మహాభారత యుద్ధం తరువాత 42 సంవత్సరాలు గడచిపోయాయి. ఒకనాడు అర్జునుడు ద్వారక నుండి తిరిగి వస్తున్నాడు. ఎట్టి పరిస్థితిలో వస్తున్నాడు? అక్కడ యాదవకులంలో ముసలం పుట్టింది. యాదవులందరూ మరణించారు. కృష్ణుడు కూడా శరీరాన్ని వదలి పెట్టాడు.
ఈ వార్తను తీసుకొని అర్జునుడు వస్తున్నాడు. అర్జునుని రాకను గమనించి కుంతిదేవి లేచి కూర్చుంది. ధర్మజుడు అర్జునునికి ఎదురేగి "అర్జునా! మన కృష్ణుడు ఎలా ఉన్నాడు? మన సఖుడు, మన బంధువు, మన బావ, మన దైవం కుశలమే కదా!" అన్నాడు. అర్జునుడు. "ఇంకెక్కడ కృష్ణుడన్నా" అని పట్టలేని దుఃఖంలో కూలబడ్డాడు. ధర్మజునిద్వారా ఈ వార్త విని కుంతీదేవి కృష్ణుడు పోయాడా!" అని మూడు పర్యాయములు పలికి ధర్మజుని తొడపై పడి ప్రాణం వదలింది. ధర్మజుడు తన తొడపై పడిన తల్లి దేహాన్ని చూసి “అమ్మా! కృష్ణుణ్ణి వెతుక్కోవడానికి నీవు వెళ్ళవా? నీవు కృష్ణుణ్ణి వెతకడానికి వెళ్ళినట్లనిపిస్తోంది" నాకు అని చాల విదారించాడు. "ఇంతకాలము మేము కృష్ణుని వల్లనే జీవించాము, కృష్ణునిసహాయం వల్లనే యుద్ధంలో విజయం సాధించాము, పేరు ప్రతిష్ఠలను పొందాము. ఇంక, కృష్ణుడు లేని జీవితం మా కెందుకు? అనుకొని వెంటనే భీమార్జున నకుల సహదేవులను పిలిచాడు. భీమునితో తల్లి అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయమన్నాడు. అర్జునునితో పరీక్షిత్తు పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు చేయమన్నాడు. నకుల సహదేవులలో "మహాప్రస్థానమునకు అంతా సిద్ధం గావించండి అని చెప్పాడు. ఏమి విచిత్రము! కుంతీదేవి దేహానికి అంత్యక్రియలు, పరీక్షిత్తుకు పట్టాభిషేకం, పాండవుల మహాప్రస్థానం మూడూ ఒక దినమే జరిగాయి. ఇలా ఎవరు చేయగలరు? భగవదనుగ్రహము కల్గిన ధర్మజునివంటి పరమ భక్తులకు మాత్రమే ఇది సాధ్యము. కష్టాలు కదలిపోయే మేఘాలవలె వస్తుంటాయి, పోతుంటాయి. కష్టానికి కంటనీరు పెట్టకూడదు, సుఖానికి పొంగిపోకూడదు. క్రుంగని, పొంగని మనస్తత్వాన్ని అభివృద్ధి పర్చుకోవాలి. ఇదియే నిజమైన భక్తుని దీక్ష. భక్తి అంటే ఏమనుకున్నారు? పూజలు, వ్రతములు చేయటం కాదు. భగవంతునిపై ప్రసరించిన ప్రేమను తిరిగి వెనుకకు తీసుకోకూడదు. అదియే నిజమైన భక్తి.
(స.సా. ఫి.2000పు. 43)
భక్తికి అర్పణ భావమే ముఖ్యం. ఆడంబరము, ఆర్భాటములతో పటములను పూజించి, గట్టిగా భజన పాటలు పాడటం కాదు. స్వామి ఆజ్ఞానుసారం నడుచుకొనే వారికే స్వామి చిక్కుతారు.స్వామి ఆజ్ఞలను అనుసరించకుండా స్వామి మాత్రం కావాలి అనుకుంటే, అది జరుగదు. "సర్వమును స్వామికి అర్పితం చేసుకొన్నాను. అయినా స్వామి నన్ను శిక్షిస్తున్నారే" అని కొంతమంది నాకు బాబులు వ్రాసి పంపుతుంటారు. సర్వమును స్వామికి అర్పితం చేసుకొన్నట్లయిన స్వామి చేసినది శిక్షగా తోచదే! శిక్ష అనే భావము అహంకారము నందు పుట్టునేగాని, శరణాగతులకు రానేరదు. అది శిక్ష కాదు, రక్షణ అని సంతోషంగా భరించుకొనుటే నిజమైన భక్తుని లక్షణం. అడిగే స్థితిలో భక్తుడున్నాడంటే అతడింకాశరణాగతుడు కాలేదనే అర్ధం. మీరు అడుగనక్కర్లేదు, మీ అభివృద్ధికి కావలసినవన్నీ నేనే అందిస్తాను. దీనిని విశ్వసించి సంతృప్తితో, శాంతితో ఉండండి.
(స.పా.మే.2000 వెనుక కవరుపుట)