ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటంచేతనే అతని పేరు ప్రహ్లాదుడని సార్థకమైంది. ప్ర - ఆహ్లాద అనగా ఆహ్లాదమును పరిపూర్ణమైన స్వరూపములో అనుభవించినవాడు ప్రహ్లాదుడని అర్థము. వంశము రాక్షస వంశము. రూపము మానవ స్వరూపము. చిత్తము దైవచిత్తము. ఈ మూడింటి ఏకత్వమును పొందిన పవిత్ర స్వరూపుడే ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు నిరంతరము భారతీయ సంస్కృతిని ఆశ్రయించి తు.చ. తప్పక దానిని అనుసరిస్తు ఆదర్శముగా ప్రజలకు అందిస్తూ వచ్చాడు.. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు164)
సత్యమే జయం
ఒకానొక సమయంలో ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడు, అంగీరసుని కుమారుడైన సుధర్ముడు వాదంలో పోటీ పడ్డారు. గెల్చినవానికి ఓడినవాడు ప్రాణమునర్పించాలి అని షరతు విధించుకున్నారు. ఐతే, పోటీలో జయాపజయాలను నిర్ణయించటానికి ఒక జడ్జి ఉండాలి కదా! అతడు ఎట్టి సంకుచిత భావములు లేనివాడై, తన, పర భేదభావములను పాటించనివాడై ఉండాలి. కనుక, ఈ యిరువురూ ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి పోటీలో న్యాయనిర్ణేతగా ఉండమని ప్రార్థించారు. అందుకు ప్రహ్లాదుడు ఒప్పుకున్నాడు. వాదము ప్రారంభమైంది. ప్రహ్లాదుడు అన్నింటినీ గమనిస్తూ వచ్చాడు. కట్టకడపటికి విరోచనుడు ఓడినట్లు సుధర్ముడు గెలిచినట్లు నిర్ణయించాడు. దానితో సుధర్ముడు పట్టలేని ఆనందముతో ప్రహ్లాదుని పట్టుకొని, ప్రహ్లాదా! నీబోటి సత్యసంకల్పులు, పుణ్యపురుషులు ఉండటం చేతనే జగములంతా పగలుగా వెలుగుతున్నాయి, వాదంలో ఓడినవాడు గెలిచినవానికి ప్రాణమివ్వాలని తెలిసినప్పటికీ సత్యాన్ని పాటించి నీ కుమారుని ఓటమిని ఒప్పుకున్నావు. సత్యాన్నాస్తి పరోధర్మ! సత్యమును మించిన ధర్మము మరొకటి లేదు. సత్యమే దైవము. నీ సత్యమే కుమారుని బ్రతికిస్తున్నది. కనుక, నీ కుమారుని ప్రాణం నేను తీసుకోను అన్నాడు. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు164)