత్యం, నిజాయితి, మానవత్వం, త్యాగం అనేదే ఆ ఆహారం. - శ్రీ సత్య సాయి బాబా. (నా బాబా నేను పు181)