స్వామి బాల్యము

సామాన్య మానవుడు మొదలుకొని దేవతల వరకు ప్రతి ఒక్కరికి ఒక నియమమనేది ఉండాలి. నియమమే లేనప్పుడు ఎంతటి శక్తివంతుడైనా ఎట్టి చిన్న కార్యమునైనా సాధించలేడు. భగవంతుడు సర్వశక్తిమయుడు, సర్వ వ్యాపకుడు, అయినప్పటికీ తాను కూడా నియమానుసారం గానే ప్రవర్తిస్తాడు. తాను మానవాకారం ధరించినప్పుడు  కూడా కొన్నినియమాలను అనుసరిస్తూ తద్ద్వారా జగత్కల్యాణమునకుపాటుపడుతాడు.రామకృష్ణాది అవతారములు కొన్ని నియమములను నియమించు కొనియే తమ కర్తవ్యకర్మలను ఆచరిస్తూ వచ్చారు.రాముడు ఒకే మాట, ఒకే బాణము, ఒకే పత్ని అనే మూడు నియమాలను నియమించుకొని, ఎట్టి పరిస్థితు లందూ వాటిని జవదాట లేదు. కృష్ణుడు కూడా అంతే, "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే"యోగ క్షేమం వహామ్యహం", "మోక్షయిష్యామి మా శుచః" అని మూడు ప్రతిజ్ఞలు చేశాడు. నేను కూడా కొన్ని నియమాల నమసరిస్తాను. నేను ఇచ్చిన మాట తప్పను. ఇది నామొట్టమొదటి ప్రమాణము. నామాటను తీసుకున్న వ్యక్తి నాకువిర్ధుంగా ప్రవర్తించినా నేను అతనిని ఏమాత్రము శిక్షించను; అతను నా ఆజ్ఞకు విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికి నేను అతనిని ఏమాత్రము దూరం చేయను. "ఏ జనాః పర్యుపాసతే", ఏ జనుడైనా ఫరవాలేదు. ఇది నా ప్రేమతత్త్వము. నేను ఎవ్వరిని ఇంతవరకు ద్వేషించ లేదు. ద్వేషమంటే ఏమిటో నాకు తెలియదు. ఎట్టి పరిస్థితి యందైనా ఒకరు కష్టములను అనుభవించాలని నేను సంకల్పించను. అయితే, ఎవరు చేసినది వారు అనుభవించక తప్పదు.

 

ఎవరు చేసిన కర్మ వారమభవించక

ఏరికైనను తప్పదన్నా!

ఏనాడు ఏతీరు ఎవరు చెప్పాగలరు?

అనుభవించుట సిద్ధమన్నా!

 

ప్రేమతత్త్వంలోనున్న మాధుర్యము. ప్రేమయొక్క శక్తిసామర్థ్యములు ప్రేమకు తప్ప అన్యులకు అర్థం కావు. నాకు ఈ జగత్తునందు ఎందు చూసినా ద్వేషులనే వారే కన్పించడం లేదు. అందరూ నాకు ప్రియులే. అందరూ నా ఫ్రెండ్సే (స్నేహితులే); నేను అందరికీ ఫ్రెండ్నే! నేమఫ్రెండ్ని కాదనుకున్నవారికి కూడా నేను ఫ్రెండ్ నే!

వేదము "బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి" అన్నది మీరు ఎట్టి చింతన చేస్తారో ఆట్టి స్వరూపాన్నే పొందుతారు. పూర్వం డార్విన్ అనే గొప్ప శాస్త్రజ్ఞుడుండేవాడు. అతడు గొప్ప గుణవంతుడు, విశాలహృదయుడు. అతనికి హెన్ స్లో అనే ఒక శిష్యుడుండేవాడు. ఆ శిష్యుడు సర్వకాల సర్వావస్థలయందు డార్విన్‌ను స్మరిస్తూ ఆయన బోధలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించేవాడు. తల్ఫలితంగా కొంతకాలానికి అతడు డార్విన్ రూపాన్ని పొందాడు. ఒక పర్యాయం కొంతమంది మిత్రులు ఆ గురుశిష్యులిద్దరినీ ఒకే ప్రదేశంలో చూసినప్పుడు వారిలో ఎవరు డార్వినో, ఎవరు హెన్ స్లో నిర్ణయించుకోలేకపోయారు. విదేశీయుల చరిత్రల వరకు మనం పోనక్కరలేదు. భాగవతాన్నే ఉదాహరణంగా తీసుకుందాం. ప్రహ్లాదుడు రాక్షస కుమారుడు. కాని, అతడు నిరంతరము హరి నామమును స్మరించడంచేత అతని ముఖంలో హరితేజస్సు ఉట్టి పడింది. దారులు కొట్టే దొంగ రత్యకారుడు. అతడు సప్త ఋషుల ప్రబోధచేత ప్రభావితుడై నిరంతరము రామ నామాన్ని స్మరించడం చేత అతని ముఖం రాముని తేజస్సుతో ప్రకాశించింది. రాముడు లోకదా త అయితే వాల్మీకి రామాయణాన్ని రచించి శ్లోకదాత అయినాడు. కనుక, భక్తిప్రపత్తులందున్న మహత్తర శక్తి ఇట్టిది, అట్టిది అని ఎవరూ ఊహించలేరు.

 

క్రోధము, ద్వేషము, అసూయ అనేవి రాక్షస గుణములు. కనుక, వాటిని నిర్మూలించుకొని మానవతా విలువలను అభివృద్ధి పర్చుకోవాలి. వేదము "సత్యం వద, ధర్మం చర"అన్నది. చిన్నప్పుడు అనేకమంది పిల్లలు నా దగ్గర చేరి ఆడుతూ, పాడుతూ, ఆనందంగా ఉండేవారు. ఆ సమయంలో నేను వారికి అనేక విషయాలు బోధించేవాడిని. "మిమ్మల్ని నవమాసములు మోసి, కని పెంచి పెద్ద చేస్తుంది తల్లి; అనేక కష్టనష్టములకు ఓర్చుకొని మిమ్మల్ని పోషిస్తాడు తండ్రి. కాబట్టి, మొట్టమొదట మీ తల్లి దండ్రులను ప్రేమించండి. మీ నిత్యజీవితంలో ఎలాంటి పరిస్తితులందైనా సత్యాన్ని వదలవద్దు. మీ తల్లితండ్రులు కొడతారనే భయంతో మీరు చేసిన తప్పును కప్పిపుచ్చు కోవడానికి ఆసత్యం చెప్పవద్దు. మీ తల్లిదండ్రులు కొట్టినా, తిట్టినా ఫరవాలేదు. మీరు మాత్రం సత్యమే పలకండి. సత్యమునకున్న శక్తి ఆటంబాంబు, హైడ్రోజన్ బాంబులకు కూడా లేదు.సత్యమును మించిన అస్త్రము మరొకటి లేదు. అదే మిమ్మల్ని కాపాడుతుంది. అయితే, సత్యమును ఎట్లా పలకాలి? "అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చయత్", మీరు పలికే సత్యము ఉద్వేగకరంగా ఉండకూడదు: సత్యము చెప్పాలనుకుంటే ఇదే సత్యము అంటే గట్టిగా చెప్పనక్కర్లేదు. సత్యాన్ని కూడా శాంతంగా పలకాలి; ప్రియంగా, హితంగా చెప్పాలి. క్రోధము, ద్వేషము, ఆసూయ మున్నగు దుర్గుణాలు త్యజించాలి" అని బోధించేవాడిని. సాధారణంగా చిన్న పిల్లలకు ఏదైనా ఇష్టమైన వస్తువు కనిపిస్తే పెన్ను అవసరమైతే తోటి విద్యార్థిని అడిగి తీసుకోండి. అంతేగాని అతనికి తెలియకుండా తీసుకోకూడదు" అని బోధించేవాడిని. ఆ రోజుల్లో ఈ గ్రామంలో మహమ్మదీయులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. వారు పీర్ల పండుగ జరుపుకునేవారు. ఆ పండుగలో కొందరు హిందువులు కూడా పాల్గొని పూజలు చేసేవారు. "మతము ప్రధానం కాదు, నీతియే ప్రధానం.నీతియే ప్రాణసమానం.కాబట్టి మతభేదాలను దూరం పెట్టి అందరితో స్నేహంగా ఉండండి. మీరు కూడా పీర్ల పండుగలో పాల్గొనండి" అని పిల్లలకు చెప్పేవాడిని. ఒక పిల్లవాడు "రాజూ! మేము బ్రహ్మణులం. దీనికి మా అమ్మ నాన్న అంగీకరించరు" అన్నాడు.

 

"నాయనా! నీవు మానవుడవు. నీది మానవ కులము, నీదిప్రేమమతము. దీనిని లక్ష్యమునందుంచుకో" అని చెప్పాను. నేను ఈ విధంగా కుల మత భేదాలను త్యజించమని పిల్లలకు బోధిస్తున్నానని తెలుసుకొని వారి తల్లి దండ్రులు "ఏమి రాజూ, కులమత భేదాలుండ కూడదని చెప్పి నీవు మా పిల్లలను చెడగొట్టుకున్నావే" అని జగడానికి వచ్చేవారు. ఈ లోకంలో ప్రేమమతమును మించిన మతం లేదని నేను వారితో గట్టిగా వాదించేవాడిని. దేనికీ నేను భయపడలేదు. సత్యానికి భయమెందుకు?! సత్యంతో దేనినైనా సాధించవచ్చు.

 

ఒకనాడు పిల్లలందరూ సమావేశమై "రాజు మనకు ఎన్నో మంచి విషయాలు బోధిస్తున్నాడు. కానీ, అందులో ఒక్కటైనా మనం ఆచరణలో పెడుతున్నామా?" అని చర్చించుకున్నారు. ఎవరెంత ఆచరణలో పెడుతున్నారని ఒకరి నొకరు ప్రశ్నించుకున్నారు. వారిలో ఒకడు “ఎలాంటి పరిస్థితుల్లో నైనా నేను సత్యమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను" అన్నాడు. మరొకడు “ఎలాంటి పరిస్థితులందైనా నేను దైనాన్ని ప్రేమిస్తాను. దైవమే నాతల్లి, దైవమే నా తండ్రి, దైనమే నా ప్రాణం" అన్నాడు. వాడి పేరు కేశన్న. వాడు బుగ్గపల్లి అచ్చమ్మ కుమారుడు. ఆమె ఒక చిన్న కొట్టు పెట్టుకుని బీడీలు, సిగరెట్లు అమ్ముకునేది. పాపం! మరొక పిల్లవాడు “రాజు బోధించే మంచి విషయాలన్ని పాటించడానికి నాకు సాధ్యం కాదుగాని, రాజు చెపుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. రాజు మాటలు వివడమే పెద్ద ఆనందము" అన్నాడు. "రాజు అంత మధురంగా, అంత ప్రేమతో బోధిస్తుంటే వినకుండా ఎలా ఉండగలము! రాజు అంటే నాకు ఎంతో ప్రేమ" అన్నాడు మరొకడు. "నీతో మాత్రమే రాజు అంటే ప్రేమనే? మాకు లేదా?" అన్నారు. మిగిలిన పిల్లలు.

 

ఒకనాడు అందరం కలసి కరణం సుబ్బమ్మ ఇంటికి వెళ్ళాము. ఆమె మహా సాధ్వీమణి, విశాల హృదయం కల్గినది. "రాజూ! నీవు పిల్లలను తీసుకు వచ్చావుగాని, నే నీ నాడు ఏమీ చేసి పెట్టలేదే! రేపటి దినము ఈపిల్లలందరిని తప్పక తీసుకొసినిరా, నేను వంట వండి పెడతాను" అంది. నాకిష్టమని ఆనాడు పితుకు బేడల పులుసు చేసింది. అందరం కూర్చున్నాం. నేను ముందుగానే పిల్లలతో "వారు బ్రాహ్మణులు అంత త్వరగా వారు కులమత భేదాలను విసర్జించడం కష్టం. కాబట్టి, సాధ్యమైనంతవరకు దూరంగానే కూర్చోండి" అని చెప్పాను. ఆమె ఒక పాత్రలో అన్నము, పులుసు రెండూ కలిపి తెచ్చింది. అందరి చేతుల్లో ముద్దమాదిరి చేసి వేస్తుంటే, వారందరూ చక్కగా భుజించారు. రాజు తనకు పెడితే తృప్తి పడదు, పిల్లలకు పెడితేనే తృప్తి పడతాడు. అనే సత్యాన్ని ఆమె గుర్తించింది. కనుకనే, మొట్టమొదట పిల్లలందరికీ పెట్టింది. చిట్టచివరికి చాల కొద్ది అన్నము మాత్రమే మిగిలింది. "అయ్యో, రాజుకు నేను పెట్టలేక పోతున్నానే!" అని బాధ పడి ఆ మిగిలిన కొద్దిపాటి అన్నమును నా నోట్లో పెట్టింది. "మా అందరికీ చేతిలో వేసి రాజుకు మాత్రమే ఎందుకు నోట్లో పెట్టింది?" అని పిల్లలు తమలో తాము గుసగుస లాడుకోవడంప్రారంభించారు. నేను "సుబ్బమ్మా! మీరు చేసిన పనివల్ల పిల్లల్లో ఆశాంతి ప్రారంభమైంది. చూడండి " అన్నాను. అప్పుడు సుబ్బమ్మ పిల్లలతో "నాకు మీ పైన ప్రేమ లేక కాదు. కాని, రాజుకు ముందు మీరు తింటేనే తృప్తి, మీ పైన రాజుకున్న ప్రేమ అలాంటిది. అందుచేత,  ముందు మీకే పెట్టాను. చివరికి నా దగ్గర చాల కొద్ది అన్నం మాత్రమే మిగిలింది. దానిని ముద్ద చేసి చేతిలో వేయడానికి వీలుకాలేదు. అందుచేతనే, దానిని రాజు నోట్లో పెట్టాను. పదిమందిని సంతృప్తి పరచి తాను సంతృప్తి పడే స్వభావం రాజుది. అతనిలో స్వార్థం ఏమాత్రం కనిపించదు. మీరు కూడా రాజు మాదిరి తయారు కావాలి. స్వార్థ, స్వప్రయోజనా పేక్షను వీడి, ప్రేమను పెంచుకొని, తోటి మానవుని ఆనందమే మీ ఆనందంగా భావించుకున్నప్పుడు మీకు ఎంతైనా శ్రేయస్సు కల్గుతుంది. మీ భవిష్యత్తు ఆదర్శవంతమైనదిగా రూపొందుతుంది" అని వారికి చక్కగా బోధించి, "రాజూ! నేను సాయంత్రంచిత్రాన్నం వండుకుంటాను. ఆ చెట్టు ఎక్కి ఇంత కరివేపాకు కోసుకురా", అని నన్ను యుక్తిగా అక్కడి నుండి పంపించేది. నేను వయస్సులో అక్కడున్న పిల్లలకంటే పెద్దవాడినేగాని ఎత్తులో చాల తక్కువే. కాని, నేను చెట్లు బాగా ఎక్కేవాడిని. సుబ్బమ్మ కోరినట్లుగా చెట్టు ఎక్కి కరివేపాకు కోశాను. అయితే, సుబ్బమ్మ నన్ను కరివేపాకు కోయడానికి పంపించింది. ఎందుకోసమో తెలుసునా? పిల్లలకు నా గురించి చెప్పడానికి "పిల్లల్లారా! రాజు యొక్క స్నేహాన్ని పొందిన మీరెంత అదృష్టవంతులో! రాజు సామాన్యుడు కాదు. ఆతను రాజాధిరాజు, రాజులకే రాజుగా తయారౌతాడు. మీరు అతని ఆజ్ఞను శిరసావహించండి;ఏ విషయంలోను అతని మాటను జవదాటకండి. అతనిపై ఎప్పుడూ కోపగించుకోకండి. మీరు అతనిపై కోపగించుకుంటే, దేవతలందరూ మీపై కోపగించుకుంటారు. అతనిని ఆనందపర్చి, మీరుఆనందించండి. రాజు తనకు అసంతృప్తి కలిగితే చెప్పడు. కాని, దాని ఫలితం మాత్రం మీకు తప్పదు. కాబట్టి, రా జు కు అసంతృప్తి కల్గకుండా చూసుకోండి" అని సుబ్బమ్మ పిల్లలకు బోధించసాగింది. సుబ్బమ్మ భర్తకు కమలమ్మ అని మరొక భార్య కూడా ఉండేది. ఆమె వచ్చి “ఏమిటి ఆక్కా, ఈ చిన్న చిన్న పిల్లలకు నీవు బోధించే వేదాంతం ఎలా అర్థమౌతుంది?" అన్నది. సుబ్బమ్మ "ఇది వేదాంతం కాదే చెల్లెలా, నిత్య జీవితంలో పిల్లలు ఆచరించవలసినవి బోధిస్తున్నాను. నాకు పిల్లలు లేరు కాబట్టి ఈ పిల్లలే నా పిల్లలు. ఈ పిల్లలు రాజు వెంట ఉండే పిల్లలు. రాజు అంటే నాకు ప్రాణం" అన్నది.

 

ఒకనాడు ఆమె ఇంట్లో వడలు చేసింది. అవి పిల్లలందరికీ సరిపోవు. అందుచేత నన్ను మాత్రమే ప్రత్యేకంగా పిల్చి ఇవ్వాలని మిద్దె ఎక్కింది. ఆమెది పెద్ద ఇల్లు. ఆ ఇంటి ప్రక్కనే ఈ దేహానికి సంబంధించిన ఇల్లు ఉండేది. కిటికీలో నుండి చూస్తూ "రాజూ, రాజూ, ఒక్కసారి ఇలా రా" అంది నేను పరుగెత్తి వెళ్ళాను. ఆ కిటికీలో నుండి చిన్న పొట్లాన్ని నాకు అందించింది. అప్పుడు నేను "సుబ్బమ్మా! పిల్లలకు ఇవ్వకుండా నాకు మాత్రమే ఇవ్వడం న్యాయం కాదు. మీరు హృదయాన్ని విశాలం చేసుకోవాలి" అన్నాను. “ఈ నాటికి మాత్రం క్షమించు రాజు, రేపటి నుండి అందరికీ సమానంగా పెడతాను" అంది. ఆమె ఇచ్చిన వడలను సాయంత్రం పిల్లందరికీ కొంచెం కొంచెం పెట్టాను. నా ప్రేమతత్త్వమును నా సమత్వమును, నా దివ్యత్వమును మీరు వేయింట ఒక భాగమైనా అర్థం చేసుకోలేరు. నా ప్రేమ చాల విశాలమైనది. దాని గురించి ఎంత వర్ణించినా ఇంకా తక్కువే అవుతుంది. కాని, చాలమంది. నా ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. "లోకా స్స మస్తా స్సుఖినోభవంతు", అందరూ సుఖంగా ఉండాలి; ఎవ్వరూ కష్టాలకు గురి కాకూడదు అనేదే నా సంకల్పము.

 

మీకు తెలుసు - బుక్కపట్నం నుండి గుండా సత్యనారాయణ అనే వ్యక్తి ఇక్కడికి వస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఆతను కూడా నా క్లాసుమేటే! చూడండి ఎట్లా అయి పోయినాడో!

 

(అని పలుకుతూ శ్రీవారు శ్రీ సత్యనారాయణను వేదిక పైకి రావలసిందిగా సౌంజ్ఞ చేశారు. కలలోనైనా ఊహించనిఈ మహాభాగ్యానికి ఆయన ఆనందంతో పొంగిపోతూ వేదికపైకి వెళ్ళి శ్రీవారికి ప్రణమిల్లారు. శ్రీవారి అనుమతిలో, బాల్యం నుండి శ్రీవారు తనపై ఏ విధంగా ప్రేమ వాత్సల్యములను కురిపిస్తున్నదీ వివరిస్తూ ఆయన కొద్దిసేపుప్రసంగించారు. అనంతరం శ్రీవారి దివ్యోపన్యాసం ఈ విధంగా కొనసాగింది)

 

నేను, కొంతమంది పిల్లలు చేరి బుక్కపట్నం స్కూలుకు వెళ్ళేవారం. అప్పుడు 5వ క్లాసు చదువుతున్నాము. ఆ సమయంలో ఈ కుటుంబం చాలా బీదది. గ్రామంలో ఉన్న పిల్లలు కూడా చాల బీదపిల్లలే. గృహం అమ్మాయి ఇంత సంకటి చేసేది. సంకటి మధ్యలో గుంత మాదిరి చేసి దానిలో శనక్కాయ పచ్చడి వేసేది. ఆ రోజుల్లో టిఫిన్ క్యారియర్లు లేవు. ఆ సంకటని పాత గుడ్డలో మూటకట్టి వీపు పైన వేసుకొని బుక్కపట్నం వేళ్ళేవాడిని. స్కూల్లో 12 గంటలకు భోజనానికి బెల్ కొట్టేవారు. వెంటనే మేము పరుగెత్తుకొని చెఱువుకు పోయేవారం. సంకటి మూటను వెంటనే విప్పడానికి వీల్లేదు. ఎందుకంటే, సంకటి బట్టకంతా అంటుకొని ఉంటుంది. ఆ మూటను కొద్దిసేపు నీటిలో పెట్టిన తరువాతనే ఆ గుడ్డ సంకటిని వీడిపోతుంది. ఆ పిల్లల్లో ఒక శ్రీమంతుని బిడ్డ ఉండేవాడు. ఆ పిల్లవాడు మంచి తెలివి గలవాడు. వాడు అన్నం, పులుసు కలుపుకొని తెచ్చేవాడు. దానిని పిల్లలకు తలొక ముద్ద పెట్టేవాడు. నేను కూడా అందరికీ సంకటి పెట్టేవాడిని. ఈ విధంగా, మేము ఆహార విహారాల్లో కూడా ఐకమత్యాన్ని అనుభవిస్తూ వచ్చాము. ఐకమత్యంలో ఎంతో ఆనందమున్నది. కాని, ఈనాటి విద్యావంతులలో ఐకమత్యం. ప్రేమతత్త్వం క్షీణించిపోయాయి: అసూయ, ద్వేషాలు పెరిగిపోతున్నాయి. ఆరవ తరగతి పూర్తి కావచ్చింది. అప్పుడే ESLC అని పబ్లిక్ ఎక్జామినేషన్ వచ్చింది. ఆ పరీక్షను పెనుకొండలో పెట్టారు. "అయ్యో, పరీక్షకు ఎన్నో మైళ్ళ దూరం వెళ్ళాలట" అని పిల్లలందరూ భయపడ్డారు. అప్పుడు బస్సులు లేవు. మేమందరం కలసి ఒక ఎడ్ల బండి తీసుకున్నాము. ఆ ఎడ్లబండిలో సామాను పెట్టుకుని మేము నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు గృహం అమ్మాయి "మీరక్కడ మూడు దినములుండవలసి వస్తుంది. వంట వండుకోవడం మీకు కష్టమౌతుంది" అని చెప్పి అందరికీ సజ్జరొట్టెలు చేసి, అందులో ఇంత కారం వేసి మూట కట్టి ఇచ్చింది. వెంకమ్మ కూడా తగిన సహాయం చేసింది. "అమ్మా! మన సత్యం సంగతి నీకు తెలుసు కదా! పిల్లలకు పెట్టకుండా తాను భుజించడు. కాబట్టి పిల్లలకు కొంచెం అధికంగా పంపిద్దాం" అని చెప్పింది గృహం అమ్మాయి. అలాగే ఆమె చేసి పంపించేది పాపం! సామాన్లన్నీ బండిలో పెట్టుకొని పెనుకొండ వెళ్లినాము. అక్కడకు వెళ్ళిన తరువాత ఒక తమాషా జరిగింది. అక్కడ దిగడానికి ఇల్లు లేదు. కాబట్టి, ఆ మూడు దినములు చెట్ల క్రిందనే గడిపాము. వర్షం వచ్చినప్పుడు బండిలోపల తల దాచుకునేవారం.

 

క్లాసులో ముగ్గురు పిల్లలం ఒకే డెస్కు పైన కూర్చునేవాళ్ళం. నేను మధ్యలో కూర్చునేవాడిని; నాకిరుప్రక్కల రమేశ్, సురేశ్ కూర్చునేవారు. వారిరువురూ చదువులో చాల మొద్దులు. నూటికి ఒక్క మార్కు తెచ్చుకోవడం కూడా వారికి కష్టమే! క్లాసులో నేను వారికి సహాయం చేస్తూ వచ్చాను. కాని ESLC పరీక్ష కోసం పెనుకొండకు వెళ్ళినప్పుడు వారు చాల భయపడిపోయారు. "రాజు! నీవే మాకు దిక్కు" అన్నారు. "భయపడితే ప్రయోజన మేమిటి? ధైర్యంగా ఉండాలి" అని చెప్పాను. చిన్నప్పటి మంది పిల్లలకు ధైర్యం బోధించేవాడిని.

 

పరీక్షా హాలులో పేపర్లు వారే ఇచ్చేవారు. మేము ఏదీ తీసుకు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడికి వెళ్ళిన తరువాత టీచర్లు పిల్లల జేబులు, చేతులు పరీక్షగా చూశారు. వారు జేబుల్లో ఏమైనా దాచుకున్నారేమోనని టీచర్లకు అనుమానం. ఇంతలో ఒక టీచరు వచ్చి ఇంకొకటీచరు తో “కొండప్పా ! ఈ పిల్లలు ఎవరనుకున్నావు? వీరు రాజు గుంపుకు చెందినవారు. వీరు దొంగతనం చేయరు, కాపీ కొట్టరు; సత్యమార్గాన్ని అనుసరిస్తారు అని చెప్పాడు. అతను కూడా "నాకు తెలుసు. ఆ పిల్లవాని ముఖంలోని తేజస్సును చూస్తేనే తెలుస్తోంది" అన్నాడు. లోపలికి వెళ్ళాము.

 

అది మొట్టమొదటి పరీక్ష. మా ముగ్గురి నెంబర్ల మధ్య చాల వ్యత్యాసం ఉండటంచేత, మేము ముగ్గురం ఒకరి కొకరు చాల దూరంగా కూర్చోవలసి వచ్చింది. దాంతో రమేశ్, సురేశ్ చాల భయపడి పోయారు. అప్పుడు నేను "మీ ఆన్సర్ పేపర్లు కూడా నేనే వ్రాసి అక్కడ పెడతాను. మీరేమీ భయపడకండి. నేను చెప్పినట్లు చేయండి. ఈ నాటకం నేనాడతాను", అని చెప్పాను. నటన సూత్రధారిని నేను. ఇంత లోకాన్నే ఆడించేవాడివి. ఈ ముగ్గురి ఆట ఆడలేనా! మొట్టమొదట ఇచ్చిన పేపరు మీద చక్కని ఆన్సర్లు స్పీడుగా వ్రాశాను. దాని పైన నా నెంబరు, పేరువ్రాసి మడత వేసి ప్రక్కన పెట్టుకున్నాను. మరొక పేపరు తీసుకొని రమేశ్ హేండ్ రైటింగుతో చక్కని జవాబులు వ్రాసి, దానిపై అతని పేరు, నెంబరు వ్రాశాను. అదేరీతిగా,ఇంకొక పేపరుపై సురేశ్ హేండ్ రైటింగులో చక్కని జవాబులు వ్రాశాను. ఆ మూడు పేపర్లను నాదగ్గరే పెట్టుకున్నాను. ఇంతలో బెల్లు కొట్టారు. "టైమ్ అయి పోయింది. పేపర్లు ఇచ్చేయండి" అంటూ టీచర్లు తొందర పెట్టారు. పిల్లలు అటూ, ఇటూ చూస్తున్నారు. రమేశ్ని, సురేశ్ ని బయటికి పొమ్మని చెప్పాను. వారు బయటికి పోయారు. నేను ఈ మూడు పేపర్లు అక్కడ పెట్టాను. వారం రోజుల తరువాత పరీక్షా ఫలితాలు వచ్చాయి. మా ముగురికీ ఫస్ట్ క్లాస్ వచ్చింది. నూటికి నూరు మార్కులు వచ్చా యి. హెడ్ మాస్టర్ కేశవరావు Very Very Very Good అని వ్రాశాడు. రమేశ్, సురేన్లు "రాజు! నీ మూలంగానే మాకు ఫస్ట్ క్లాసు వచ్చింది. అని కృతజ్ఞతలు తెల్పుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో పెద్ద ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో తల్లిదండ్రులు, క్లాసుపిల్లలు, ఇంకా అనేకమంది మాకు పూలమాలలు వేశారు? తప్పెట్లతో, ఇతర వాయిద్యాలతో సత్యమ్మ గుడి వరకు మమ్మల్ని ఊరేగించారు.

 

నేను స్కూల్లో చదువుతున్నప్పుడు పిల్లలకు అనేక పాటలు వ్రాసి ఇచ్చేవాడిని. "రాజు! నీకు ఎలా వచ్చింది. ఈ కవిత్వం!" అని వారు ఎంతో ఆశ్యర్యపోయేవారు. ఆ పాటలను పాడుకొని ఎంతో ఆనందించేవారు. బుక్కపట్నం స్కూల్లో ప్రార్థనా గీతాన్ని నేనే ప్రారంభించాను. హెడ్ మాష్టరు ప్రార్థనకు సంబంధించిన పాటలు కూడా వచ్చే వ్రాసి పెట్టమన్నాడు. అప్పుడు నొక పాట వ్రాశాను.

 

అహరహతవ ఆహ్వాన ప్రచారిత

సునిశిత ఉదారవాణి

హిందు బౌద్ధ సిక జైన పారశీక

ముసల్మాన కిరస్తానీ......

 

ఈ విధంగా అన్ని మతములూ ఏకమైపోవాలని నేను ఆనాడే బోధించాను. గ్రామస్తులందరూ నన్ను వేదాంతి అని పిలిచేవారు. ఈ గ్రామంలో సుబ్బారాయుడు అనే 70 సంవత్సరాల వ్యక్తి ఉండేవాడు. అతడు సత్యమ్మ గుడి దగ్గరకు వచ్చి కాళ్ళు కడుక్కొని అరుగుపైకూర్చునేవాడు. ఒకనాడు నేను అక్కడి నుండి వస్తుంటే "రాజు, రాజు, ఇటు రా" అని పిలిచాడు. నేను దగ్గరకి వెళ్ళి ఏం కావాలని అడిగితే "రాజూ! నేను లావుగా ఉన్నాను. నా తొడకూడా పెద్దదిగానే ఉన్నది. కొద్ది సేపు నీవు నా తొడపై కూర్చో" అన్నాడు. "నేను మీ తొడపై కూర్చొవడం వలన మీకు వచ్చే ఫలితం ఏమిటి? అని ఆడిగాను. "ఆ ఫలితాన్ని నేను మాటలలో వర్ణించలేను. అది అనంతమైన, అద్భుతమైన ఫలితం" అన్నాడు. అంతేగాదు “రాజూ! నీవు పుట్టపర్తికి ఒక పెద్ద జ్యోతివంటి వాడివి. నీపేరు, నీ ప్రభావము ప్రపంచమంతా వ్యాపించి పోతాయి" అన్నాడు. ఆనాడు ఆయన చెప్పిన మాట ఈనాడు అక్షరాలా సత్యమైంది. రాజు పేరు ప్రతిష్ఠలు, పుట్టపర్తి పేరు ప్రతిష్ఠలు కేవలం భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచమంతటా వ్యాపించుపోయాయి. ఆనాడు - పుట్టపర్తికి కాలి నడకన చేరడానికి కూడా కష్టమయ్యేది.

 

ఆలాంటి కుగ్రామమైన పుట్టపర్తి ఈనాడు ప్రపంచ మ్యాపులో ప్రధానమైన స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇంత గొప్ప పేరు వస్తుందని సుబ్బారాయుడు ఆనాడే చెప్పాడు. ఆయనకు పిల్లలు లేరు పాపం! గట్టిగా నన్ను కౌగిలించు కున్నాడు. "రాజూ! ఈ ప్రాప్తిని పొందిన నేనెంత ఆదృష్టవంతుడనో " అని ఆనందించాడు. అయితే, "నాకు మీ నాన్నకు మధ్య మాటలు లేవు. నేను నీతో మాట్లాడటం కూడా మీ నాన్నకు ఇష్టం ఉండదు. కాబట్టి, ఈ సంగతి ఆయనకు చెప్పవద్దు" అన్నాడు. "తప్పేమీ లేదు, నేను యథార్థం చెపుతాను. ఆయన చాల మంచివాడు " అన్నాను. నేను ఇంటికి పోయిన తరువాత గృహం అబ్బాయి "ఆ సుబ్బారాయుడితో ఎందుకు మాట్లాడతావు నీవు?" అన్నాడు. "ఎందుకు అతనితో మాట్లాడకూడదు"? అని నేను ప్రశ్నించాను. “నాకు వాడు విరోధి" అన్నాడాయన. "మీకు విరోధి కావచ్చు గాని, నాకు విరోధి కాడు. కాబట్టి, నేను అతనితో మాట్లాడాను. తప్పులేదు" అని చెప్పి నేను రెండు చేతులు జోడించి "చూడండి పెద్దలైన మీరు ఎవ్వరిని ద్వేషించకూడదు. ద్వేషాన్ని దూరం చేసుకొనిఐకమత్యంచేత గ్రామాన్ని అభివృద్ధి పరచండి" అన్నాను. "ఆ సుబ్బారాయుడు ఏమిటి నీతో మాట్లాడుతున్నది?" అని అడిగాడు. "నా ప్రభావం చేత ఈ పుట్టపర్తి గ్రామం ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన జ్యోతిగా వెలుగొందు తుందని అన్నాడు" అని జవాబిచ్చాను. ఆయనకు కోపం వచ్చేసింది. "ఏమిట్రా నీ ప్రభావము? ఆ సుబ్బారాయుడు ఏమిటో గొప్పగా వర్ణిస్తున్నాడు" అన్నాడు. నేను అక్కడి నుండి వెళ్ళి రెండు చేతులలో పూలు తెచ్చాను "నేను ఎవరివో తెలుసు నా?

 

నేను సాయిని తెలియుము నిక్కముగము

మమత బాయుము యత్నముల్ మానుకొనుము

బాసె మీకు నాతోడి సంబంధమింక

కాదు నన్ప్ట్ట మరియెట్టి ఘనునికైన

 

అని పలికి ఆ పువ్వులను క్రిందికి విసిరాను. అవి "శ్రీ సత్యసాయిబాబా" అనే అక్షరాలుగా ఏర్పడ్డాయి. అప్పటి నుండి గృహం అబ్బాయి నా విషయంలో చాల జాగ్రత్తగా ఉన్నాడు. ఆ విధంగా నేను చిన్నప్పటి నుండి పిల్లలకే కాదు, పెద్దలకు కూడా హితబోధలు చేస్తూ వచ్చాను. సత్యనారాయణ కూడా చాల గొప్పవాడు. ఒక రోజున నా చొక్కా చినిగిపోయింది. అతడు చూశాడు. ఆ రోజుల్లో ఒకటిన్నర అణాకు చొక్కానిక్కరు రెండూ వచ్చేవి. అతడు రెండింటిని మడత పెట్టి నా దగ్గరికి తెచ్చి "రాజు ! నీవు ఏమీ అనుకోకూడదు. నేను ఎంతో ప్రేమతో తెచ్చాను. వీటిని నీవు కుట్టించుకోవాలి" అన్నాడు. "నీకు నాకు శాశ్వత మైన సంబంధ బాంధవ్యము ఉండాలనుకుంటే వీటిని నాకివ్యకూడదు. నేను వీటిని ముట్టను" అన్నాను. ఇంతవరకు నేను ఇతరులవద్ద నయా పైసా ముట్టలేదు. ఏదీ నాకు అవసరం లేదు. నాకు అవసరమైనది దానంతటదే నాదగ్గరకు వస్తుంది. కనుక, నేను ఎవరివద్ద చేయి జాచలేదు. బాల్యము నుండి నేటి వరకు, ఇంకేనాటివరకైనా నాచేయి ఇచ్చేదే కాని పుచ్చుకునేది కాదు. నాకు ఇచ్చుకోవడమే ఆనందంగాని, పుచ్చుకోవడం కాదు. కొంతమంది అసూయాపరులు తమకు ఇవ్వలేదని నన్నుదూషించవచ్చు. గట్టిగా దూషిస్తే గాలిలో కలిసిపోతుంది. వారిలో వారు తిట్టుకుంటే అది వారికే చేరిపోతుంది. అది నావరకు రావడానికి అవకాశమే లేదు. నేను ఎవ్వరిని ద్వేషించలేదు, దూషించలేదు, పరిహసించలేదు. నన్ను పరిహసించినవారిని కూడా నేను ఆనందంగా పలకరించే వాడిని.

 

ఒకనాడు సుబ్బమ్మ వచ్చి తమాషాకు "రాజూ! నీవు  ఇంతమందికి ఇన్ని సద్బోధలు చేస్తున్నావు. మా ఆయన కొంచెం చెడుమార్గంలో పోతున్నాడు. ఆయనను సరిదిద్దవచ్చు కదా!" అంది. "నీవు ఏమీ అనుకోకపోతే తప్పక చేస్తాను" అని చెప్పాను. ఆయన ప్రతి రోజు సాయంకాలం బృందావనం దగ్గర కూర్చునేవాడు. నేను ఒక పాట వ్రాసి, దానికి చక్కని రాగం కూర్చి పిల్లలకు నేర్పించి కరణం ముందర పాడుకుంటూ వెళ్ళమనిచెప్పాను.

 

వింటకత్తెల చెరకు పోకు

ఖండితముగ నీవు కడు నీచుడౌతావు

కులమువారలు నిన్ను కుండ ముట్టనివ్వరు

బంధువులు నిను చూస్తే బయటెళ్ళగొడతారు

స్నేహితులు విను చూస్తే చెప్పుతో కొడతారు.

 

ఈ విధంగా, పిల్లలు పాడుకుంటూ వెళుతుంటే కరణానికి కోపం వచ్చింది. తక్షణమే లోపలికి వెళ్ళిపోయాడు. తరువాత మనిషిని పంపించి పిల్లలను పలిపించాడు. "మీకీ పాట ఎవరు రాసిచ్చారు?" అని అడిగాడు. పిల్లలు భయపడుతూ "రాజు రాసిచ్చాడు" అని చెప్పారు. ఈ పనికి సూత్రధారిని నేనేనవి. నేను తప్ప ఈ పని ఇంకెవ్వరూ చేయలేరని ఆయనకు కూడా తెలుసు. మరునాడు నన్ను పిలిచి మంచి మామిడి పళ్ళు ఇచ్చి "రాజు! దయచేసి పిల్లలకు ఇలాంటి పాటలు నేర్పించకు" అన్నాడు. "కరణంగారూ! పెద్దవారైన మీరు కూడా అలాంటి పనులు చేయకూడదు" అన్నాను. ఆయన ఇకమీదట చేయనని నాకు మాటిచ్చాడు. నేను కూడా ఇలాంటి పాటలు వ్రాసి ఆయనను ఇబ్బంది పెట్టనని మాటిచ్చాను. ఈ విషయంతెలుసుకొని సుబ్బమ్మ చాల సంతోషించింది. ఈ విధంగా, చిన్నతనంలోనే నేను పెద్దవారిలో మార్పు తెప్పించే వాడిని. సుబ్బమ్మ తన భర్త పోయిన తరువాత తన జీవితాన్నంతా స్వామి సేవకే అంకితం చేసింది. కట్టకడపటికి తన ప్రాణం పోయేంతవరకు స్వామి సేవలోనే కాలం గడిపింది. నిజంగా ఆమె భక్తి ప్రపత్తులను గురించి మీరు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చిన భక్తులందరికీ ఆమె ఉచితంగా భోజనం పెట్టేది పాపం! ఒకరోజు బండిలో వెళుతున్నాం మేము. "సుబ్బమ్మా! ఏమి కావాలి నీకు " అని అడిగాను. అటూ ఇటూ చూసింది. ఎవ్వరూ లేరని గుర్తించి "స్వామీ! నాకు ఏమీ వద్దుగాని, నా ప్రాణం పోయే ముందు మీ చేతి మీదుగా నా నోట్లో నీరు పోయాలి" అంది. తప్పక ఆమె అభీష్టాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చాను..

 

సరే, ఒకనాడు మద్రాసు వారు నన్ను తొందర పెట్టి తీసుకు పోయారు. అక్కడ పది దినములు ఉండవలసి వచ్చింది. అది యుద్ధ సమయం. మద్రాసులో గంటకు ఒక సైరన్ వినిపించేది. సైరన్ వచ్చేసరికి రోడ్లన్నీ ఖాళీ అయిపోయేవి. ఈ లోపల సుబ్బమ్మకు సీరియస్ అయింది. కానీ, మేము రావడానికి వీలులేకపోయింది. ఆమెను బుక్కపట్నం తీసుకు వెళ్ళారు. అక్కడ ప్రాణం పోయింది. బంధువులందరూ "సాయిబాబా ఆమె ప్రాణం పోయే ముందు నోట్లో నీరు పోస్తానని మాట ఇచ్చాడు. ప్రాణం పోయింది. కాని, ఎక్కడొచ్చాడు సాయిబాబా? ఎక్కడకు పోయాడో" అంటూ అనేక రకాలుగా మాట్లాడుతూ వచ్చారు.

 

నేను వచ్చే దారిలోనే ఉన్నది Burial Ground స్మశానం) అక్కడ కట్టెలు పేర్చి అందరూ కాచుకొని ఉన్నారు. "ఎవరిని కాలుస్తున్నారు?" అని అడిగాను. అక్కడ చాకలి సుబ్బన్న ఉన్నాడు. "స్వామీ! సుబ్బమ్మగారు పోయినారు.? అన్నాడు. "పోయినారా? ఎప్పుడు పోయినారు?" అని అడిగాను. "మూడు దినాలైపోయింది స్వామీ!" అన్నాడు నేను ఇంటి దగ్గరకు వెళ్ళాను. అందరూ సుబ్బమ్మ మృత దేహాన్ని తీసుకు వెళ్ళడానికి సిద్ధమౌతున్నారు. నన్నుచూస్తూనే ఆమె సిస్టర్ గట్టిగా ఏడ్చింది. "బాబా! నీవు వచ్చి తన గొంతులో నీరు పోస్తాని ఎంతో ఆశించింది. నిన్ను చూడాలని కన్నులు కాయలు కాచేటట్లు ఎదరు చూసింది. కట్టకడపటికి నిరాశతో ప్రాణం విడిచింది" అని విలపించింది. అలా జరగడానికి వీల్లేదని చెప్పి, ఒక టంబ్లరులో నీరు తెప్పించాను. అందులో తులసీ దళం వేశాము. సుబ్బమ్మ దేహం వద్దకు వెళ్ళి పైన కప్పిన బట్ట తీశాను. అంతా చీమలు పట్టినాయి. పాపం! ప్రాణం పోయి మూడు దినములైపోయింది. "సుబ్బమ్మా ! అవి పిలిచాను. తక్షణమే కళ్లు తెరిచింది! నా రెండు చేతులు గట్టిగా పట్టుకుని కన్నీటి ధారలు కార్చింది. "సుబ్బమ్మా ! బాగా చూడు" అన్నాను. టవలు తీసి బాగా తుడిచాను. "ప్రశాంతంగా కన్ను మూసుకో" అని చెప్పి ఆమె నోట్లో తులసి తీర్థం పోసి నా మాటను నిలబెట్టుకున్నాను.

 

చాకలి సుబ్బన్న చాల బలవంతుడు. చంద్రప్పగారి సుబ్బన్న ఏడడుగుల ఎత్తువాడు. వారిద్దరిలో ఎవరో ఒకరు ఎప్పుడూ నావెంట ఉండాలని సుబ్బమ్మ శాసించేది. వారితో “బాబా ఎప్పుడంటే అప్పుడు నదికి వెళుతుంటాడు. చిన్న వాడు, నడవలేదు. కాబట్టి, మీరు భుజంపై ఎక్కించుకుని తీసుకు వెళ్ళాలి" అని చెప్పేది. ఈ విధంగా, ఆమె నాసౌకర్యం కోసం అనేక ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. ఆమె గుణము చాల విశాలమైనది. తాను ఏది చేసినా స్వామి తృప్తి కోసం చేసేది. ఒకనాడు ఎట్టి గంగప్ప అనే హరిజనుడు నన్ను భోజనానికి రావలసిందని ప్రార్థించాడు. అతను ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడతని వయస్సు 90 సంవత్సరాలు. అతని కుమారుడు మన ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. నేను సుబ్బమ్మతో ఎట్టి గంగప్ప ఇంటికి భోజనానికి వెళుతున్నానని చెప్పాను. తాను కూడా వస్తానన్నది. “నేను హరిజనుల ఇండ్లకు పోతున్నాను. నువ్వు రావద్దు" అని చెప్పాను. "ఏమిటి స్వామీ, మీరు వెళుతుంటే నేనెందుకు రాకూడదు? నాకెలాంటి భేదమూ లేదు. నేనూ వస్తాము" అని నావెంట వచ్చింది. ఆ ఇంట్లో భోజనం చేశాము. "సుబ్బమ్మగారు మాలిండ్లకు వచ్చారే!"అని గంగప్పచాల భయపడిపోయాడు. "మీరు ఆవిధంగా భావించకండి. కులమత భేదాలను వీడి ఐకమత్యంతో ఆనందంగా ఉండండి" అని చెప్పాను. ఈ విధంగా, చిన్నప్పటి నుండియే ఇలాంటి భేదాలను దూరం చేస్తూ వచ్చాను. ఇలా చెపుతూ పోతే ఎంతో చరిత్ర ఉన్నది.

 

ఈ నా టి పిల్లలు మంచి గుణవంతులు కావాలి. ద్వేషము, క్రోధము, డంబము, అసూయ ఇత్యాది దుర్గుణములను త్యజించాలి. అహంకారములను త్యజించాలి. ఆహంకారము నకు అసలే ఆవకాశ మివ్వకూడదు. ప్రేమనే మీరు పెంచుకోవాలి. ప్రేమయే మీ జీవితంగా ఉండాలి. ప్రేమ లేకపోతే మీరు శవంతో సమానం. ఎలాంటి పరిస్థితి యందైనా ప్రేమను మాత్రం దూరం చేసుకోకూడదు. ఈనాడు మీరు ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా నేను మిమ్మల్ని రక్షించక తప్పదు. అప్పుడు తెలుసుకొని పశ్చాత్తాపపడితే ప్రయోజన మేమిటి? ఈనాడే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

(స.పా.ఏ.2000 పు.110/119)

 

 

సాయికి తెలియనివి లేవు
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జర్మను దేశమునుండి హిట్లరురష్యా పై దండయాత్రకు బయలుదేరాడు. అప్పుడు నేను చిన్నవాడను. ఒక నాయకుడు వచ్చి “మన వీరుల పైన కవిత్వం కట్టి పాడండి,” అని అడిగాడు. వాళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు నేను వేదిక పై ఒక తొట్టెలో ఒక రబ్బరు బొమ్మను పడుకోబెట్టి ఊపుతూ ఇలా ఒక పాటను కూర్చి పాడాను:

ఏడవకు పసిబాల ఏడవకు తండ్రీ
ఏడిస్తే నిను భరతవీరుడనరయ్యా...... జో.... జో..
హంతకుడు హిట్లరు అమర రష్యాపై దండెత్తి
వచ్చెనని దడిసి ఏడ్చితివా......... ..... జో.... జో..
హిట్లరును చంపుటకు ఎర్రసైన్యంబు
వీరుడౌ స్టాలిను కలరు. ఏడవకు........... జో.. జో
ఐక్యతగ ప్రజలంత చేరి పోరాడి
స్వాతంత్ర్యమును పొందగలరు ఏడవకు.... జో.... జో....

ఆనాడు. ఈ విధమైన పాటలు వ్రాసి అందరికీ ప్రచారం చేసేవాడిని. ఈ హిట్లరు, ఈ స్టాలిను, రష్యను వీరులు... వీరంతా సాయిబాబాకు ఎలా తెలుసు? చాలా చిన్న పిల్లవాడే, అని జనం చాలా ఆశ్చర్యపడేవారు. స్టాలిను వీరుడని చెబుతున్నాడే, ఎవరికీ తెలియని పే ర్లే, ఎట్లా తెలుసు ఈ పిల్లవానికి? అని వాళ్ళ సందేహం. సాయికి తెలియనివి లేవు. కాని, తెలియనట్లుగానే నటన చేస్తుంటాను. ఉదాహరణకు, “ఎప్పుడు వచ్చారండీ మీరు?” అని ప్రశ్నిస్తాను. - "అయ్యో, నేను వచ్చింది. తెలియదా సాయిబాబాకు?” అని మీరనుకుంటారు. తెలుసు. కాని, మిమ్మల్ని సంతోష పెట్టే నిమిత్తమై నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడు వచ్చావని అడిగితే, “నన్ను పలకరించారు,” అని మీరు ఆనందిస్తారు. కొన్ని దినములైన తరువాత కొందరు స్కూలు పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చి సత్యా అని నన్ను పిలిచి “మేము డ్రామా వేస్తున్నాము. నీవు కథ వ్రాసి దానికి ఒక పాటమాదిరి కట్టి ప్రపంచానికి ప్రబోధ గావించాలి. మాకు సహాయం చేయాలి,” అన్నారు. అప్పుడు నేను చెప్పాను - "సరే, సిద్ధంగా ఉండండి. ఇద్దరు పిల్లల్ని నాకివ్వండి,” అన్నాను. ఆ ఇద్దరు పిల్లలకు నేను పాటలు నేర్పిస్తూ వచ్చాను. నేను నేర్పిన పాటలు వాళ్ళు పబ్లిక్ లోకి పోయి పాడాలి

ఏమి కాలంబు వచ్చెనో జనులారా!
ఫేసు పౌడరు అవతరించె మోసగించి పసుపు పోయె
ఏమి కాలంబు వచ్చెనో, జనులారా! ఏమి కాలంబు వచ్చెనో!
కాసుల పేర్లన్నీ పోయె మోసగించి చైనులొచ్చె
ఏమి కాలంబు వచ్చెనో...

చేతిగడియారాలు అప్పుడే వాడుకలోకి వచ్చాయి. దానిని పురస్కరించుకొని

ఎడమచేతి కథన రెండు తుంటల బిళ్ళ
తోలు పట్టెడ కట్టి యాలాడగడతారు
ఏటి వేషాలప్ప ఇవి?
కంటితో చూసేది కాని యవతారాలు
ఏటి వేషాలప్ప ఇవి?
పొడుగాటి మీసములు గొరిగి నాసిక ముందు నాల్గుంచు సొగసు
ఏటి వేషాలప్ప ఇవి?

పిల్లలలో ఫ్యాషన్లపై మోజు పోగొట్టి ప్రాచీన సంబంధమైన ఉన్నత భావాలు నాటడం కోసమని నేనీ విధంగా పాటలు వ్రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను.

ఈవిధంగా ధైర్యసాహసాలతో స్వేచ్ఛా జీవితం గడుపుతూ వచ్చాను. ఎందుకనగా, నాలొ ఎటువంటి దోషములూ లేవు. దోషము లేనివానికి భయమెందుకు ఉండాలి? భయమే లేదు. ధైర్యంతో, సాహసంతో ముందుకు పోయేవాడిని. నేను కొన్ని నాటకాలు కూడా వ్రాస్తూ ఉండేవాడిని. ఉదాహరణకు, “చెప్పినట్లు చేస్తారా!" అనే డ్రామా.

ఆ రోజుల్లో స్త్రీలకు చదువు తక్కువ. ఇంటిలో పెద్దవారి దగ్గరకు స్త్రీలు చేరి సత్సంగము సల్పుతూ ఉండేవారు. పంచాంగము రామప్ప తల్లి కామేశ్వరి అని ఉండేది. ఆమె వేదాంతపుస్తకాలు చదివేది. తనకు ఈ పుస్తకాలలోని విషయాలు బాగా అర్థం కాకపోయినా వాటిని నెమ్మదిగా బోధపరచుకుని తనకు చేతనైనంతవరకు తోటి స్త్రీలను చేరదీసి వారికి బోధించేది. భగవంతుడు సత్యవాక్పరిపాలకుడు అని ఇటువంటి పెద్ద పెద్ద విషయాలు విద్యాగంధము లేని ఆ అమాయక స్త్రీ లకు భోధించడానికి ప్రయత్నించేది. కొన్ని నిగూఢమైన తత్త్వాలు కూడా పద్యరూపకంగా వారికి బోధించడానికి ప్రయత్నించేది.

మరపు తెర పడకుండ నిరతము
జాగ్రత్స్వప్నసుషుప్తిలో అరమరలు లేకుండ
ఎప్పుడు తరచుగ జీవాత్మ చదివెడి
తారకము సూటెరుగవలెనన్నా!
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుమన్నా

ఈ విధంగా, తారకము అంటే వారికి ఎలా అర్థమౌతుంది? అప్పుడు నేను సమయం కనిపెట్టి ఆమెతో “అవ్వగారూ! వారికి అర్ధమయ్యే రీతిలో చెబితే బాగుంటుంది కాని, తారకము, వంటి పెద్ద పెద్ద మాటలతో చెబితే వారికి ఏమి అర్థమౌతుంది? అందువలన వారి స్థాయికి తగినట్లుగా ఆ ఆడవారి కందరికీ బోధించండి,” అని చెప్పేవాడిని. అందుకొరకు ఈ విధమైన సంస్థలు ఆనాటినుండియే నేను ప్రారంభం చేశాను. ఇంకా పిల్లలను పిలిచి, వాళ్ళచే ర పండరి భజనలు చేయించేవాడిని. కాళ్ళకు గజ్జెలు కట్టుకునేది, మంచి తాళం తీసుకునేది, ఎగురుతూ బజారులో పోయి నిద్ర పోతున్నవారిని కూడా లేపించేది. ఆ రోజుల్లో తెల్లవారి ఏడు గంటలకుగాని లేచేవారు కాదు, ఆ గ్రామంలో. కాని, నేను ఈ పిల్లలచేత భజన చేయించడంచేత ఐదు గంటలకే లేచి, స్నానాలు చేసి దైవప్రార్థనలు సల్పేవారు. ఈ విధంగా, చిన్నప్పటి నుండి ప్రచార ప్రబోధలలోనే కాలము గావించుకుంటూ వచ్చాను. ఈ అందరి భజనలు చేస్తుంటే, ఇతర పల్లెలనుండి కూడా జనం చూడడానికి వచ్చే వారు. ఈ పండరి భజనలోపల అందరూ తన్మయులైపోయేవారు. పాపం, సుబ్బమ్మ చాలా ఆనందపడేది. ఆనాడు రెండు రూపాయలిస్తే బొరుగుల మూట వచ్చేది. ఆమె బొరుగులు తెప్పించి అందరికీ పంచేది.

అందరినీ ఆనందపరచడమే నా కర్తవ్యము
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, విద్యార్థులు బాల్యమునుండే దివ్యమైన భావాలను అలవర్చుకోవాలి. నన్ను చదువు నిమిత్తమై కమలాపురం పంపారు. కదపకు సమీపంలోనే ఉంటుంది. ఆ గ్రామం. తాడిపత్రికి, కడపకు మధ్యలో ఉంటుంది. ఆ కమలాపురంలో ఎట్లా తెలిసిందో, ఏమిటో... కొట్టే సుబ్బన్న అనే వ్యాపారి ఒకతను నా దగ్గరికి వచ్చి “మీరు చాలా మంచి కవిత్వం వ్రాస్తారట,” అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, "నేను కవిని కాదు. కవిత్వం చెప్పడం లేదు. నా నోటి నుండి పలికిన ప్రతి మాట కవిత్వమే.” అప్పుడాయన దుకాణంలో ఒక క్రొత్త మందు వచ్చింది. ఆ మందుయొక్క గుణములన్నీ వ్రాసిచ్చాడు. దాని పేరు “బాలభాస్కర” అని. ఆ బాలభాస్కర పై పాట వ్రాసి పిల్లలచే ప్రతి వీధిలోను పాడించమని కోరాడు. నేను అతనిని ఒక గంట పోయిన తరువాత రమ్మన్నాను. ఈ లోపుగా ఈవిధంగా ఒక పాట కూర్చాను:

దొరికె దొరికె “బాలభాస్కర" బాలకులారా!
రండి బాలకులారా!
కడుపుబ్బరము, కాళ్ళవాపులు
చేతినొప్పులు, చెడుగుణములనుండి
అజాగరూక పోషణనుండి, అజీర్ణ విరేచనములనుండి
అఖండముగ పనిచేయునండి –
రండి బాలకులార!
అది ఎక్కడ అని అడిగేరన్నా, అదిగదిగో కొట్టే సుబ్బన్న
అంగడియందే దొరకును అన్నా||బాల||
పండిత గోపాలాచార్యుల పావనమైన టానిక్కన్నా||బాల||

ఇవన్నీ చెప్పేటప్పటికి కొట్టే సుబ్బన్న చాలా సంతోషపడిపోయి బుట్టెడు లడ్డులు తీసుకువచ్చాడు. అప్పుడు నేను “నా వద్దకు తీసుకు రావద్దు. ముందు అందరికీ పంచు” అని చెప్పాను. నేను తీపి ముట్టను. నేను పుట్టిననాటి నుండి తీపిని ముట్టలేదు. నా దగ్గర కావలసినంత తీపి ఉంది. అనలు నా మనసే తీపు, నా ప్రేమయే తీపు. ఇంక, ఈ తీపులంతా నాకెందుకు? అందరికీ ఆ లడ్డులు పంచి ఇచ్చాను. ఈవిధంగా, ప్రతి వ్యక్తికి ఒకొక్కరికీ ఒక్కొక్కరీతిగా సహాయం చేసి వారిని - ఆనందపరచి ఉత్సాహపరచేవాడిని. అదే నాయొక్క ప్రధాన కర్తవ్యం. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు 21-26)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage