కస్తూరీ మృగము తననాభినుండి పుట్టే సుగంధాన్ని అనుభవిస్తూ అది ఎక్కడ నుంచి వస్తుందా అని అడవంతా తిరుగుతుంది. అడవంతా తిరిగి అలసిపోయి కట్ట కడపటికి ఒక వృక్షచ్ఛాయలో విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి తీసుకునే సమయములో తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకొని పవళిస్తుంది. తన నాభినుండి వచ్చే సుగంధమును గుర్తించి అయ్యో ఈ సుగంధం ఎక్కడ ఉన్నదా అని అడవంతా సంచరించాను. అలసిపోయాను అనుకుంటుంది. అదే అజ్ఞానము యొక్క తత్వ ము. మానవుడూ అంతే. నిత్యానందము. బ్రహ్మానందము అద్వైతానందమనేది మానవుని స్వభావము, స్వరూపము. బాహ్య, భౌతిక ప్రాకృతసంబంధమైన విషయ వాసనలకు లోబడి ఆ దివ్యమైన భవ్యమైన నవ్యమైన తత్త్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అనుభవించలేకపోతున్నాడు. అన్వేషించలేక పోతున్నాడు. తన ఆత్మయే సర్వవిధములైన మార్గములను అందిస్తూ నిరంతరము ఆనందింపజేయు చున్నది. దుఃఖ విచారము ఏమాత్రము లేదు. పాత్రలో పాయసము పోసి ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా ఏ రంధ్రమునుంచి వచ్చినా పాయసమే వస్తుంది. కాని మరొక చేదు రాదు. ఆత్మ ఆనందమయము. కనుకనే ఋషులు ఆత్మకు ఆనందము అని పేరు పెట్టారు.
(బత్ర.పు.౧౬౩)