ప్రయాణమై గ్రామాంతరము పోవుచున్న వ్యక్తికి మార్గమధ్యమున నది అడ్డు తగిలినది. అది పొంగి పొరలుచున్నది. దాటుటకు బాటసారి ప్రయత్నించెను. ఎవరో ఇరువురు చెట్టు క్రింద కూర్చొని యుండగా అక్కడకి వెళ్ళిచూచెను. అక్కడ ఒకడు కుంటివాడు. రెండవవాడు గ్రుడ్డివాడు. వారికి లోతు పాతులు తెలియవనియు వారు చెప్పుమాటలు నమ్మ రాదనియు ఆగంతకుడు వెనెకకు పోయెను. అనగా శాస్త్రజ్ఞానము లేనివాడు గ్రుడ్డివాడు, అనుభవజ్ఞానము లేనివాడు కుంటివాడు. ఒట్టి శాస్త్రజ్ఞానము, ఒట్టి అనుభవమును రెండును అసంపూర్ణములు, రెండును చేరినపుడు పూర్ణుడు, వాడే శిష్యుని ఉద్ధరించగలడు.
(సా.పు 501)