భగవాన్ బాబావారు శ్రీ రామబ్రహ్మం పై అనంతమైన దివ్యప్రేమ, కరుణలను వర్ణిస్తూ వ్రాసిన ఉత్తరాలు, భౌతిక ఆధ్యాత్మిక పరిధిలో ఆయన సంక్షేమమును కాంక్షిస్తూ వ్రాసిన ఉత్తరాలు అనేకం ఉన్నాయి. ఆ ఉత్తరాలలో దివ్య మాతా పితరులైన భగవాన్ బాబావారి మాతృప్రేమ, తండ్రి యొక్క కఠిన వైఖరి మరియు అవతార పురుషుని అపార జ్ఞానసంపద ప్రతిఫలిస్తాయి. భగవాన్ బాబావారు దివ్య ప్రేమామృతధారలు వర్షిస్తూ శ్రీ రామబ్రహ్మంకు వ్రాసిన ఆ ఉత్తరంలో ఈ విధంగా కవితా వెల్లువ పొంగి పొరలుతుంది:
“నా దర్శన భాగ్యము కొరకు ఆర్తితో సక్కుబాయి కార్చిన
కన్నీటి ధారలను నేను మరువగలనా?
నా ఆరాధన తప్ప అన్య చింతనలేని నందనార్
పడిన కష్టములను నేను మరువగలనా?
నా దర్శనముకొరకు నిరంతరం పరితపించిన మీరా
శోకతప్త గాథ నా స్మృతిపథంనుండి చెరిగిపోయిందా?
రామా! రామా! అంటూ నిరంతరం రామ చింతనోన్మత్తుడైన
త్యాగరాజు మొరలను ఎన్నడైన ఏమరచితినా?
రామబ్రహ్మం! సర్వాంతర్యామి నీ సాయి కన్నీటి ధారలతో
చేసే నీ ప్రార్ధనలను ఆలకించడా?
సాయి దయాదృష్టి నీపై వర్షించదా?
రామబ్రహ్మం! సర్వకాల సర్వావస్థలలోను
సాయి నిన్ను కాపాడుతారని గుర్తుంచుకో!
అడవిలోనున్న ఆకసముననున్న
పట్టణముననున్న పల్లెనున్న
గుట్టమీదనున్న నట్టేటనున్నను
మదిని సాయి నిన్ను మరువడెపుడు.” - నీ బాబా
(ధన్యజీవులు పు 151-152)