సీతాకళ్యాణము

కన్యాదానం జరిగింది. జనకమహారాజు తన భార్యయైన సునేత్రితో కూడి ఒకవైపున సీతను, మరొకవైపున పెంపుడు బిడ్డయైన ఊర్మిళను తీసుకొని రాగా అతని తమ్ముడైన కుశధ్వజుడు మాండవి, శ్రుతకీర్తి అనే పేరుగల తన ఇరువురు కుమార్తెలను వెంటబెట్టుకొని వచ్చాడు. కల్యాణమండపంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను తూర్పువైపు ముఖం పెట్టి కూర్చోబెట్టారు. వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ, మాండవి. శ్రుతకీర్తిలను కూర్చోబెట్టారు. వధూవరులకు మధ్యలో ఒక తెర కట్టారు. ఎందుచేత? చూడకూడదు. అయితే శుభముహూర్త సమయంలో తెర తీసినప్పుడు కూడా రాముడు ఎటో చూస్తున్నాడు కాని, సీతవైపు చూడలేదు. జనకుడు వచ్చిరామా! మమపుత్రి ఇదం సీతా" అన్నాడు కాని, రాముడు వినిపించుకోలేదు. జనకుడు, "రామా! సీత ఇక్కడుంది. నీవు ఎక్కడో చూస్తున్నావు" అని రెండు మూడు పర్యాయములు అన్నాడు. "ఇంకా మంగళ సూత్రం కట్టలేదు. వివాహం కాని స్త్రీని చూడటం మహాపాపం కనుక, నేను చూడను" అన్నాడు రాముడు. దీనిని బట్టి రాముని ఆదర్శం ఎంత ఉన్నతమైనదో గుర్తించవచ్చు.

స్త్రీల కెక్కువ భూషణాలు ఉత్తర ర్పాలు

సీతకు రాముడు సూత్రము కట్టుతాడు

ఇద్దరినొక్క ఈడు జోడుగ కూర్చినాడు

సీతకు తగువాడు శ్రీరాముడు

రారె చూడగపోదాము…."

అని పాడుకుంటూ ప్రజలందరూ గుంపులు గుంపులుగా పరుగెత్తి వచ్చారు. మంగళ వాయిద్యాలు మారుమ్రోగగా మంగళసూత్రధారణ జరిగింది.

 

వధూవరులు ఒకరికొకరు పూల మాలలు వేసుకోవాల్సిన సమయం వచ్చింది. రాముడు ఆజానుబాహుడు. చెలికత్తెలు తెచ్చిన పూలమాలను సీత చేతిలో పట్టుకుంది కాని, ఎంత సేపైనా రాముని మెడలో వేయలేదు. కారణమేమిటి? రాముడు సీతకంటె చాల ఎత్తుగా ఉన్నాడు. అతని మెడలో వేయడానికి వీలుగాక తల దించుకొని నిలబడింది. దీనిని గుర్తించిన రాముడు లక్ష్మణునివైపు చూసి, "నీవు ఆదివేషుడవు కదా! సీత నిలబడిన చోటును కొంత పైకి ఎత్తు" అన్నట్లు సైగ చేశాడు. "ఎత్తుతే భూమినంతా ఎత్తాలి. సీతనిలబడినచోటును మాత్రమే ఎత్తడానికి వీలు కాదు" అన్నట్లుగా లక్ష్మణుడు తిరిగి రామునికి సైగ చేశాడు. రాముడు మాత్రం దండ వేయించుకోవడానికి తల వంచలేదు. కేవలం భక్తునికే శిరస్సు వంచాలి కాని, స్త్రీల ముందు శిరస్సువంచకూడదన్నది రాముని ప్రతిజ్ఞ, లక్ష్మణుడు సూక్ష్మబుద్ధి గలవాడు కనుక, పరిస్థితిని గమనించి ఒక్కసారిగా రాముని పాదాలపై పడ్డాడు. వెంటనే లక్ష్మణుని లేవనెత్తే నిమిత్తమై రాముడు వంగాడు. ఇదే ఛాన్సు అనుకొని సీత తన చేతిలోని దండను రాముని మెడలో వేసింది. తదుపరి ఒక చెలికత్తె సరయూ నదీ జలమును ఒక పాత్రలో తెచ్చింది. జలముతో సీత రాముని పాదాలు కడగాలి. అయితే సీత పాత్రను పట్టుకొని కూర్చుంది కాని, ఎంతసేపైనా పాదాలు కడగలేదు. కారణ మేమిటి? వివాహానికి ముందుగా రాముని పాదధూళి సోకి రాయిస్త్రీగా మారింది కదా! అందుచేత రాముని పాదధూళి సోకి తన చేతి ఆభరణాలు కూడా స్త్రీలుగా మారునేమోనని సంకోచిస్తూ కూర్చుందట. అప్పుడు లక్ష్మణుడు తన అంగవస్త్రమును తీసి రాముని పాదాలు తుడిచాడు. తదుపరి సీత రాముని పాదాలు కడిగి నీటిని శిరస్సుపై చల్లుకొంది.

 

అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత జనకుడు రామునితో, “రామా! ఇదిగో నా పుత్రియైన సీతను నీకు దానం చేస్తున్నాను, అందుకో" అన్నాడు. అప్పుడు వరుడు తాను స్వీకరింస్తునట్లుగా చెప్పాలి. కాని, రాముడుఆవిధంగా చెప్పటం లేదు. పురోహితుడు వచ్చి, “రామా! కాలహరణ మవుతున్నది త్వరగా ఒప్పుకో" అన్నాడు.అప్పుడు రాముడు "మాది ఇక్ష్వాకుల వంశం. మేము దానము ఇస్తామేకాని పుచ్చుకునే అలవాటు మాకు లేదు. కనుక, దానము అనే పదమును తీసివేస్తే నేను ఒప్పుకుంటాను" అన్నాడు. జనక మహారాజు ధర్మ సూక్ష్మాన్ని గుర్తించి దానమనే పదమును తీసివేశాడు. “నా పుత్రి సీతాదేవి తల్లి లేని బిడ్డ. భూమాతకు పుట్టింది. ఈమెను చక్కగా చూసుకో" అన్నాడు. అప్పుడు రాముని పురోహితుడు. "అయ్యా! జనక మహారాజా! సీతమ్మ తల్లిలేని బిడ్డ, రాముడు తండ్రిలేని బిడ్డ, అనగా పాయసం నుండి పుట్టినవాడు రాముడు. ఇరువురూ ప్రకృతి పరమాత్మ స్వరూపులు. కనుక, సీతను కాపాడుకొమ్మనిరాముని ప్రత్యేకంగా కోరనక్కరలేదు" అన్నాడు తరువాత వరుడు ధర్మేచ, అర్థేచ, కామేచ.... అని ప్రమాణం చేయాలి. అనగా ధర్మమునందు ధనమునందు, వాంఛలందు అన్ని విధములుగా ఈమెను సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి. కాని, రాముడు దీనికి కూడా అంగీకరించ లేదు. అన్నింటియందు ఈమెను సంతృప్తి పర్చటానికి వీలుగాక పోవచ్చు. ప్రభువుగా నాకు కొన్ని బాధ్యత లుంటాయి. ప్రజాక్షేమాన్ని ప్రజాహితాన్ని నేను కోరవలసి వస్తుంది. ఒకవేళ ప్రజాక్షేమానికి అడ్డు తగిలితే సీతనైనా త్యజిస్తామని, ప్రజలను వదలను" అని ప్రమాణం చేశాడు. అందువల్లనే ఒకానొక సమయంలో ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని సీతను అడవికి పంపాడుకాని, ఆచాకలివానికి ఎట్టి శిక్షయు విధించలేదు. ఈనాడు వివాహ సమయంలో పురోహితుడు ఏమి చెప్పినా, "మమ, మమ...." అని గ్రుడ్డిగా ఒప్పుకుంటారు. కాని ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునే వారు కాదు. అంతరార్థాన్ని గుర్తించి వర్తించేవారు. ఆనాడు, చివరికి జనకుడు రామునికి ఏదీ చెప్పే అవసరం లేదని గుర్తించి, "రామా! సీతను నీ ఇష్టం వచ్చినట్లు చూసుకో" అన్నాడు. "ఎవ్వరిని ఎప్పుడు ఎక్కడ ఏవిధంగా సంతోష పెట్టాలో నాకు తెలుసు. నాకు వదలి పెట్టండి" అన్నాడు రాముడు విధంగా వివాహం జరిగిపోయింది. అందరూ కలసి వధువు ఇంటికి వెళ్ళారు. అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు. "రామలక్ష్మణులారా ఇదే నా కడపటి ఆశీర్వాదము. నేనింత కాలమూ సీతారాముల కల్యాణము కోసం వేచియున్నాను. సాక్షాత్తు లక్ష్మీ నారాయణుల కల్యాణము నా చేతుల మీదుగా జరగటం నా అదృష్టం. ఇంతకు మించిన అదృష్టం లేదు. ఇంక నాకేదీ అక్కరలేదు. ఇక్కడి నుండి నేరుగా హిమాలయా లకు వెడుతున్నాను" అన్నాడు. అందరూ విశ్వామిత్రునికి నమస్కరించారు. దశరథుడు విశ్వామిత్రునికి కృతజ్ఞతలు తెల్పుకొని కన్నీటి ధారాలు కార్చుతూ సాగనంపాడు. దీని తరువాత రామాయణంలో మళ్ళీ విశ్వామిత్రుని ప్రసక్తి లేనే లేదు.

(శ్రీ .. పు.58/60)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage