పంచవటిలో సీతారామలక్ష్మణులు చక్కని పర్ణశాల నిర్మించుకొని సుఖంగా కాలం గడుపుతున్నారు. అయితే రామలక్ష్మణులు నిత్యమూ జీవహింసకు పాల్పడటం చూసి సీత చాలా బాధపడుతూ వచ్చింది. ఒకనాడు లక్ష్మణుడు కందమూలాదులను తేవడానికి బయటకి వెళ్ళిన సమయంలో సీత రాముని సమీపించి, నాథా! కోరికలు గలవానికి మూడు దుర్గుణములు ఉంటాయి.మొదటిది అసత్య మాడటం, రెండవది పరపత్నిని గమనించడం, మూడవది జీవహింస చేయడం, అయితే మీరు అసత్యమాడరు. ఇంతకు పూర్వమెప్పుడూ మీరు అసత్యమాడలేదు. ఇకముందు కూడా అసత్యమాడబోరు. మీరు సత్యస్వరూపులని నాకు తెలుసు అన్నది. అప్పుడు రాముడు, "సీతా! పతి మంచివాడని సతి అంగీకరించి నప్పుడే పతి అనే పదానికి సరియైన విలువ వుంటుంది. నేను సత్యవంతుడనని నీవు అంగీకరించావు. అదే సంతోషము" అన్నాడు. పరపత్నీ గమనము కూడా మీలో లేదు. మీరు పరస్త్రీలను ఎప్పుడూ చూడరు. ఇట్టి గొప్ప గుణమును కూడా మీలో గమనించాను. కాని, మీరు జీవహింసకు పాల్పడుతున్నారు. దీనికి మాత్రం నేను అంగీకరించను. అయోధ్యలో ఉన్నప్పుడు ఆయుధాలు అవసరముకాని, అరణ్యంలో తాపసవేషం ధరించి ఎట్టి అపకారమూ చేయని జంతువులను హింసించడం ధర్మం కాదు. అంతేగాకుండా, ఈ రాక్షసులు మీకేమీ అపకారం చేశారు? వారు మీ జోలికి రావటం లేదు కదా! ఆలాంటివారిని నిష్కారణంగా హింసించడం ఎంత తప్పు! పురుషసింహములకు ఉండవలసిన లక్షణములు రెండు మాత్రమే ఉన్నాయి. మీలో, మూడవది లేదు" అన్నది.
సీత ఏనాడు నోరు విప్పి ఈ విధంగా పలికినటువంటిది కాదు.రాముడు మెల్లగా నవ్వుతూ, "సీతా! నీవు చెప్పింది నిజమే.కాని, రాక్షసులు ఋషులకు కష్టం కలిగిస్తున్నారు. నేను నా వలన ఏమి సహాయం కావాలి? అని వారిని అడుగు పూర్వమే వారే వచ్చి: రామా! రాక్షసులను సంహరించి మా తపస్సులకు భంగం వాటిల్లకుండా చూసుకో, అని ప్రార్థిస్తున్నారు. వారిని రక్షిస్తానని వాగ్దాన మిచ్చాను. ఇచ్చిన మాట తప్పడంకంటే పాపమున్నదా! నిన్నైనా వదులుతాను, లక్ష్మణుడినైనవదులుతాను కాని, నామాటను తప్పను. అంతేగాక ఈ తాపసులు చేసేయజ్ఞయాగాది క్రతువల వల్ల జగత్తుకు ఎంతో శ్రేయస్సు కల్గుతున్నది. కనుక, సీతా! నీవు దీనిని మరచిపో, నా నిమిత్తమై కాదు, విశ్వశ్రేయస్సు నిమిత్తమై ఈ హింస చేయక తప్పదు" అన్నాడు.
సాధ్వీమణులైన స్త్రీలకు పతులు దారితప్పి నడుస్తున్నప్పుడు వారికి సన్మారము బోధించే అధికారమున్నది. ఎందుకనగా సతి పతిలో అర్ధభాగము కదా! సీత తిరిగి రామునిలో “రామచంద్రా! నేను నీ అర్ధాంగిని, ధర్మపత్నిని, నీకింత మాత్రం చెప్పే అధికారం నాకు లేదా? నీవు అంగీకరించు, అంగీకరించకపో. నీవు చేసేది తప్పే. నీవు రాకపూర్వము ఈ ఋషులు అరణ్యంలో జీవించడం లేదా? ఇప్పుడు నీవు తేరగా చిక్కావని నీవద్దకు వచ్చి రక్షింపుమని ప్రార్థిస్తున్నారు. అంతమాత్రమున రాక్షసులను హింసించడం మంచిది కాదు" అన్నది కాని, ఈ మాటలు రాముని చెవికి పోలేదు. "నేను ఋషులను సంరక్షించక తప్పదు. నా కంటి ఎదుటవారు బాధపడుతుంటే నేను సహించలేను. “ధర్మో రక్షతి రక్షితః" దైవము ధర్మాన్ని రక్షిస్తే, ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది. కనుక, సీతా! ఈ విషయంలో నీవు జోక్యం చేసుకోవద్దు" అన్నాడు. సీత రాముని పాదములంటి, “నాకు తోచినది చెప్పాను, నన్ను క్షమించు" అని ప్రార్థించింది. కాని, తనలో తామ చాల బాధ పడింది. " ఈ దండకారణ్యమునకు రావటమే ఒక దండనగా ఉన్నది. మున్ముందు ఎన్ని ప్రమాదాలు సంభవిస్తాయో!" అని తనలో తాను చింతించింది. పవిత్రమైన స్త్రీల హృదయాలలో భవిష్యత్తు చక్కగా ప్రతిబింబిస్తుంది.
(శ్రీ భ. ఉ.. పు.67/68)