భక్తునికి, భగవంతునికి అవినాభావ సంబంధమున్నది. భగవంతుడు తన సర్వవ్యాపక, సర్వజ్ఞాత్వాది లక్షణాలను భక్తునికి ప్రత్యక్షానుభూతిగా అందించే నిమిత్తమై అనేక లీలలను చూపిస్తాడు. భగవంతుడు లేనిదే భక్తుడనే పదానికి అర్థమే లేదు. భాగవతము భగవత్తత్త్వతోపాటు భక్తుని శక్తిని, భగవదనురక్తిని, జగత్తుపై విరక్తిని, సాధనా సంపత్తిని, సంపూర్ణ శరాణాగతిని గురించి వివరించింది.
భక్తితో కూడిన కర్మను, అనుభవైకవేద్యమైన జ్ఞానమును భాగవతము ప్రతిపాదించింది. భగవంతునికి, భక్తునికి మధ్య ఎవరూ లేరని, అనుగ్రహానికి మార్గం భక్తియే తప్ప అన్యము లేదని ప్రకటించింది. భక్తునికి భగవంతుడే సర్వస్వము అని వర్ణించింది. భక్తుడు భగవంతుడు. భాగవతము - ఈ మూడింటి సమ్మిళిత స్వరూపమే ప్రాచీన భారతీయ సంస్కృతి..
ధ్రువుడు తన తండ్రి తొడపై కూర్చొనవలెనని ఆశించాడు. కాని సవతి తల్లి అతడిని నిరసించి, పరిహసించి, తూలనాడి వలదని వారించింది. ధ్రువుడు దుఃఖంతో తల్లివద్దకు వెళ్ళి తన కోరికను విన్నవించి, ఆమె అనుమతితోఘోరారణ్యంలో ప్రవేశించి, నిద్రాహారాలను త్యజించి, చలి, ఎండ, వానలను లెక్కచేయక అకుంఠిత దీక్షాపరుడై కఠోర తపస్సు నాచరించాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. "స్వామీ! నాకు నీవే కావాలి" అన్నాడు ధ్రువుడు. దానికి భగవంతుడు సమాధానం చెపుతూ "నాయనా! నీవు నీ తండ్రి తొడపై కూర్చోవాలనే కోరికతో తపస్సు సలిపావు. కానీ ఈనాడు మరొకటి కోరుతున్నావు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అన్నారు. కనుక ముందు నీ అభీష్టమును నెరవేర్చుకో, భవిష్యత్తులో నీకు గల రాజ్యపాలనాది బాధ్యతలను నిర్వర్తించు. ఆచంద్ర తారార్కము ఆకసమున ధ్రువతారగా ప్రకాశిస్తూ ఆదర్శప్రాయుడవై నిలచెదవుగాక" అని ఆశ్వీరదించాడు. ఈ ఘట్టంలో మనం గమనించవలసిన దేమిటంటే - తలచింది, చెప్పేది, చేసేది మూడూ ఒక్కటిగా ఉండాలి. అనగా త్రికరణ శుద్ధి అత్యవసరం.
ప్రహ్లాదుణ్ణి తండ్రి సర్పాలచేత కరిపించినా, ఏనుగులచేత తొక్కించినా, అగ్నిలో పడవేసినా, పర్వత సానువుల నుండి పడద్రోయించినా, సముద్రంలో ముంచినా అతడే మాత్రము వెరువక, కన్నీరు పెట్టక “ఓ పన్నగశాయీ! ఓ దనుజభంజన! అంటూ భగవంతుణ్ణి కీర్తిస్తూనే ఉన్నాడు. నారాయణ మంత్రాన్ని స్మరిస్తూనే ఉన్నాడు.లోకములన్నింటినీ జయించి, సూర్య చంద్ర నక్షత్ర మండలములను, అష్టదిక్పాలకులను, పంచభూముతలను హస్తగతం గావించుకున్నావేగాని నీ ఇంద్రియాలను మాత్రం జయించలేకపోతున్నావంటూ తండ్రికి కూడా బుద్ధి చెప్పాడు. చిట్టచివరకు హిరణ్యకశిపుడు "ఎక్కడున్నాడు నీ హరి?" అని అడిగాడు. "ఇందు గలడందు లేడని సందేహంబు వలదు. చక్రి సర్వోపగతుండు" అని సమాధాన మిచ్చాడు ప్రహ్లాదుడు. “ఆయితే ఈ స్తంభంలో ఉన్నాడా?" అని హిరణ్యకశిపుడు గద్దించాడు. ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని బ్రద్దలు చేసేసరికి నరసింహావతారం ఆవిర్భవించి అతణ్ణి ఆంతం గావించింది. ఇందులో అంతరార్థాన్ని గమనించాలి. ఇక్కడ స్తంభంఅనగా చేహం. స్తంభాన్ని బ్రద్దలు చేసినప్పుడే నరసింహావతారం ప్రత్యక్ష్యమైంది. అంటే దేహభావాన్ని త్యజించినప్పుడే దైవాన్ని దర్శించడానికి వీలవుతుంది. దేహభావమును, అభిమాన మమకారములను వీడనంతవరకు దైవాన్ని దర్శించడానికి వీలుకాదు.
గజేంద్రుడు శక్తివంచన లేకుండా తన భుజబలాన్ని, బుద్ధిబలాన్ని ఉపయోగించి ఎంత ప్రయత్నించినప్పటికీమొసలి బారి నుండి తప్పించుకోలేక పోయాడు. చిట్టచివరికి "అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ" అనే స్థితికి వచ్చి "నీవే తప్ప నిత:పరం బెరుగ మన్నింప దగున్ దీనునిన్, రావే ఈశ్వర కావవే వరద రక్షింపు భద్రాత్మజా" అని ఎలుగెత్తి పిలిచే సరికి తక్షణమే శ్రీ మహావిష్ణువు తన సుదర్శనంతో మొసలిని సంహరించి గజేంద్రుణ్ణి కాపాడాడు. ఈ గజేంద్ర మోక్ష ఘట్టం ఒక చక్కని అంతరార్థంతో కూడినది. సంసారమనే సరస్సులో జీవుడనే గజేంద్రుణ్ణి విషయ వాసవలనే మొసళ్ళు పట్టి పీడిస్తున్నవి. భగవన్నామం వలన, భగవంతుని సుదర్శనం వలననే జీవుడీ విషయ వాసనల నుండి విముక్తి పొందగలడు. గజేంద్రుడు తన తొండంతో ప్రక్కనున్న చెట్టును చుట్టిమొసలితో పోరాడినంత కాలము ప్రయోజనంలేకపోయింది. చెట్టును వదలి, తొండాన్ని సడలించి, ఎలుగెత్తి ఆర్తితో ప్రార్థించినంతనే భగవంతుని సహాయం అందింది. అనగా గజేంద్రుడు సంపూర్ణ శరణాగతి పొందేదాకా భగవంతుడు స్పందించలేదు. కౌరవ సభలో కృష్ణుడు ద్రౌపది మానం కాపాడిన ఘట్టం కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తుంది. ఆమె తన చేతులతో చీరచెంగును పట్టుకొని ప్రార్ధించినంతసేపు కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు. ఎప్పుడైతే ఆమె తన రెండు హస్తములను చేర్చి, అనగా దశేంద్రియములను కలిపి ప్రార్థించిందో తక్షణమే కృష్ణుడు అక్షయంగా వలువల నిచ్చి ఆమెను రక్షించాడు.
(స.సా. అ..98పు.275/276)
(చూ|| భారతీయ సంస్కృతి)