భక్తుడు/భక్తులు

ఒకానొకప్పుడు కృష్ణపరమాత్మ అర్జునునితో సరదాగా మాట్లాడుతూ "బావా నీవు నాకు పరమభక్తుడవు; అంతియే కాదు, ప్రాణమిత్రుడవు. నీబోటి మిత్రుడు నాకు మరొకడులేడు; అందువలననే ఈ పవిత్రమైన ఉత్తమ రహస్యమును నీకు బోధించితిని" అని అన్నాడు. దీని అంతరార్ధమెంత గాఢమయినదో యోచించుడు. లోకమున యెందరో భక్తులమని వారికి వారు బిరుదులు కల్పించుకొనుచున్నారు. కానీ, నీవు భక్తుడవు అని భగవంతుడు ఎవ్వరికీ బిరుదు ఇవ్వలేదు. భగవంతుని హృదయము నుండి నీవు నా భక్తుడవుఅను  బిరుదును పొందినవాడు భక్తుడు కాని, భగవంతుని హృదయమును కరగింపలేని వారు యెంత భక్తుల మనుకొన్ననూ అది వారి అల్ప తృప్తి కానీ ఆత్మ తృప్తికాదు. నీవు నా భక్తుడవని బిరుదును సాధించినది ఒక్క అర్జునుడు మాత్రమే.అర్జునుడు యెంతటి పవిత్ర హృదయములో భగవత్ అనుగ్రహమునకు యెంతటి అర్హుడో దీనిలో తెలుసుకొనవచ్చును. భక్తులము భక్తులమని వూరికే చెప్పుకొను జొల్లుమాటలు. జొల్లుమాటలూ కేవలం గాలి మూటలే. వారికి తిరుగు అంగీకారముండిన గదా భక్తులనుటకు గుర్తు! భక్తివలన అవిధేయత దూరమగును. అంత మాత్రమున చాలదు. అందుకనే మిత్రుడవనికూడా కృష్ణ పరమాత్మ సంబోధించినవాడు. మిత్రత్వమువలన భయము వుండదు. ఇవి ఒకదాని కొకటి లేకపోయిన ఉత్తమ విద్యకు అధికారికాలేడు. కనుకనే, భక్తి, మైత్రి రెండూ అన్యోన్యముగానుండిన అను గ్రహమునకు అధికారి కాగలడు.

(గీ.పు 57/38)

 

అన పేక్షః శుచి ర్దక్ష ఉదాసీనో గతవ్యధ!

సర్వారమ్భ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియ:

 

ప్రేమస్వరూపులారా! కృష్ణుడు భక్తునికి ఉండవలసిన లక్షణములను వివరిస్తూ భగవద్గీతలో చెప్పిన శ్లోకం ఇది.మొదటి లక్షణం అనపేక్ష. భక్తునికి ఎట్టి ఆశలూ,  అపేక్ష లూ ఉండకూడదు. శరీర, ఇంద్రియ, మనోబుద్ధులతో కూడిన మానవుడు ఆశలు,  అపేక్షలు లేకుండా ఎలా ఉండగలడు? దీనికి కృష్ణుడు ఒక చక్కని ఉపాయమును బోధించాడు. "నాయనా! నీవు అభీష్టములను, వాంఛలను కల్గియండుటంలో తప్పులేదు. కాని, నీ అభీష్టములను, వాంఛలను భగత్రీత్యర్థంగా అనుభవించు" అన్నాడు. "సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం" అనే ఉత్తమమైన భావమును అభివృద్ధి పర్చుకోవాలి. నాది, నీది" అనే భేదభావమును త్యజించి సర్వమూ భగత్ప్రీత్యర్థమై నేను అనుభవిస్తున్నాననే ఉన్నతమైన భావంతో జీవించినప్పుడు మానవుడు ఎట్టి ఆశలూ, ఎట్టి అభీష్టములూ లేనివాడుగా రూపొందగలడు.

 

భక్తునికి ఉండవలసిన రెండవ లక్షణం శుచి, ఏ శుచి?బాహ్య శుచియా? లేక, అంతః శుచయా? రెండింటిని అభివృద్ధి పర్చుకోవాలి. కేవలం బాహ్యమైన శరీరమునుపరిశుద్ధం గావించుకున్నంత మాత్రాన సరిపోదు. అంతర్ శుచి అత్యవసరం. కళాయి లేని పాత్రయందు సాంబారు వండితే, ఆ సాంబారంతా చిలుము పడుతుంది. హృదయం ఒక పాత్రవంటిది. దానికి ప్రేమ అనే కళాయి లేకుండా ఏ కర్మలు ఆచరించినా అవి అపవిత్రంగానే ఉంటాయి. కనుక, దుష్టభావములను దరిచేరనీయకుండా హృదయంలో భగవత్ప్రేమను నింపుకోవాలి.

 

మూడవది దక్ష ఎలాంటి కష్ట పరిస్థితియందైనా ఎలాంటి ఇక్కట్లు సంభవించినా భగవంతుణ్ణి వదలను అని ప్రతిజ్ఞ పట్టాలి. ఆ విధమైన దీక్షను పూనినవాడే దక్షుడు. నాల్గవ లక్షణం ఉదాసీనత. అనగా దేనతోను సంబంధం లేకుండా ఉండటం. ఇష్టమైనదిగాని, ఆయిష్టమైనదిగాని ఏది జరిగినప్పటికీ రజోగుణానికి అవకాశము నందించ కూడదు. ఎలాంటి పరిస్థితి యందైనా ఉదాసీనతను వహించాలి.

 

ఐదవది. గతవ్యధ: గడచిపోయింది. తిరిగి రాదు, రాబోయేది నీది కాదు. కాబట్టి ప్రెజెంట్ (వర్తమానం) లో జీవించాలి. ఇది ఆర్డినరీ ప్రెజెంట్ కాదు. అమ్నీ ప్రెజంట్! ఎందుకంటే, గడచినదాని ఫలితం వర్తమానంలో ఉంది, వర్తమానంలో చేసేది భవిష్యత్తులో అనుభవించవలసి ఉంటుంది. గడచిపోయినది ఒక వృక్షమువంటిది. ఆ వృక్షము నుండియే వర్తమానమనే విత్తనం వచ్చింది. ఈ విత్తనము నుండియే భవిష్యత్తు అనే వృక్షం వస్తుంది. కనుక, మీరు గడచిపోయినదాని గురించిగాని, రాబోయే దాని గురించిగాని విచారించకుండా వర్తమానమును దృష్టియందుంచుకుని సరియైన దీక్షలో కార్యములో ప్రవేశించాలి. అప్పుడే సర్వ విధముల విజయాన్ని సాధించవచ్చును.

 

ఇంక, ఆరవ లక్షణం సర్వారమ్భపరిత్యాగీ"అహంకారం చాల చెడ్డది. అహంకారంచేతనే మానవుడు అధ:పతనమైపోతున్నాడు. అహంకారం గలవానిని కట్టుకున్న భార్య, కన్న కొడుకు కూడా గౌరవించరు. ప్రేమించరు. కనుక, అహంకారమును పూర్తిగా త్యజించాలి.

 

"యోమద్భక్త స్వమే ప్రియః" ఈ లక్షణాలు గల భక్తుడే నాకు ప్రియమైనవాడు అన్నాడు కృష్ణుడు. కనుక, భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవాలంటే, భగవత్రేమను అందుకోవాలంటే, నిత్య సత్యమైన స్థానాన్ని పొందాలనుకుంటే పైన చెప్పిన పవిత్ర గుణములను అభివృద్ధి పర్చుకోవాలి. హృదయంలో అహం కారం నింపుకుని పైకి ఎన్ని నమస్కారాలు పెట్టినా ప్రయోజనం లేదు. అహంకారమును వీడనంత వరకు మానవుల్లో అభిమానం, క్రోధం, అసూయ డంబము మున్నగు దుర్గుణములు వెంటాడుతూనే ఉంటాయి.

(స.సా.న.99పు.318/319)

 

భక్తునకు మొదటి లక్షణము, ద్వేషము లేకుండుట; రెండవ లక్షణము, మైత్రి కలిగియుండుట; ఇంత మాత్రముచేతనే విడువక దీనుల యందును దుఃఖితులయందును కరుణకూడనూ వుండవలెను.

(గీ.పు.197/198)

 

భక్తుడు మమకారము అహంకారము ఈ రెండునూ తనయందు లేకుండా చేసుకొనవలెను. ఈ రెండునూ వేరు వేరు కావు: మమకారమునకు మూలము అహంకారము. అజ్ఞానము లేనివారికి అహంకారము చేరుటకు వీలుకాదు. చోటులేదు. అందుకనే భగవత్  భక్తుడు కాగోరు వారు సతతం సంతుష్టిః అనగా భోగమందు కాని, రోగమందుకాని, నష్టమందు కాని ఆదాయమందుకాని, దు:ఖమందుకాని, సుఖమునందుకాని, యేది ప్రాపించననూ  సంతుష్టుడై పుండవలెను. తన వాంఛా ఫలసిద్ధియందును, వాంఛా అఫలమందున మనమును చలించకుండా చూచుకొనవలెను.

 

అట్లుకాక తన వాంఛకు యే మాత్రము కొంచము అడ్డు తగిలినను చెప్పినను, మనసు ఉద్రేకమునకు దారితీయుచుండును. ఇంత యెందులకు! సకాలమునకు సరిగా కాఫీ లేకపోయిన, వారమునకు రెండు సినిమాలు చూడకపోయిన, ఉదయము సాయంత్రము రేడియోలముందు కూర్చొనక పోయిన, ఇంకనూ అనేక విధములైన ఆల్ప విషయములందు కూడనూ తనమనోభీష్టము సిద్ధించకున్న ఆనాడు యెంతయో అసంతృప్తిగాను అశాంతిగాను వుందురు. ఇట్టి స్థితులు సంతుష్టి అని అనిపించుకొన జాలవు. ఏది జరిగిననూ జరుగక పోయిననూ, సిద్ధించిననూ సిద్ధించకపోయిననూ రెండింటియందూ సమానతృప్తిని కనబరచుట, అనుభవించుటే, సంతుష్టి అని చెప్పవచ్చును.

(గీ.పు.198/199)

 

ఈనాటి భక్తులు Deep devotion వుంది అంటారు.కానీ Deep Ocean లో వుంటారు.

(భ.ప్ర.పు.1)

 

సత్యమైన పరమాత్మ యందు సత్యముయందును సద్దర్మముల యందును గల ప్రేమయే శాంతము, ఇట్టి శాంతియే సత్యాత్మను సాక్షాత్కరింపజేయును. అట్టి దైవ సాక్షాత్కారము నొంద తలంచువారికి ముఖ్యముగా శాంతియనునది. యుండవలెను. అనగా సత్యపరమాత్మయందె దృష్టిగలవారైనా జీవిత మేమైననూ సత్యాత్మ దర్శనమొందియే తీరవలెనను గట్టి పట్టుదలగలవారై కామక్రోధాది ప్రకృతి వికారములకు సుఖదు:ఖ స్తుతి నిందానింద్యములను తలంచకయుండవలెను. ఇట్టి ఓర్పు ఒక్కటే దైవసాక్షాత్కార జ్ఞానము నొందించును.

 

మానవజన్మమెత్తుట దేవుని భజించి తద్వారా పరమాత్మను తెలిసి కొనుటకు అని నిశ్చయించుకొనివలెను. "నేనే ఆట, ఏ మాట. ఏ పాట, ఏమి చేసిననూ భగవంతుని తెలిసికొనుటకే, ఏమి చూసినా, ఏమి తినినా, ఏమనినా, ఏమి చేసినా, అంతా దేవుని తెలుసుకొను నిమిత్తమే" అను దృఢమును మొదట పెంపొందించుకొనవలెను. భగవన్నామ రూపములు పెద్ద బెల్లపు పర్వతములవంటివి. ఆ కొండను సమీపించి సర్వదా నమ్మి ఏ వైపున నీవు భుజించిననూ ఆనందమను తీపినే అనుభవింతువు. ఈ రీతిగా ఎల్లప్పుడూ ఆ మధురమును అనుభవించువారేఉత్తమ భక్తులు. దైవనామస్మరణ యను కొండలో కొంతకాలము అనుభవించి, సమీపముననుండి కొంతకాలము విషయసుఖము లనుభవింతురు. వీరిని మధ్యమ భక్తులని అందురు.

 

దైవస్మరణను కొండలో నాల్గవభాగమునే అనుభవించి ముప్పాతిక భాగమంతా విషయసుఖముల ననుభవింతురు. వీరిని ఆధములని అందురు. కష్టములు వచ్చినపుడు నామస్మరణ యను బెల్లపుకొండను ఆశ్రయించి, ఆ కష్టము తీరగనే కొండకు దూరమగుదురు. ఇట్టివారిని అధమాధము లందురు.

 

పరమ భక్తులైన మీరు, పై నాలుగింటిలో ప్రథమమైన ఉత్తమ మార్గమును విడువక పట్టిన,జీవితమున పూర్తి ఆనందమును తీపిని ఆరగించుచుందురు. అట్టి పట్టు పట్టుటకు శాంతే మీ నిజమిత్రము. ఆ మిత్రుని మీరు సాయముకోరిన అతని మూలమున పవిత్ర జీవులు కాగలరు. సార్థకమొందగలరు.

(ప్ర.వా.పు.33/34)

 

ప్రేమ స్వరూపులారా! మీరు ఏపని చేసినా పరిశుద్ధమైన భావంలో చేయాలి. చంచలమైన మనస్సుతో, దుర్భావములతో చేయకూడదు. కాలం అధికంగా తీసుకున్నా ఫరవాలేదుగాని, చేసే పని పరిపూర్ణంగా ఉండాలి. "అయ్యో, కాలం మించిపోతున్నదే" అని తొందరపాటుతో పనిని పాడు చేయకూడదు.కాలమును సార్థకం చేసుకున్నప్పుడే మీరు పవిత్రులౌతారు. కాలమే భగవత్స్వరూపం. చావు పుట్టుకలకు కాలమే కారణం. ప్రతి ఒక్కరూ కాలమునకు లోబడవలసిందే. కాలము ఎవ్వరికీ లోబడదు. అయితే, ఎవరైతే భగవత్ప్రేమను సాధిస్తారో వారు మాత్రమే కాలాన్ని సాధించగలరు. మార్కండేయుని వృత్తాంతమే దీనికి చక్కని ఉదాహరణ. అనికి మొట్టమొదట ఈశ్వరుడే 16 ఏళ్ళ ఆయుర్దాయమును ప్రసాదించాడు. కాని, తరువాత అతని భక్తి ప్రపత్తులకు మెచ్చి తన సంకల్పాన్ని కూడా మార్చుకుని అతనిని చిరంజీవిగా చేశాడు. ఈ లోకంలో భక్తుణ్ణి మించినవాడు మరొకడు లేడు.

 

ఒకానొక సమయంలో శ్రీమన్నారాయణుడు నారదుణ్ణిప్రశ్నించాడు. - నారదా! పంచభూతములలో ఏది గొప్పది?" "స్వామీ! భూమి చాల గొప్పది " అన్నాడు. "భూమి గొప్పదే. కాని, భూమిలో మూడు భాగములు సముద్రం మింగివేసిందే! కనుక, సముద్రం గొప్పదా? భూమి గొప్పదా?" అని అడిగాడు. "అవును సముద్రమే గొప్పది " అన్నాడు నారదుడు. "అంత గొప్ప సముద్రాన్ని అగస్త్యుడు ఒక్క గుటకలో మ్రింగినాడు. కాబట్టి, సముద్రం గొప్పదా? అగస్త్యుడు గొప్పవాడా?" అని అడిగాడు. "అగస్త్యుడే గొప్పవాడు" అన్నాడు నారదుడు. "ఆగస్త్యుడు ఆకాశంలో ఒక చిన్న చుక్కగా ఉన్నాడే! కనుక, ఆగస్త్యుడు గొప్పవాడా? ఆకాశం గొప్పదా?" అని అడిగాడు. నారదుడు ఆకాశమే గొప్పదని అన్నాడు "అంత పెద్ద ఆకాశాన్ని భగవంతుడు వామనావతారంలో ఒక్క అడుగుతో ఆక్రమించాడు. కనుక, భగవంతడు గొప్పవాడా? ఆకాశం గొప్పదా?" అని అడిగాడు. భగవంతుడే గొప్పవాడన్నాడు నారదుడు. "అంతటి గొప్పవాడైన భగవంతుడు భక్తుని హృదయంలో బందీయై ఉన్నాడు. కాబట్టి భగవంతుడు గొప్పవాడా? భక్తుడు గొప్పవాడా?" అని అడిగాడు. అప్పుడు నారదుడు "స్వామీ! భక్తుని మించినవాడు మరొకడు లేడు" అన్నాడు. భక్త పరాధీనుడు భగవంతుడు. భక్తునికి భగవంతుడు సేవకుడౌతాడు. కాబట్టి, భగవంతుని కంటే భక్తుడే గొప్పవాడు. ప్రేమచేతనే భగవంతుని హృదయాన్ని కరిగించవచ్చు. కనుక, ప్రేమను పెంచుకోవాలి. భగవంతుణ్ణి హృదయ పూర్వకంగా ప్రేమించాలి. భగవత్ప్రేమను పొందటానికి కృషి చేయాలి. అప్పుడే మీ జన్మ సార్థకమవుతుంది.

 

"త్వరపడుమా, త్వరపడుమా

ప్రభు సాయీశుని ప్రేమ పిలుపులని

వినబడుచున్నవి రమ్మనుచు

పరమార్దము చేకొనుమనుచు

యోగ సాధనల పనియే లేదట

ఉపదేశంబుల పనియే లేదట

త్వరపడుమా త్వరపడుమా

ప్రభు సాయీశుని ప్రేమ పిలుపులని

వినబడుచున్నవి రమ్మనుచు"

 

యోగసాధనల పనే లేదు. ఉపదేశముల పనే లేదు. "రమ్ము రమ్ము" అని భగవంతుడు పిలుస్తూనే ఉన్నాడు. తిరుపతిలో వేంకటేశ్వరస్వామి ఒక చేయిని క్రిందికి చూపిస్తూ, మరొక చేత్తో అభయమిస్తూ కనిపిస్తాడు. ఏమిటి దీని అర్థం? "ఒరే పిచ్చివాడా! నాపాదాలపై పడు, నన్ను శరణుజొచ్చు. నేను మీకు అభయమిస్తాను" అంటున్నాడు. భగవంతుణ్ణి శరణు జొచ్చినవారికి అభయం ఎప్పుడూ ఉంటుంది.

(స.సా.న..99పు 304/305)

 

భక్తుడు భగవంతుని జేరుట కెంతవేగముగా ప్రయాణము చేయునో, భక్తుని జేరుటకు భగవంతుడంత కెక్కువ వేగముగా ప్రయాణము చేయును. నీవొక్కడుగు ముందుకు వేసిన, ఆయన నూరడుగులు ముందుకు వేయును. ఆయన, తల్లిదండ్రులకంటెను - ఎక్కువ వాత్సల్యము గలవాడు. తనయెడ దృఢమైన భక్తి విశ్వాసములు కలవారి నెందరినో కాపాడి వృద్ధికి తెచ్చియున్నాడు. అట్టి భక్తి విశ్వాసములు నీ కున్న యెడల, నీలో నుండియే నిన్ను కాపాడుచూ, నిన్ను వృద్ధికి తెచ్చును. ( ప్రశాంతి నిలయం 8-9-1963) (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 72-73)

 

నిజమైన భక్తుడెవరంటే ఈప్రపంచంలో బ్రతు కుతూ పనిచేస్తూ కూడా భగవంతునితో బంధo కలిగి ఉన్నవాడే. (స.సా. 2022 సె 2022 పు 23)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage