కన్నులకు చూపు నిచ్చునటువంటివారు ఎవరు? "రసోవైసః" సర్వాంగములందును రస స్వరూపుడై ఈ దేహాన్నంతా నడిపిస్తున్నాడు. ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక మానవుడు గొప్ప విద్యావంతుడనుకొని "నేను చేసాను, నేను చూసాను. నేను చెప్పాను" అని తన యొక్క అహంకారాన్ని కర్తృత్వాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాడు. మనము సామాన్యమైనటు వంటి విషయములోపల మన జీవితాన్ని కేవలము అంకితము చేస్తున్నాము. దానికంటే ఉన్నతమైన మరో స్థాయిని కూడా చేరడము అత్యవసరము. చదువు యొక్క ముఖ్యోద్దేశము అదియే. మనము అన్ని విధాల జగత్తులో జరిగేటటువంటివి ఉచ్చరించినపుడు మన విద్యకు కలిగే విలువ ఏముంటుంది. అన్నిటికీ ఆధారం ఏమిటో? అన్నిటికీ గమ్యమేమిటో, అన్నిటికీ ఒక విధమైన ప్రారంభమేమిటో మనం గుర్తించటానికి ప్రయత్నించాలి. అదే నిజమైనటువంటి దైవత్వము. ఆ దైవ విశ్వాసం లేకుండా మనం దేనిని కూడను సాధించలేము. ఈ విశ్వాసమునకు ఏదో కొన్ని కారణములని భావిస్తాము. ఇది చాల పొరపాటు. మన Faith అనేదానికి No reason. ఇది Beyond reason. దీనిని చక్కగా మీరు గుర్తించాలి. నీవు తల్లిని ప్రేమిస్తున్నావు. దీనికి ఏమిటి Reason అని ఎవరైనా అడిగితే ఏమి చెపుతావు నీవు? దానికి ఒకే ఒక సమాధానం. "She is my mother ఆమే నా తల్లి దానివల్ల ఆమెను ప్రేమిస్తున్నాను" అదే విధముగనే ఈ భగవంతునిపై నమ్మకమునకు కారణమేమిటంటే He is my God అదే Reason. ఆయొక్క నమ్మకము చేతనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి సాధ్యమవుతుంది. ఆ నమ్మకము ఎంతగానో మనలను బలపరుస్తూ ఉంటుంది.
కనుకనే
Where there is Confidence, there is Love.
Where there is Love, there is Peace.
Where there is Peace, there is Truth.
Where there is Truth, there is Bliss
Where there is Bliss, there is God
ఇటువంటి Confidence తోనే మనము ఆనందాన్ని పొందడానికి తగినంత కృషి చేయాలి. ఈ Confidence లేకపోతే నీకు ఆనందమే లేదు. కానీ ఈనాటి పిల్లలయందు కేవలం ఉన్నటువంటి Confidence ను ఛిన్నా భిన్నము చేసే దూతలు కూడా ఉన్నారు.
(స.సా.జూ.. 89, పు. 174/175)
దైవ విశ్వాసము ఎన్ని విధములైన కష్టములు, నష్టములు, విచారములు, దుఃఖములు కలిగినప్పటికిని, ఆ విశ్వాసము సడలిపోకూడదు. ఆదృఢ విశ్వాసమే అనేక మంది భక్తులను సంరక్షిస్తూ వచ్చింది. ప్రాచీన కాలము నుండి మహర్షులను రక్షించినది ఏ శక్తి? లక్ష్మీ శక్తి, దుర్గా శక్తి, పార్వతి శక్తి అని అనుకుంటున్నాము. ఏ శక్తికాదు ఆ దృఢవిశ్వాస శక్తియే పెద్ద శక్తి, విశ్వాస శక్తి లేక ఎన్ని శక్తుల నుండి ప్రయోజనం ఏమిటి? కనుక ఆ విశ్వాసమనే శక్తిని మనం బలపర్చుకోవాలి. ఎన్నో అడ్డములు తగులుతాయి. ఎన్నో బాధలు మనలను హింసిస్తూ ఉంటాయి. ఏ మాత్రము లెక్క చేయకూడదు. వీటన్నింటిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినప్పుడే మనము దీనిని సాధించిన వారమవుతాము. అడ్డు తగిలిందని ఏమవుతుందో అని సందేహపడితివా యింక ధ్వంసమైపోయినావు. ఎట్టి పరిస్థితిలో మన విశ్వాసము దూరము చేసుకోకూడదు. విశ్వాసముండిన మానవుడు ఎంతైనా సాధిస్తాడు. అనేక పర్యాయములు త్యాగరాజుకు కూడా విశ్వాసము కొన్ని సమయములలో చంచలమైపోతూ వచ్చింది. రామదాసుకు కూడా అనేక పర్యాయములు doubts వచ్చాయి. "రామా! నాకు నీవు తప్ప ఎవరు లేరని" పరిపూర్ణముగా విశ్వసించినవాడు రామదాసు. తన సర్వస్వము రామునికర్పించిన వాడు రామదాసు. కానీ కొన్ని సమయములలో మనుష్యత్వము బలహీనతకు గురౌతుంది. ఆ బలహీనత వల్ల బుడగవలె సందేహము బయలుదేరుతుంది. ఆ సిపాయిలు అతన్ని జైల్లో వేసి కొడుతున్నారు. ఆ దేహ బాధలను సహించుకోలేక పోయాడు రామదాసు. రామునిపై కోపం వచ్చేసింది. కోపము రాకూడదు సాధకునికి.
కలికి తురాయి నీకు కుదురుగ చేయిస్తి రామచంద్రా!
ఎవరబ్బ సామ్మని కులుకుతు తిరిగేవు రామచంద్రా!
అని తిట్టినాడు.. ఎవరబ్బ సొమ్ము;
నీవు పెట్టుకొని కులుకుతున్నావే అన్నాడు.
తక్షణమే బాధ కల్గింది. అయ్యో!
నా స్వామిని ఇంతగా నిందించానా. అబ్బ!
తిట్టితినని ఆయాసపడవద్దు
ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్యా రామచంద్రా!
ఈ బాధలు సహించుకోలేక నిన్ను నేను తిట్టినానుగాని తిట్టాలని తిట్టలేదు. కానీ అప్పుడు కూడా ఓపిక పట్టుకోవాలి. బిడ్డ పైన ప్రీతి ఉంది కదాయని గట్టిగా గొంతుపట్టుకొని ముద్దుపెట్టుకుంటే ప్రాణం పోతుంది. అయ్యో నేను ప్రాణం పోవాలని పిసకలేదు ప్రేమతో పిసికాను అంటే ఏమి ప్రయాజనం చెప్పండి. అక్కడ కూడా సూక్ష్మా న్ని గుర్తించుకుంటూ పోవాలి. పరులకు బాధ కలిగించక ప్రేమను మనం అనుభవించాలి.
అదే విధముగా త్యాగరాజా. తాను బాధలకోర్వలేక పోయాడు. తనయింటి నుండి రాములు వెళ్లిపోయాడు. ఆ రాములను వెతుకుతూపోయాడు. ఎక్కడా చిక్కలేదు. ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు. రామా! నిన్ను సర్వకాల సర్వావస్థలందు భజించి స్మరించినందుకు ఇదా ఫలితము. నిన్ను ఏమి కోరినాము. ఏ కొండలు గానీ, ధనముగాని, ధాన్యముగాని కోరలేదు. నిన్నేకోరాను. యింత మాత్రము దయ లేదా! నీకు దయలేదా? లేక నాలో భక్తిలేదా? ఇందులో సందేహము తీరిపోవాలి అని అనుకొని నిర్ణయము చేసుకున్నాడు. నాలో కాలి మొదలు తల వరకు "రామ, రామ" అనే చింత సర్వత్రా ప్రసరిస్తున్నది. నాలో భక్తి లేదని చెప్పుటకు వీలులేదు. చూస్తే నీలోనే శక్తి లేదు. చేతకాని వారికి చేష్టలు జాస్తి, చెప్పుతున్నాడు. రామా! నీలో శక్తి ఉంటే నన్ను ఎందుకు రక్షించుకోలేకపోయావు? నీలో శక్తి లేదన్నాడు. తక్షణమే మనో భ్రాంతి అభివృద్ధి అయింది. నిజంగా ఆతనికి శక్తి లేదా? Self enquiry ప్రతి మానవునికి అత్యవసరము. నాలో ఆ పవిత్రత ఉందా లేదా అనే దృఢమైన విచారణ చేయాలి.
కపి వారిధి దాటునా?కలికి మింట లేచునా?
లక్ష్మిదేవి వలచునా? లక్ష్మణుండు కొలచునా?
సూక్ష బుద్ధి గల భరతుడు చూచి చూచి మ్రొక్కునా?
అబ్బ! రామ శక్తి ఎంతో గొప్పరా!
ఓ రామా! నీ శక్తి ఎంత గొప్పది. ప్రపంచమంతా ప్రార్థిస్తే కూడా లక్ష్మీదేవి ఎవరికీ చిక్కటం లేదు. ఆమె మీ పాదాలు వత్తుతూ కూర్చుందే, ఆమెకు బుద్ధిలేదా! అలాంటి లక్ష్మీదేవే నీ పాదాక్రాంతురాలైనప్పుడు నేనెవరు. నీలో శక్తి లేకపోతే ఆమె ని పాదములు ఎట్లావత్తుతుంది? కపి వారధి దాటునా? చంచలత్వమునకు పుట్టినిల్లు పెట్టింది పేరు కోతి. సముద్రాన్ని దాటుతాడా! కేవలం నమ్మరాని విషయము. నీశక్తియే దాటించింది. ఆ శక్తి ఎట్లా వచ్చింది హనుమంతునికి? రోమరోమము రామనామమే. "సర్వదా సర్వకాలేషు సర్వత్ర రామ చింతనమే". ఎలాంటి పరిస్థితిలోనైనా అహంకారము, ఆడంబరము ప్రదర్శించినవాడు కాదు హనుమంతుడు. నిరంతరము రాముని చెంత చాలా దీనుడే! కాని రావణుని దగ్గర పోయినప్పుడు వీరుడే. రాముల దగ్గర నిరంతరం దాసుడుగానే ఉంటున్నాడు. ఆశోకవనములో యిష్టానుసారము సంచరిస్తున్నాడు హనుమంతుడు. అనేకమంది రాక్షసులు కోతిని ఏనాడు చూడలేదు. ఈ కోతిని చూడడానికని ఆశ్యర్యముగా వస్తున్నారు గుంపులు గుంపులు. ఒక రాక్షసుడు ప్రశ్నించాడు. ఎవరు నీవు? ఎంత వినయంగా చెబుతున్నాడు. దాసోహం కోస లేంద్రస్య నేను రామచంద్రుని దాసుడు. ఆ సమయమునందు మనసుకు ఎంత మృదు మధురమైనదిగా తోచింది. రామ విషయములో సర్వము లీనమైనవాడు. అలాంటి రామునికి బలము లేకుండా పోలేదు. సర్వశక్తిమయుడు రాముడు. ఇలాంటి శక్తి ఎలా తెలుస్తుంది? తన భక్తిలోనే తెలుస్తుంది. తన విశ్వాసము అంత గాఢముగా ఉండటం చేత రాముని శక్తి గాఢంగా విశ్వసిస్తూ వచ్చాడు. తనలో ఆత్మ విశ్వాసము లేక పోతే దైవము పై పూర్తి అవిశ్వాసము వస్తుంది. “యద్భావం తద్భవతి". ఇదంతా నీలోని భావములు గాని దైవములోనివి కాపు, నీలోని లోపములేగానీ దైవములో లోపమేలేదు. మనము అన్ని విధాల బుద్ధి చెప్పవలసిన చోట చెప్పాలి. అనుభవించవలసిన దగ్గర అనుభవించాలి. అదే హనుమంతుడు ఎంత శాంతముగా, ఎంత ప్రీతిగా, ఎంత సౌమ్యముగా, ఎంత ఆనందముగా అన్ని విధముల రామసేవ చేశాడు? కట్టకడపటికి రాక్షసులచేత చిక్కాడు. ఆ రాక్షసుల చేత చిక్కినపుడు రావణుని దగ్గరకు పట్టుకొనిపోయారు. రావణుడు హనుమంతుని చూచి ఒరే! క్రింద కూర్చో అన్నాడు. రావణుడు వద్ద సింహాసనముపై కూర్చున్నాడు. ఛీ! ఈ దుర్మార్గుడు పైన కూర్చోటము రామదాసునైన నేను క్రింద కూర్చోటమా? తగినది కాదు. తన తోకను పెంచాడు- పెంచాడు; చుట్టాడు - చుట్టాడు. రావణుని కంటె పైకిపోయి కూర్చున్నాడు. రావణుని ప్రశ్నించాడు.
"కోతి జాతిని వనమెల్ల చెరిచితివి నిన్నెవడు పంపించెరా!
కోతి జాతిని నిన్నెవడు పంపించెరా!"
నవ్వుతూ చెబుతున్నాడు హనుమంతుడు:
"నీ చెల్లి ముక్కు చెవులు కోసిన రాచదొర నన్నంపెరా"
ఆతనే నన్ను పంపించాడు అన్నాడు. ఎంత చక్కని సూటి అయిన మాటలు. ఈ హనుమంతునిలో పూర్తిగా రాముడే లీనమైపోయినాడు. "బ్రహ్మవత్ బ్రహ్మైవభవతి". అదే సాయిజ్య తత్త్వము. భక్తులలో భగవంతుడు లీనమై ఉంటున్నాడు. రాక్షసులంతా తిరుగుతున్నారు. అటు యిటూ లంకంతా అగ్గి పెట్టాడు. కేకలు వేస్తు తిరుగుతున్నారు. ఏదన్నా?
ఈ కోతి నెవరు పంపిరి?
అది మామీద గోదాడ చేసెనే!
కానీ విభాషణుని భార్య సరమా, బిడ్డలు రెండు చేతులు జోడించి నమస్కరించారు. హనుమంతునికి. వారికి యిలాంటి పవిత్రమైన దర్శనం లభ్యమైంది. రాములను మేము చూడలేము. రామదాసుని ద్వారా చూస్తున్నాము. రామదాసు ఒక పరిశుద్ధమైన అద్దము వంటి వాడు. ఆ అద్దములోనే రామచంద్రుని మేము చూడగలుగు చూన్నాము. దాసుడు ఎట్లా ఉండాలంటే పవిత్రమైన పరిశుద్ధమైన అద్దము వలె తయారు కావాలి. ఏ విధమైన అహంకార ఆడంబర మాలిన్యములు యిందులో ప్రవేశించపడదు. అలాంటి వాడే నాకు భక్తుడు నా ప్రియుడు అన్నాడు కృష్ణుడు.
(ద.య.స.97 పు.110/114)