"పాపాల పుట్టినిల్లు పావనాంగా! ఈ
కోపమన్న రావణుండు కోమలాంగా!
ఏపుమీర పదితలల పాపరాజు వీని
రూపుమాపి మా తాపమాపవయ్యా "
అని ప్రార్థించారు. దేవతలు. కనుక, మనయందున్న కోపమనేటువంటి రావణుడు, మనలోనున్న ప్రజ్ఞానమనేటు వంటి విజ్ఞానమనేటువంటి, సుజ్ఞానమనేటువంటి సీతను అపహరించడానికి పూనుకుంటున్నాడు. కనుక, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన మయమైనటువంటి స్వరూపమే సీతయొక్క తత్వము. ఈమెనే శక్తిస్వరూపము. ఇటువంటి నిర్మల విశ్చల నిస్వార్థమైనటువంటి సీతతత్వాన్ని విశ్వామిత్రుడు ఆత్మస్వరూపమైన రామునికి అందించ దానికి పూనుకొన్నాడు. ఈ ఇరువురి సమావేశమే, సంయోగమే లోకళ్యాణము అని నిరూపించింది ఈ రామాయణము. ఈ కళ్యాణమును చూచుటకు, మనోభావములైన దేవభావములు అన్నియు ఆనందోత్సాహములో పురికొల్పుకుంటూ, పురకాంతలు అందరూ బలయు దేరి వస్తున్నారు. వీరందరుకూడను, ప్రకృతి స్వరూపమైనసీతయొక్క తత్వాన్నంతా వర్ణిస్తూ వచ్చారు. సీత అనగా -భూపాల అనే తత్వాన్ని నిరూపిస్తూ, భూమియందున్నటు వంటి కళలన్నీ కూడను వర్ణిస్తూ వచ్చారు.
“శ్రీలు మించిన దిక్కుటాలు,
వింతల బంగళాలు, ముత్యపు తోరణాలు
మూలల కిటికిటీలు, వజ్రాల తలుపులూ
తాపిననీలాలు, నీలాలు వెయ్యర్లు నూరార్లు బజార్లు
రారే చూడగ పోదాము:
రాముల పెండ్లి రారే చూడగ పోదాము."
ఈ ఉద్భావములైనటువంటి సద్భావములన్నియూ కూడను. ఇలాంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
స్త్రీలకెక్కువ భూషణాలు, ఉత్తరదర్పాలు
సీతకు రాముడు సూత్రము గట్టుతాడు
ఇద్దరి నొక్క ఈడుజోడుగ గూర్చినాడు
సీతకు తగువాడు శ్రీరాముడు
రారే చూడగ పోదాము:
రాముల పెండ్లి రారే చూడగ పోదాము.
మించి మగలకడనుంచి సిగ్గున తలవంచి
వసిష్టు రప్పించి, ఖడ్గములు తెప్పించి
దూలాలపై గుప్పించి, గుప్పించి, యిప్పించి
మెప్పించి, రప్పించుట
రారే చూడగపోదాము; రాముల పెండ్లి
రారే చూడగ పోదాము.
ఈ పదముల యొక్క అంతరార్థమును, మనం చక్కగా విచారణ చేసినప్పుడు, ప్రకృతి యొక్క సద్గుణములు, ప్రకృతి యొక్క కళలు, ప్రకృతి యొక్క సౌందర్యములు కలిగిన భూజాతైన సీత, రాములను వరించుటకై వెళ్ళుచున్నది. అనే అంతరార్థము చక్కగా మనకు బోధపడుతున్నది.
కనుక, రాములకళ్యాణ మనేటువంటిది, కేవలము ఒక దశరథుని యొక్క కుమారునికి, జనకరాజు యొక్కకుమార్తెకు జరిగిన కళ్యాణము అని మాత్రము మనముభావించుకొనకూడదు. మనహృదయమునందుండే పరిశుద్ధమైన ఆత్మభావము, నిస్సంశయమైనటువంటి, చిత్తశుద్ధియైనటువంటి జ్ఞానము ఈ రెండింటి యొక్క సంయోగమే జీవితము యొక్క కళ్యాణముగాభావించుకొంటుండాలని ఇందులో నిరూపిస్తూ వచ్చాడు విశ్వామిత్రుడు. అనగా జీవతత్వము, పరతత్వము రెండింటి యొక్క ఏకత్వమే లగ్నము అను చెప్పబడుతుంది. మన మనస్సు భగవంతునియందు లీనమై నపుడుకూడను అది లగ్నమని పిలవబడుతుంది. అనేకమంది ప్రశ్నిస్తుంటారు. "స్వామీ! నా మనస్సు భగవంతునియందు లగ్నము కావడం లేదు ఎందుకు?" అని. ప్రకృతి యొక్క విషయమునందు కూడను మనము చూసినపుడు, ఒకరిబిడ్డను ఒకరి కుమారునకు యిచ్చి పెండ్లి చేసేటువంటి విషయములో కూడను లగ్నపత్రిక అంటారు. అచటకూడను లగ్నము అను పదమును ఉపయోగపడుతూ వచ్చారు. లగ్నమనగా, కేవలము జీవాత్మ పరమాత్మల యొక్క సంయోగమే. అదే నిజమైన లగ్నము. ఇట్టి లగ్నము జరిగినటువంటి రాత్రియే, జీవాత్మ పరమాత్మలకు ఏకత్వమును నిరూపిస్తూ, విశ్వామిత్రుడు అంతర్జానమయ్యాడు. ఈ లగ్నము అయ్యేంత వరకు కూడను. భగవత్ తత్వమును అతి రహస్యంగా ఉంచుకున్నాడు విశ్వామిత్రుడు.
(ఆ.రా. పు 281/283)