అంతులేకుండా ఉత్తరములు నాకు చేరుతూనే ఉంటాయి. అన్ని ఉత్తరములను చదివి ఉదయం 10 గంటల సమయములో వాటిని కాల్చి వేయుదును. ప్రతి ఒక్కటి నేనే స్వయముగా చేయుదును. దాని వలన అంతా సక్రముగా జరుగుతుంది. ఎప్పుడూ నిద్రించను. రాత్రి సమయములో దీపములను ఆర్పివేసి ప్రక్క పై విశ్రమించెదను. దీపములు వెలుగుతూనే ఉంటే భక్తులు గుమికూడెదరు. నాకు నిద్రించవలసిన అవసరం లేదు. కాని మానవులకు కనీసము నాలుగు గంటల నిద్ర అవసరము. కొందరనుకోవచ్చును. నేను సాయంకాలము 4 గంటల వరకు నిద్రించెదనని, కాని, నాకు విశ్రాంతే లేదు. నేను ఎన్నటికీ అలసిపోను. ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాను. ముగ్గురు, నలుగురు బంధువులు వస్తేనే గృహస్థులు తలక్రిందులవుతారు. కాని నన్ను దర్శించే వారికి అంతే లేదు. నేను పండితులకు, కళాశాలలకు, లక్షలాది భక్తులకు చెందిన ప్రతి చిన్న విషయాన్ని స్వయముగా చూచుకొనవలసి యున్నది. చాలామంది విషయములో వారు చేయు కార్యము యొక్క బాధ్యత ఇంకొకరిపై ఉంటుంది. కాని ఇక్కడ కార్యములే కాక వాటి ఫలితముల బాధ్యత కూడా నా భుజస్కంధములపైఉన్నది.
సాధువులు, యతులు, ఋషులు యోగులు ఎక్కడ ఉన్నా వారికి సూచనలిస్తూ వారిని సంరక్షించెదను.
అది ఈ విధముగా ఉంటున్నది. నేను స్విచ్ వంటి వాడిని. స్విచ్ వేయగనే అన్నీ వాటంతటవే పనిచేయుటప్రారంభించును. తాళము చెవి త్రిప్పగనే కారు భాగములన్నీ ఏ విధముగ తిరుగుట మొదలిడునో ఆ విధముగనే ఈ విశ్వమంతా క్రమబద్ధము చేయబడును. లీలలుగా భావింపబడునవి లీలలు కావు. అవి దివ్యత్వమును నిరూపింపలేవు. విశ్వములోని ఈ అంతు లేని కార్యాభారాన్ని అతి సులభముగా అనాయాసముగా, ఆనందముగా నేను నిర్వహించుటయే లీల..
ఎటువంటి సంఘటనలోనైనా. ఎల్లవేళలా నేను సంతోషముగానే ఉంటాను.
వరద నీటిపై ప్రయాణించే పడవ, వీటిని పడవలోకి రానీయనపుడు ఆ పడవలోని వ్యక్తి ఎంత ప్రశాంతత ననుభవించునో అట్లే ఎట్టి విచారములు కాని, విషయములు కాని నా బ్రహ్మానంద స్థితిని చెడగొట్టలేవు. కాని సామాన్య మానవులు నావలె ప్రవర్తించరు. వారు నీటిని పడవలోకి అనుమతించెదరు. అంటే అన్ని విచారములకు, విషయములకు స్థానము కల్పించెదరు. దీనివలన ఆనందోత్సాహములకు తావుండదు. మానసిక ప్రశాంతతకు భంగము కలుగును. నా బ్రహ్మానందస్థితి ప్రపంచములో సంబంధము లేకనే ఎల్లప్పుడూ ఒకే విధముగ నుండును. ప్రతి నెలా నేను కొన్ని వందల వేల రూపాయలను ఖర్చును పెట్టుకోవలసి యున్నది. నా భుజస్కంధములపై పాఠశాలల కార్యములు, ఆశ్రమ విషయములు, నాకు భౌతికముగా సన్నిహితముగా నున్నవారి విషయములు, భక్తులకు ప్రసాదించు ప్రత్యేక సంభాషణావకాశములు, ఆరోపణలు, ఉత్తర ప్రత్యుత్తరములు, ఇతర సమస్యలు ఉన్నాయి. ఇది అంతా భౌతిక దేహ స్థాయిలోనిది. అదే సమయములో మానసిక స్థాయిలో నా కొరకు పరితపించే యతులు, యోగులు, ఋషులు, సాధకులు ఎక్కడ ఉన్నా వారికి సూచనలిస్తూ, సంరక్షించుతూ, ప్రతిక్షణమూ వారితో హృదయ సంబంధము పెట్టుకొనెదను. కాని ఇవేవి నన్నుచలింపచేయలేవు. ఒక్కొక్క పర్యాయము నేను కోపముగా అసహనముగా, ఎవరితోననూ కలవకుండా దూరముగా ఉన్నట్లు కనపడినా, నేను నిరంతరము బ్రహ్మానంద స్థితిలోనే ఉంటాను. కోపము ఒట్టి శబ్దము మాత్రమే. అది కొన్ని పరిస్థితులను చక్కదిద్దుటకై అవసరము. అట్లా ఎవరితోనూ కలువకుండా ఉండడము, దూరముగా ఉండడము నేను ఆ సమయ సందర్భములకు తగినట్లుగా వేసే వేషములే. వాస్తవమువకు నా ప్రేమ, బ్రహ్మానంద స్థితివలె నిరంతరమైనది, మార్పు లేనిది.
నేను నా అనంత దేహములతో, అన్ని ప్రదేశములలో కార్యములను నిర్వహించుదును. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర పాదుడు భగవంతుడు. ఈ ఒక్క దేహమే మీతో కూర్చొని మాట్లాడుతున్నది. ఇది. నేను సర్వాంతర్యామినని తెలుపుచున్నది. అవతారము పంచభూతములకు అతీతము. అతడే సృష్టికర్త. అర్జునుడు వశమునందుంచుకొనువాడు, కృష్ణుడు సృష్టికర్త, విజ్ఞాన శాస్త్రము బాహ్యమైనది. ప్రజ్ఞానము అంతర్గతమైనది. మనిషి బహిర్ముఖుడై యంత్రములను సృష్టించును. అంతటితో ఆతని ఆధిపత్యము ముగియును. కొన్ని నెలల క్రితము మరణించిన ఆ ముగ్గురు రోదశీ యాత్రికుల విషయము చూడండి. భగవంతుడు ఎటువంటి పరిమితులకు లోను కాడు. పంచ భూతములను సృష్టించేవాడు. మార్పుచేయువాడు, పరిరక్షించేవాడు, నాశనము చేయువాడు భగవంతుడే. ఆవతార పురుషునకు జన్మలేదు. కాని అవతార పురుషుడు జన్మించినట్లుగా, క్రమేణ సామాన్య రీతిలో పెరిగి పెదైనట్లుగా గోచరించుచున్నది. మనకు కనపడే ఈ దేహములు అశాశ్వతములైనవి.
అవతార పురుషుడు పైన వివరించిట్లుగా దేహమును ఆశ్రయించును. ఇక్కడ తేడా ఏమిటంటే మానవులు వారి భావనల, కర్మల ఫలితముగా దేహములను ధరింతురు. నేను ఈ భావనలేవీ లేకుండా, పూర్ణస్వతంత్రుడనై, వాంఛా రహితుడనై, బంధ రహితుడనై, సదానంత స్వరూపుడనై దేహమును ధరించితిని.
(ప.పు.118/121)