కాలము వృధా చేయకు. ఉదయం వస్తుంది. మానవునకు ఆశ పెరుగుతుంది. సాయంకాలము వస్తుంది. కోరికలు బంధిస్తాయి. జీవితము అంటే యిదేనా? యిదేనా నీ లక్ష్యం? ఇట్లా ఒక రోజు గడిచిందంటే ఆ రోజు వృధా అయిందన్నమాట. మృత్యువునకు ఒక రోజు సమీపం అవుతుంది. ఎప్పుడైనా యీ విషయం గురించి ఆలోచించావా? ఒక రోజు వృధా అయినదని పశ్చాత్తాప పడతావా?"
(సా. పు. 20)
కాలమను సర్పము కబళించను దేహమను పొదలో పోంచియుండగా నీవు కన్నులు మూసుకొని కాలమును మ్రింగ తలంచుచున్నావు కాలమును మ్రింగినవారు ఈ లోకమున యెవ్వరూ లేరు. కాలమే అందరినీ మింగుచున్నది. అది తెలుసుకోలేక అజ్ఞానమున మునిగి అర్థ కామములతొ అలమటించుచున్నావు. పశు జీవితమును గడుపుచున్నావు. మానవ జీవితమును వ్యర్థము చేయుచున్నావు. సార్థకము చేసుకొనుటకు ప్రయత్నించు కాలము మించలేదు. ఇకనైనమా ఇల్లు విడచి, ఇహమును మరచి, పరమును స్మరించుట, తరించు, పరుల పంచలపడి ప్రాణమును విడువక పరమాత్మ చింతనతో ప్రాణముల విడచుట పరమ పవిత్రము.
(భా వాపు.38/39)
ఈశ్వరునకు ఒక చేతి యందు డమరుకము, రెండవ చేతియందు శూలము, విష్ణువునకు ఒకచేతియందు శంఖము. రెండవ చేతిలో చక్రము. శంఖము అనగా శబ్దము, చక్రమనగా కాలమును. అనగా శబ్దమును. కాలమును చేతిలోఉంచుకొన్నారు.శంకరులుడమరుకమునకుశబ్దము.త్రిశూలమునకుత్రికాలములు. రెండూ ఒకటే. రూప, నామములందు భేదమే కాని శక్తి ఒకటే. వేదము, ఖురాను Bible ఆద్వైతం బోధించినది. "ఈశ్వర స్పర్వభూతానాం" ఈశావాస్య, మిదం సర్వం వాసుదేవ సర్వ మిదమ్ అని వేదము బోధించినది. Bible - All life is my love dear son. Be alike with every one."
(వే. ప్ర. పు. 105/106)
దివ్యాత్మస్వరూపులారా ఈ యుగస్వరూపుడైన కాలాన్ని మనం వ్యర్థము చెయ్యకూడదు. సంవత్సర స్వరూపుడైన కాలాన్ని వ్యర్థము చెయ్య కూడదు. కా+ల కాల. “క” అనగా శుభము, సుఖము. "ల" అనగా అందించే టటువంటిది. సర్వ శుభములను అందించేటటువంటిదే కాలము. కాలము కాయాన్ని మ్రింగుతుంది. కాలుడు కాలాన్నే మ్రింగుతాడు. కనుక భగవత్ స్వరూపమైన కాలాన్ని మనము అలక్ష్యము చెయ్యరాదు. ఈనాడు 24 గంటల లోపల అధిక కాలమును వ్యర్థము చేస్తున్నారు. కాలమును వ్యర్థము చెయ్యక కాలమున సార్టకము చేసుకోవాలి. విరామకాలములో భగవన్నాము స్మరణ చెయ్యి. ఈ కలియుగములో నామ స్మరణకు మించినది మరియొకటి లేదు. నీ చేతులతో కర్మలు చేస్తు, నామ స్మరణ చెయ్. ప్రాపంచిక సంబంధమైనవి తలలో చేర్చుకోనక్కరలేదు. Hands in the Society, Head in the forest. That is the real rest.
(స.సా. మే. 89 పు. 119)
“తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ,
మయ్యర్పిత మనోబుద్ధి ర్మామే వైష్య స్యసంశయ:"
" అర్జునా! ఎల్లకాలము నన్ను స్మరించు, నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి, నీ స్వధర్మమయిన యుద్ధమును నీవు ఆచరించు. తప్పక నన్ను పొందగలవు. ఇందులో సంశయములేదు" అని కృష్ణుడు అర్జునునికి బోధించాడు. ప్రపంచములోగల విలువైన వస్తువులన్నింటిలో కాలము చాల విలువైనది. ఇట్టి విలువైన కాలమును యే విధముగా వుపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించు కోవచ్చు.
కాలకాల ప్రపన్నానాం కాలః కిం కరిష్యతి - కాలమును కూడ మ్రింగే దైవత్వానికి కాలరూపమైన కాయమును కర్తవ్యరూపములో కర్మలద్వారా సార్థకము గావించు కోవటమే మానవుని ప్రధానకర్తవ్యము. గడచిపోయిన కాలమును యేమాత్రము వెనుకకు మరల్చలేము. కోల్పోయిన ఆరోగ్యమునైన ధనమును వ్యయము చేసయినా ఒక విధముగా సంపాదించుకొనవచ్చును. కాని గడపుకొన్న కాలమును యేమాత్రము ముందుకు తెచ్చుకొనటానికి వీలుకాదు. ఇటువంటి పవిత్రమైన విలువైన కాలమును సద్వినియోగ పరచుకొనుటకై తగిన కృషి చేయాలి.
(శ్రీస. గీ. పు. 110)
పాము నోటబడ్డ కప్ప పురుగులను తిన యత్నించును. కప్పను పట్టిన పామును నెమలి తిన యత్నించును. నెమలిని వేటగాడు పట్ట యత్నించును. ఇట్లే లోకమున ఒకరి నొకరు మ్రింగడానికి యత్నించుచున్నారేగాని కాలము తమను మ్రింగుచున్నదని తెలుసుకోవడం లేదు.
(స.సా.ఆ. 98 పు. 218)
ఈ దేశంలో దీనికి కొరత లేదు. ఈ దేశంలో లేనిది ప్రపంచంలోనే లేదు. పూర్వం విదేశీయులు ఇక్కడి సిరిసంపదలచేత ఆకర్షితులై ఈ దేశంపై దండయాత్రలు చేసినట్లు చరిత్ర చెపుతున్నది. కాని, ఈనాడు ఈ దేశంలో కాలాన్ని వృధా చేసే సోమరులు అధికమైపోయారు. జీతానికి తగిన పని చేసేవారు చాల అరుదుగా ఉన్నారు. అనేకమంది వేలకు వేలు జీతాలు తీసుకుంటూ పని మాత్రం చాల తక్కువ చేస్తున్నారు. ఇది దేశ ద్రోహం. కాలం దైవస్వరూపం. నిన్ను కాలం అనుసరించదు. నీవే కాలాన్ని అనుసరించాలి. దైవన్ని "కాలాయనమఃకాలకాలాయనమః కాలాతీతాయ నమః కాలదర్పదమనాయనమః" అని వర్ణించారు. కనుక, కాలమును వృధా చేయడం దైవద్రోహమన్నమాట. కాలాన్ని సద్వినియోగపర్చుకోవాలి. చెడు చూడకూడదు, మంచినే చూడాలి. చెడు వినకూడదు. మంచినే వినాలి. చెడు తలంచకూడదు, మంచినే తలంచాలి. చెడు చేయకూడదు, మంచినే చేయాలి. మంచి చూపులు, మంచి మాటలు, మంచి చేతలు, మంచి ఆలోచనలు - వీటివల్లనే కాలం సద్వినియోగమవుతుంది. కండలు కరిగేటట్లుగా పని చేస్తే పండ్లు అరిగేటట్లుగా తినవచ్చు. కాని, ఈనాటి యువకులు "తిండికి తయార్, పనికి పరార్" అన్నట్లుగా ఉన్నారు. ఇలాంటి సోమరిపోతులు సాధించేది ఏమీ లేదు. నిజానికి రెండు చేతులతో పని చేస్తే ఒక్క పొట్ట నింపుకోలేరా? ఫొటో గ్రాఫర్ ఏమి చేస్తాడు? కెమెరాను చక్కగా సిద్ధం చేసుకుని మిమ్మల్ని రెడీ గా ఉండమని చెప్పి మీ ఫొటో తీస్తాడు. కాని, కాలుడు మీకు Be ready (సిద్ధంగా ఉండు) అని చెప్పడు. అకస్మాత్తుగా తీసుకుపోతాడు. అందువల్ల, మృత్యువుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఉన్న కాలాన్ని సద్వినియోగపర్చు కోవాలి. భగవంతుని సృష్టిని గమనించండి. సూర్యచంద్రా దులు, నక్షత్రాలు, వృక్షసంపద, నదీనదములు మున్నగున వన్నీ కాలాన్ని అనుసరించి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి, మానవాళికి ఆదర్శాన్ని అందిస్తున్నాయి. కనుకనే, Nature is the best teacher (ప్రకృతియే పరమ గురువు) అన్నారు. మీకు ఆదివారం సెలవుందిగాని, స్వామికి ఒక్క సెలవు దినము కూడా లేదు. ఎన్నో వేల ఉత్తరాలు వస్తుంటాయి. అన్నింటిని చదువుతాను. అన్ని పనులు నేనే స్వయంగా చూసుకుంటాను. హాస్పిటల్,యూనివర్సిటీ, వాటర్ ప్రాజెక్ట్. ఆశ్రమ నిర్వహణ,అధికారులు,ఆసంఖ్యాకమైన భక్తులు,ప్రపంచవ్యాప్తమైన సాయిసంస్థలు అన్నింటినీ నేనే చూసుకుంటాను. స్వామికి విరామము, విశ్రాంతి అనేవి లేవు. మీ అందరి ఆనందమే నాకు ఆనందము. జనులకు ఆదర్శాన్ని అందించే నిమిత్తమే ఈ అవతారం వచ్చినది. కనుక, కాలాన్ని వృధా చేయక కర్మ ద్వారా ధర్మమును పోషించుకుని జన్మను సార్థకం చేసుకోండి.
(స.సా.నం. 99 పు. 343)
(చూ|| కర్తవ్యధర్మము)