ప్రాకృతమైనట్టి జీవితమున అనంతమైనట్టి శక్తులతో అప్రమాణమైన జీవితాన్ని గడపటము మానవమాత్రులకు సహజము కాదు. ధనమును సాధించిన వాడే దాంతుడు. దాంతుడైనవాడే వేదాంతుడు. దాంతవేదాంతముల యొక్క సమన్వయాన్ని, సత్య స్వరూపాన్ని అనుభూతుల విభూతిగా లోకానికి అందించినవారే ప్రాచీన మహర్షులు. న్యాయ వైశేషిక దర్శనములను, పదార్థము యొక్క సిద్దాంతములను అణుశక్తి యొక్క సిద్దాంతమును ఈ సాంఖ్యము అంగీకరించలేదు. ప్రపంచమంతయూ విరుద్ధమైన శక్తుల యొక్క సమన్వయ స్వరూపమని ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది. దీనికర్త కపిల మహర్షి కనుకనే ఈ సాంఖ్య దర్శనమునకు కాపిల్య అని మరొక పేరు. సంఖ్యల యొక్క సమన్వయముచేత ఈ ప్రకృతి ఉండటంచేత దీనికి సాంఖ్యమని మరొక పేరు వచ్చింది. నువ్వులలో తైలముండినట్లుగా కర్రలలో నిప్పు ఉండినట్లుగా పువ్వులలో పరిమళముండినట్లుగా ఈ ప్రకృతియందు పరమాత్మతత్వము కారణరూపమై యుంటున్నది. పరమాత్ముడు కారణ స్వరూపుడు. ప్రకృతి కార్యస్వరూపము. కార్య కారణములు అవినాభావ సంబంధములు, కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు పరమాత్మునియొక్క బాహ్మస్వరూపమేననియూ ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.“సాంఖ్య మనగా తత్వము అని అర్థము. తత్వమవగా విచారణాశక్తి, నిత్యానిత్య విషయపరిశీలన చేసే పవిత్రమైన శక్తికి తత్వమని పేరు. ఒక్క పదార్థముచేత సృష్టి యేర్పడుటకు వీలు కాదు. రెండు పదార్థములు చేరినప్పుడే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది. ఒక హస్తముచేత శబ్దము యేర్పడదు. రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము యేర్పడుతుంది. ఒక్క శక్తిచేత వేడి మనకు సంభవించదు. రెండుశక్తుల యొక్క రాపిడి చేతనే, వేడి ఆవిర్భవిస్తున్నది. అటులనే ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే సృష్టికి మూలకారణము, కనుక ప్రకృతి ప్రత్యేకమైన స్వరూపమనిభావించటము అజ్ఞానమే. అంతర్భూతమై అవ్యక్తముగా దివ్యమైన పరతత్వము ఇందులో వున్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
ఈ ప్రకృతికి 24 తత్వములున్నవని చెప్పింది. ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదుప్రాణములు, పంచతన్మాత్రలు, అంతర్బూతమైన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్ని చేరి 24 తత్వములతో కూడినట్టిది ఈ ప్రపంచము. ఈ 24 తత్వములు పరస్పర విరుద్ధములైనవిగా వుంటున్నవి. నీరుంటే నిప్పుండదు. ఇవి ఒకదానికొకటి విరుద్ధమైన శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము. ఇట్టి విరుద్ధమైన శక్తుల యొక్క సమన్వయ స్వరూపమైన ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది ఈ సాంఖ్యము. మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూలకారణమని నిరూపిస్తూ వచ్చింది. కేవలము ప్రకృతిని విసర్జించి ఏకాంత జీవితము గడపడము మోక్షము కాదని విమర్శించింది. ఈ ప్రకృతియొక్క 24 తత్వములలో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వముగా రూపొందుతాడు. ఈ 24 తత్వములు పురుషునకు విషయములనికూడ ప్రబోధించింది. జీవుడు ప్రకృతిని విసర్జించి కొంత వరకూ విభాగము సల్పి 26వ తత్వమైన పరమాత్మతో, శివుని తో లీనమవుతూ వచ్చింది. కనుక ఈ 24వ తత్వములు ప్రకృతిని, పురుషుడు 25వ తత్వము వాడు, ఈశ్వరుడు 26వ తత్వము. ఈ 26 తత్వములతో కూడినట్టిదే ఈ మానవత్వము. మానవుడియందే ప్రకృతి పురుష జీవతత్వములు ఏర్పడియుంటున్నవి.
జీవుడుండె దేహమందు హృదయమందు దేవుడుండె
రెండుకూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండు
బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు కలడు
మంచి చెడ్డ బొమ్మలుండె ఒకటిలోన రెండువుండే
ఒకటిలోనే రెండు ఉన్న తత్వమును మనము ఏవిధముగా గుర్తించాలి? ఏకత్వమునందు అనేకత్వము భావించటం సామాన్య మానవుని యొక్క స్వభావము. కానీ అనేకత్వము నందలి ఏకత్వాన్ని గుర్తించటమే మహనీయుల యొక్క లక్షణము. మానవత్వము కేవలము దైవముతో కూడిన ఏకత్వమే కాని భిన్నత్వము కాదని ఈ సాంఖ్యము ప్రభోదిస్తూ వచ్చింది.
(స.ది. పు.127/129)
జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్యానర రూపములో ఉన్నాడు. ఆనే విశ్వాసముతో చేయాలి. ఈ విధమైన ప్రార్థనలు ఒక నిర్భంధముగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు. హాస్టల్ లో భుజించిన సమయమునందే ప్రార్థన చేస్తారు. ఇంటికి పోయిన తరువార ప్రార్థనా లేదు, ఏమీ లేదు. అర్థం లేని జీవితంగా వుంటుంది. ఇంకా ఈ నాటి భోజనాలు ఎలాంటి విధంగా జరుగుతున్నాయో తెలుసునా! పాపం సంవత్సరమంతా పుట్టపర్తిలోనూ, బెంగుళూరులోనూ నివసించి టి.వి.లు వీడియోలు చూసే అవకాశం లేదు పాపం. హాలిడేస్ లో వచ్చారని అమ్మా నాన్నా బాబూటి.వి చూడాలి. దానిముందే భోజనములు కూడా తెచ్చి వడ్డించితే,అక్కడ టి.వి చూస్తూనే తింటూ వుంటాడు వాడు. అవి చూస్తూ వాటి భావముతో భుజించటంచేత ఆ ఆలోచనలు, భావాలు వీడికి వస్తున్నాయి. హాలిడేస్ కి బయటకు పోయిన పిల్లలు చెడటానికి మూలకారణమిదే. ఎందుకంటే తినే ఆహారము ఎంతమాత్రము భగవంతునికి అర్పించటం లేదు. ఆహారశుద్ధి అత్యవసరమనికూడను సాంఖ్యము ఖండితముగా గుర్తించింది. ఎందుకంటే పంచప్రాణము లకూ అంతర్చూతముగా ఉండినది ఈ ఆహారము. ఈ దేహమే ఆహారము యొక్క స్వభావము. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుంది. ఇది చక్కగా మీరు గుర్తించాలి. అన్నమయజీవితము మన దేహము. తిరిగి భుజించేది కూడా అన్నమే. కనుకనే ఆహారము మహా ప్రధానమని బోధిస్తూ వచ్చింది. సాంఖ్యదర్శనము. ఈ చిన్న చిన్నసూక్ష్మమైన విషయాలను ఎవ్వరూ గ్రంథములలో విచారించరు. అతి సూక్ష్మమైనదానియందే అతి ఘనమైనవి, అతి ముఖ్యమైనవి ఉంటాయి. చిన్నవి కదాయని మనము అలక్ష్యం చేస్తే అదే ఒక పెద్ద సముద్రముగా రూపొందుతుంది. చిన్న చిన్న చెదలు కర్రకు పట్టి క్షణములోపల కర్రను భస్మం చేస్తాయి. కనుక చిన్నది కదాయని మనము ఆలక్ష్యం చేయకూడదు.
(ప.ది.పు.134/135)