ఈనాడు చదువులు పెరుగుతున్నాయిగాని, మనస్సులు కుంచించుకు పోతున్నాయి. మనుష్యులు మరీ సంకుచితులుగా తయారవుతున్నారు. విశాల భావాన్ని పెంచుకోవాలి. ఇదే నిజమైన విద్యకు సారం, లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరి తీరాలనే పట్టుదల మనలో ఉండాలి. దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, భారతదేశ విశిష్టతను పెంచుకోవాలి. ఈ రెండు చేరినప్పుడు ఆనందం లభిస్తుంది. సైన్సు వేరు, అధ్యాత్మికత వేరు అని విభజించరాదు. రెండిటిని సమన్వయపరచాలి. ఈనాడు విజ్ఞానం పెరిగిపోయిందని విఱ్ఱవీగుతున్నాము గాని, విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే పెరిగిపోతున్నది. ఈనాటి విజ్ఞానం కేవలం స్వార్థ స్వప్రయోజనాలతో అభివృద్ధి చెందుతున్నదేగానీజగత్కళ్యాణంకోసంకాదు.విజ్ఞానంఎంతోపెరిగినా,దురాలోచనలు,దురలవాట్లు,దుర్బుద్ధులు,దుష్కర్మలుపోవటంలేదు. పవిత్ర భావాలు రావటంలేదు. ఒక దేశం వారు మరొదేశాన్ని భస్మం చేయాలని కక్షవహిస్తున్నారు. ఇదేనా సైన్సు సాధించిన అభివృద్ది? ఇది విజ్ఞానం కాదు, పరిపూర్ణమైన అజ్ఞానం. ఈ స్థితికి కారణ మేమిటి? సైన్సుకు జీవిత సామర్థ్యాన్ని పెంచే స్తోమత, ఆధారం లేదు. జీవిత సమగ్రతను పోషించే అధికారం ఒక్క ఆధ్యాత్మికతకు మాత్రమే ఉన్నది. మానవతా విలువలు ఒక్క ఆధ్యాత్మికత్వంతో జోడించినప్పుడే అభివృద్ధి కాగలవు. కేవలం సైన్సుతో ముడిపెడితే ఏమాత్రం అభివృద్ధికావు. విత్తనాన్ని భూమిలో పెట్టినప్పుడే మొక్క మొలుస్తుంది. డబ్బాలో పెట్టి నీళ్ళు పోస్తే కుళ్ళిపోతుంది. మానవతా విలువలు పెరగడానికి ఆధ్యాత్మికత్వమనే సైన్సు చాల అవసరం. కనుక మొట్టమొదట ఆధ్యాత్మిక భావాలను అభివృద్ధి గావించుకోవాలి.
(శ్రీజా. 97 పు. 34)
ఏదో నాకు తెలియని మహత్తరమైన శక్తి ఒకటి నాకంటే వేరుగా ఉంది అని కొంతమంది విశ్వసించి ధ్యానము చేస్తారు. గోప్యముగా రహస్యముగా ఏదో ఒక దివ్యమైన శక్తి నాకంటె వేరుగా వున్నది. దీనిని పొందాలి అని అనేక దీక్షలు పూనుతారు. ఇది కేవలము అజ్ఞానము. నీకంటే వేరైనది ఒకటి వున్నదనుకున్నంతవరకును నీవు అజ్ఞానములో మునిగినవాడవే. నీకంటే మించినది లోకములో మరొకటి లేనే లేదు.
“నిజముగా దుఃఖమునకు కారణము జన్మ. జన్మకు కారణము కర్మ, కర్మకు కారణము రాగద్వేషములు. రాగద్వేషములకు కారణము పరిస్థితుల ప్రభావము. పరిస్థితుల ప్రభావమునకు కారణము బుద్ధి, బుద్ధికి కారణము ద్వైతము. . ద్వైతమునకు కారణము అజ్ఞానము. అజ్ఞానమే దుఃఖమునకు కారణము.”- బాబా (సాలీత పు107)