ప్రకృతి శక్తిని అనుసరించి దానికి వశుడై మానవుడు స్వసామర్థ్యమును ప్రకటించవలసియున్నది. తన బుద్ధిబల, ధనబల, భుజబలముల వలన తాను తన అభీష్టమునునెరవేర్చు కొన్నాడనని వాడు విఱ్ఱవీగవచ్చును. కానీ, స్వప్రయత్నము చేత మాత్రము ప్రకృతిని వశము చేసుకొనుట అసాధ్యమైన పని. దైవము యొక్క అనుమతి లేక ప్రకృతిని స్వాధీనపరచుకొనుట సాధ్యముకాదు.
దీనికి చక్కని ఉదాహరణము, రామాయణము. రాముడు, పరమాత్మ స్వరూపుడు; సీత ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి పరమాత్ముని సొత్తు; సీత రాముని సొత్తు. అయితే, రావణుడు ప్రకృతిని ఆశించి, పరమాత్ముని ప్రక్కకునెట్టి తిరస్కరించినాడు; తత్ఫలితముగా తన్నూ, తన కులమునూ నాశనము చేసుకొన్నాడు. దైవము ప్రకృతి ధార. ఆ దైవము అక్కరలేదన్న. అది ఎంత వెఱ్ఱి తనము? రాముని ఆగ్రహమునకు పాత్రుడై తీరని అపకీర్తిని సంపాదించుకొన్నాడు. దేహము ప్రకృతి; ప్రాణము పరమాత్మ, ప్రాణమే దేహము నకాధారము. ప్రకృతిని పరమాత్మ విమిత్తమై ప్రవేశ పెట్టవలెను. పరోపకారార్థం మిదం శరీరం" అనుసూక్తి ఈ మార్గమునే ఉపదేశించుచున్నది.
(స.సా.మా..77.పు.6)
జాతి భేదములేక జెనులకాశ్రయమిచ్చి
సర్వసమత్వంబు చాటు తరులు
తనువుపై మనకింత తమకంబు వలదంచు
చలి ఎండ వానల పైచు గిరులు
రేపుమాపటికంచు వాపోవ వలదంచు
విహంగముల్ సంతృప్తి విద్యగఱపు
జగము నిత్యము కాదుసంసారమిది భ్రాంతి
అనుచు సర్వము త్యజించిపోవు వారు
నాది నాదంచు బ్రాంతి అనిత్యమంచు
ఏడ్చు ప్రకృతి జననిక| కన్నీటి భాష్పంబు తెలుపు
ప్రాణి సర్వసుఖములననుభవించగోరి
ప్రకృతియే పాఠశాల శ్రీధరుడే గురువుగాక
(శ్రీ ఆ.99.పు.7)
ప్రపంచమే ఉత్తమ విద్యాలయం ప్రకృతే ఉత్తమ గురువు
(సా.యా.రెండవ మొదటికవరు పుట)
భూమి తనచుట్టూ తాను తిరగటం చేత రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. సూర్యుని చుట్టూ తిరగటంచేత ఋతువులు ఏర్పడి, పంటలు పండి, ప్రజలకు తిండి తీర్థాదులు చేకూరుతున్నాయి. భూమి ఈ విధంగా తిరగటం లో క్షేమం కోసమే గాని, తన స్వార్థం కోసం కాదు. తనచుట్టూ తాను తిరగటంచేతను, సూర్యునిచుట్టూ తిరగటంచేతను భూమికి వచ్చే ఆదాయమేమీ లేదుగాని, దానివల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతున్నది. ఈ రీతిగా, భూమి క్షణమైనా విశ్రాంతి లేకుండా నిస్స్వార్థంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు చక్కని ఆదర్శాన్ని అందిస్తున్నది. ప్రతి మానవుడు భూమిని ఆదర్శంగా తీసుకొని తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన మానవత్వం. కాని, నేటి మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించాడు. జడమైన యంత్రాలు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయిగాని, ప్రాణం కలిగిన మానవుడు మాత్రం తన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. కనుకనే, కష్టాల నమభవిస్తున్నాడు. కేవలం శ్వాస ఉన్నంత మాత్రాన మానవుడు జీవించియున్నాడనిభావించడం పొరపాటు: కర్తవ్యాన్ని నిర్వర్తించని వాడు జీవించియున్నా మరణించినట్లే! భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు.
“నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన
నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణీ. "
పార్థా! నాకు ఈ ముల్లోకాలలో కావలసింది ఏమీ లేదు. నేనీ కర్మలను ఆచరించనక్కర్లేదు. నేనే సర్వమునైయుండగా నాకు కర్మలతో పనేముంది! కాని, నేనే కర్మలను ఆచరించకపోతే ప్రజలు ఆచరించరు. కనుక, ప్రజలకు ఆదర్శాన్ని అందించే నిమిత్తం, ప్రజా సంక్షేమ నిమిత్తం నేను కూడా కర్మలను ఆచరిస్తున్నాను. ఇది నా కర్తవ్యం. " అన్నాడు. అయితే, మీ కర్తవ్య మేమిటి? ప్రకృతిలో జన్మించినందుకు మీరు ప్రకృతిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రకృతి అందరికీ ఉపకారమే చేస్తున్నది. కనుక, మీరు కూడా సమాజానికి ఉపకారంచేయాలి. అప్పుడే మీరు ప్రకృతిబిడ్డ లనిపించుకోవడానికి అర్హులౌతారు. కృష్ణుడు అర్జునుణ్ణి పార్థా!" అని సంభోదించాడు. పార్థుడనగా పృథ్వీ పుత్రుడని అర్థం.ప్రతి మానవుడు పృద్వీ పుత్రడని అర్థం. ప్రతి మానవుడు పృధ్వీపుత్రుడే.
కాబట్టి, ప్రతి మానవుడు పార్థుడే. తాను పృథ్వీకి పుత్రుడైనందుకు పృథ్వియొక్క ఆదర్శాలను అనుసరించాలి. ఇదియే మానవుని కర్తవ్యం. "కర్తవ్యం యోగ ముచ్చతే," కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన యోగం. మిగిలినవన్నీ రోగాలే!
((స.సా. జూ.2000 పు.183)
ప్రకృతికి క్షేత్రమని మరొక పేరు కూడ కలదు. ప్రకృతి అన్ననూ, క్షేత్రమన్ననూ వక్కటియే. ప్రకృతి అనగా ప్రపంచము. అందులో రెండు వస్తువులున్నవి. వకటి ఇదము రెండవది చైతన్యము, అనగా ఒకటి ద్రష్ట రెండవది దృశ్యము. తెలుసుకొనునది అహం వస్తువనియు, తెలియబడునది ఇదం వస్తువనియు అందురు. గుణముల యొక్క వికారము ప్రకృతి సంబంధములు. సుఖదుఃఖ మోహ రూపములయిన సత్వరజస్తమోగుణములు. ప్రకృతి గుణములు. కర్తృత్వ భోక్తృత్వ ధర్మములు ప్రకృతికి సంబంధించినవే’.
(గీ.పు. 199)
ప్రకృతి దాని సూత్రాలు, పదార్థం దాని స్వభావం, శక్తులు వాటి ప్రాబల్యం వీటి గురించి బోధించేవారు ఆ బోధలు బంధాలకే దారి తీస్తాయి కాని, విముక్తికి కాదు. అది బరువే కాని, ప్రశాంతి కాదు. అది దుఃఖ సముద్రాన్ని, సంతోషపు టంచులలో దాటటానికి రాతి పడవను అందించడం లాంటిది. అది నిన్ను తప్పక ముంచు తుంది తప్ప తేల్చలేదు. నీకు ఆ సముద్రం దాటటానికి, భక్తి అనే తెప్ప, భగవంతుని కృప, ఆయన ఇష్టానికి శరణాగతి కావాలి. బరువులను దించుకొని తేలికవ్వు. నీవు ఒక అడుగు కెరటం ఉవ్వెత్తు మీద నుంచి, ఇంకొక దాని మీదికి రెండవది వేయ గలవు. భగవంతుడు నిన్ను దరిచేరుస్తాడు. దాని గురించి చింత పడనక్కర లేదు. ఆయనే సర్వం చేస్తున్నప్పుడు ఎవరైనా దేని గురించి వ్యాకుల పడాలి ?-- శ్రీ సత్య సాయి బాబా. (నా బాబా నేను పు178)