మానవ జీవితము సుఖ దుఃఖ సంఘర్షణాత్మకమైన మహోత్తుంగ తరంగ సాగరము. ఈ సంసార సాగరంలో సంచారం చేసే ప్రతి మానవునికి దిక్కును చూపే చక్కని దీపికలు ఆధ్యాత్మిక జ్యోతులు. ఆధ్యాత్మికం పూజలకు, పునస్కారములకు మాత్రమే పరిమితమైనది కాదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించునదే ఆధ్యాత్మికము. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవారు కొన్ని నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. " నశ్రేయో నియమం వినా", నియమం లేక శ్రేయస్సు లేదు.
(స.పా.మే99పు,127)
జగత్తు నందు ప్రతి పదార్థమునకును కొన్ని నియమములు ఉంటున్నవి." న శ్రేయోనియమం వినా" ఈ దేహము కూడను అనేక నియమములతో కూడినట్టిది. మన ప్రవర్తనలయందుగాని, మన చూపుల యందుగాని, మనమాటలయందుగాని, మనభావముల యందుగాని పవిత్రతను అభివృద్ధి పరచుకోవాలి. అనుగ్రహించిన అంగములన్నిటిని అపవిత్రమార్గములో ప్రవేశపెట్టిన మానవత్వము దానవత్వముగా మారిపోతుంది. మన జీవిత మంతయు ఒక వ్యాపారంగా ఉంటుండాది. మన దేహములో ఉష్ణము 98.2°C ఉంటాది. కాని యీ ఉష్ణము 99°C కి పోతేయిది రోగమవుతుంది. మన blood pressure 120/80 ఉంటాది. కాని యిది 90 ఐతే రోగముగా మారుతుంది. మని eye ball ఎంతవెలుతురునో అంత వెలుతురునే చూడగలదు. ఎక్కువ వెలుతురు చూచిన రెటినా కాలిపోతుంది. మన ear drum ఎంత శబ్దమో అంతే శబ్దము వినగలదు. అమితమైన శబ్దము వినినప్పుడు ear drum బ్రద్దలవుతుంది. మనదేహమంతయు ఒక limited company ఇలాంటి దేహము కాపాడు కోవటంలో కొంత పరిమితి కావాలి. దీనికి తీసుకునే ఆహారము పరిమితముగా ఉండాలి. తాగేనీరుకు పరిమితి ఉండాలి. మాటలయందు పరిమితి, వినటమునందు పరిమితి, మనజీవితమంతయు పరిమితమైనదిగా వుంటుండాలి.
మితిమీరినప్పుడే ప్రమాదమునకు గురి అవుతుంది. అతి తిండి మతి హాని మితతిండి అతిహాయి. అతి భాష మతిహానీ, మిత భాష అతిహాయి. మానవుడు ఈ దేహమును ఏవిధమైన మార్గములో అనుభవింప చేసుకోవాలో ఆ ఆనందమునకు సరియైన మార్గమునే మనము అనుసరించాలి.
(బృత్ర.పు.30)
(చూ॥ నియమబద్ధ జీవితము, మాయ)