రాముడు అరణ్యానికి బయలుదేరి ముందు సీత వద్దకు వెళ్ళి, పితృవాక్య పరిపాలన నిమిత్తం తాను అడవికి వెళుతున్నానని తెలియచేశాడు. అప్పుడు సీత పతి అడుగుజాడలను అనుసరించుటయే సతికి ధర్మము కాబట్టి, తాను కూడా వస్తానన్నది. "అడవులలో క్రూరమృగములుంటాయి; భయంకర మైన రాక్షసులు నివసిస్తుంటారు. వారివల్లనీ కేదైనా అపాయం సంభవిచవచ్చును. కాబట్టి, నీ ఆలోచనను విరమించుకో" అని రాముడు అడ్డు చెప్పాడు. అప్పుడు సీత "రామచంద్రా! జగద్రక్షకుడివైన నీకు నన్ను రక్షించడమే మీ కష్టం కాదు" అని పలికింది. రాముడు ఆమెను సమాధానపరుస్తూ, "సీతా! నేను అరణ్యమునకు వెళ్ళిన సమయంలో వృద్ధులైన నా తల్లిదండ్రులు నాకొరకు దుఃఖిస్తారు. కనుక, నీవుఅయోధ్యలోనే ఉండి నీ అత్తమామలకు తగిన సేవ చేస్తూ, వారికి ధైర్యం చేకూర్చడం నీ కర్తవ్యం" అన్నాడు. ఆప్పుడు సీత, "నాథా! నిన్ను వదలి ఉండలేక తాను కూడా అడవికి వస్తానన్న నీ తల్లి కౌసల్యకు పతి సేవయే సతికి ప్రధాన కర్తవ్యమని బోధించావు. ఇప్పుడు నాచెంతకు రాగానే అత్తమామల సేవయే కర్తవ్యమని బోధిస్తున్నావు, ఏది సత్యమో నీవే యోచింపుము. అంతేకాదు, నీవు రామచంద్రుడవు. నేను సీతను. అనగా, శీతలమైన వెన్నెలవంటి దానను. చంద్రుడు అరణ్యమందును, వెన్నెల అయోధ్యయందును ఉండ వీలుండదు కదా! చంద్రు డెక్కడో అక్కడే వెన్నెల కూడా ఉండి తీరవలసిందే. కాబట్టి నేను కూడా నీ వెంట వస్తున్నాను." అని దృఢంగా పలికింది. ఈ విధంగా, పతియే సతికి దైవంగా భావించి, పతి అడుగుజాడల ననుసరించడానికి ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధమై సీత గొప్ప ఆదర్శాన్ని కనబర్చింది.
(స.సా..మే.2000 పు.146/147)
ఓ సీతా! నీ మూలమున తల్లిదండ్రుల వంశము అత్తమామల వంశము రెండునూ పవిత్రమయ్యెను. నీ కీర్తి లోక వ్యాప్తి కాగలదు. తల్లీ. నీ కీర్తి అను నదికి పై రెండు వంశములును రెండు గట్లు, గంగానదికి భూలోకమున మూడు పుణ్యతీర్థములు మాత్రమే కలవు. హరిద్వారము, ప్రయాగ, సాగరసంగమము. అయితే నీ కీర్తి బ్రహ్మాండ ప్రవాహమై సర్వుల హృదయ క్షేత్రము లందూ తీర్థరూపమున సార్థకమును గావింతువు గాక అని ఈ విధముగ వాత్సల్యముచే పలికిన తల్లి (సునయన) సత్య వాక్కులను సీత విని సిగ్గుపడినటుల నటించుచు తల్లీ! యెంతటి మాట యెక్కడి సంబంధము? పవిత్ర గంగకూ, నాకూ పోలిక యేమిటి? అని భక్తి శ్రద్ధలతో గంగకు నమస్కరించునటుల ప్రదర్శించి నిలిచెను.
(రా.వా.మొ.పు.354)
సీతారాములు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకనాడు లక్ష్మణుడి కి కూడా తెలియకుండా సీతాదేవి తన దివ్యాంశలన్నిటిని అగ్నిలో నిక్షిప్తం చేసింది. ఈ రహస్యంఆమెకు రామచంద్రునికి మాత్రమే తెలుసు. సామాన్య స్రీగావున్న సీతనే రావణాసురుడు స్పృశించి అపహరించాడు. లేకపోతే ఆమె పతివ్రతా మహిమవల్ల భస్మమైపోయేవాడు. అందువల్లనే అశోకవనములో ఆమె సామాన్య స్త్రీలా చాలా అగచాట్లు పడింది. రాక్షస సంహారానంతరము రాములవారు ఆమెచేత అగ్ని ప్రవేశం చేయించి అగ్నిలో నిక్షిప్తమైన శక్తులను తిరిగి సంపాదించుకొనేట్లు చేసి, అటుపిమ్మట ఆమెను స్వీకరించి అయోధ్యకు తరలివచ్చాడు. అగ్ని ప్రవేశములో దాగియున్న రహస్యం యిది. అంతేకాని సీతాదేవి సౌశీల్యాన్ని రాముడు శంకించాడనుకోవటం పొరబాటు. ఆమె గుణాలు పూర్తిగా తెలిసిన రాముడు ఆమెను శంకిస్తాడా!
(స.పు.18)
రామాజ్ఞను పురస్కరించుకొని నిండు గర్భవతి సీతను మునిపల్లెలో విడిచి రావటానికి బయల్దేరాడు లక్ష్మణుడు. ఆ సమయంలో సీత ప్రశ్నిస్తుంది, లక్ష్మణా! రాముడు లోకాపవాద భీతితో నన్ను అడవులకు పంపటంలో ధర్మమున్నది. ప్రజా పరిపాలనయే ప్రభువు ధర్మం. ప్రజలకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించటమే ప్రభువు కర్తవ్యం. స్వపర భేదం లేకుండా సర్వమూ త్యజించి ప్రజల క్షేమాన్ని చూడటమే ప్రభువు నియమం. అతని కీర్తియే నాకు ఆనందం. అతను నన్ను త్యజించినా నాకు దుఃఖం లేదు. రాముని కీర్తి చికాలం వర్థిల్లాలి అని అంది. దీనినే ఉదాత్త శీలం అంటాను.
బ్రహ్మలో మూలప్రకృతి అనేది ఒకటుంది. దానిని మాయ అంటారు. ఆ మాయయే ధర్మస్థాపన కోసం స్థూల శరీరాలను సృష్టించి, ఒకరిలో రాముడని, ఒకరిలో సీత అనీ, మరియొకరిలో హనుమంతుడనీ తానే చేరి, సూక్ష్మ రూపములో వుండి ఈ రామాయణాన్ని నడిపించింది. ఇదంతా చేసింది సీతయే! పురుషుడు నిరాకారుడు, నిష్క్రియుడు. అటువంటప్పుడు అతను స్థూలరూపంలో ఎలా రాగలడు? రాముడుకూడా పురుషుడు కాడు. అతడుకూడా ప్రకృతియే! పురుషుని ప్రాకృతమైన కళ్ళతో చూడటం సాధ్యమా! స్థూల దేహాలు వేరేగాని, సూక్ష్మవైనవన్నీ ప్రకృతియే. దానికంటే సూక్ష్మమైనదే ఆత్మ. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు122-123)