పూర్వమీమాంస “అ ధాతో బ్రహ్మజిజ్ఞాసా" అని ప్రారంభ మగుచున్నది. ఇట్టి ప్రాప్తి ధనము చేత, దానివలన పొందబడు చదువలచేత, అధికారముల చేత లభించదు. డిగ్రీలు డిప్లమాలు, యజ్ఞయాగాది క్రతువులు మొదలైన వేవియు అజ్ఞాన నివృత్తి నొసగజాలవు.
(సూ.వా.పు. 4)
మహాభారతము భాగవతమువలెను, రామాయణమువలెను భక్తి బోధకము కాదని పలువురనుట కలదు. కాని, ఒకమారు దాని రుచి తెలిసికొన్నవాడు మరి దానిని వదలడు; దానికి తక్కువ విలువయు కట్టడు. భారతము పంచమవేదముగా పేర్కొనబడినది. ఎందువలనననగా వేదములు ప్రతిపాదించు పరమార్థములు సామాన్య బుద్ధులకు సులభగ్రాహ్యములు కావు. అట్టి యర్థములను మహాభారతము మనోరంజకములయిన చిన్న చిన్న కథల రూపమున ప్రజల కందించి, యాచరణ సాధ్యములు కావించినది. అందువలన పంచమవేద మనబడినది.
పూర్వమీమాంస ప్రవృత్తి మార్గమును తెలుపును. ఉత్తరమీమాంస నివృత్తి మార్గమును తెలుపును. పూర్వమీమాంస కారణమును, ఉత్తర మీమాంస కార్యమును (అనగా, జ్ఞానమును) తెలుపును. మహాభారతములో ఆ రెండు మార్గములును సమగ్రముగా వివరింపబడియున్నవి. కావుననే పంచమ వేదముగా సంభావింపబడినది. అది వేదసారము. భారతము కమ్మకమ్మని కథలతో, సులభమైన భాషతో-మానవుని యిహలోక యాత్రకును, పరలోక ప్రాప్తికిని కావలసిన సకలధర్మములను బోధించును. అందువలననే “వింటే భారతమే వినవలె; తింటే గారెలే తినవలె” నన్న లోకోక్తి పుట్టినది.. (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 6)