కోసల దేశమునకు ప్రధాన కేంద్రము అయోధ్య. ఇది మనుచక్రవర్తి స్వయంగా నిర్మించిన పట్టణము. ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందూ ఎక్కడా కనిపించదు. ఆనాడే ఈ ఆయోధ్యలో ఏడంతస్తులు, ఎనిమిదంతస్తుల మేడలు ఉండేవి. విశాలమైన బజారు లందు అనేకవిధములైన సౌందర్యములు కల్పించి మరింత ఆకర్షణీయంగా రూపొందింప జేస్తూ వచ్చారు. అయోధ్య పురవాసులు.
శ్రీలు మించిన దిక్కుటాలు,
వింతల బంగళాలు, ముత్యపుతోరణాలు
మూలల కిటికిటీలు, వజ్రాల తలుపులు, తాపిన నీలాలు
నీలాలు వెయ్యర్లు నూరార్లు బజార్లు.
ఈ భవనములు రత్నములచేత, ముత్యములచేత కూర్పబడిన అలంకారములచేత కప్పబడినవి. ఈ రాజ్యమునకు మహారాజైన దశరథుడు శాంతమూర్తి, తేజస్వరూపుడు. నిర్మలవిశ్చల స్వభావుడు. ప్రజలను తన కన్నబిడ్డలవలె పరిపాలిస్తూ వచ్చాడు."యథారాజా తథా ప్రజా"అన్నట్లు, ప్రజలు కూడా దశరథుని తమ తండ్రిగా విశ్వసించి అతని ఆదర్శమును అనుభవిస్తూ వచ్చారు. ఇంత పెద్ద రాజ్యమునకు ఎనిమిది మంది మంత్రులను మాత్రమే నియమించుకున్నాడు దశరథుడు! వీరు సామాన్యమైన మంత్రులు కారు. సకల శాస్త్రములు తెలిసినవారు. గొప్ప విద్యావంతులు, గుణవంతులు, ఇంద్రియ నిగ్రహము గలవారు. స్వార్థ ప్రయోజనములు లేనివారు. రాజాజ్ఞను శిరసావహించి తమ ప్రాణములనైనా అర్పించుటకు సంసిద్ధులయ్యేవారు. ఇంక వశిష్టుడు, వామనుడు ఇరువురు పురోహితులు, వీరు ధార్మికమైన, వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజలలో దివ్యమైన ఆత్మతత్వాన్ని ప్రకటింప జేస్తూ వచ్చారు. దశరథుడు నిరంతరము దైవ చింతనలో కాలము గడిపేవాడు. సత్యధర్మములే అతని నేత్రములు, శాంతి ప్రేమలే అతని సూత్రములు, ప్రజలు కూడా అట్టివారే. మంత్రులు కూడా మహాపవిత్రులే. దశరధుని వంటి మహారాజు, అతని అష్టమంత్రులవంటి మంత్రులు, వశిష్ట వామనులవంటి పురోహితులు ఉండినట్లైతే ఏనాడైనా ఏ రాజ్యమునైనా రామరాజ్యంగా మార్చవచ్చు. కాని రావణుని యొక్క గుణములు హృదయమునందు నాటుకొని రామ రాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది? కనుక, ఈనాడు సత్యధర్మములను సరియైన మార్గములో అనుభవించాలి.
(శ్రీ భ.ఉ.పు.39/40) ||
ఆనాడు దశరథుని మంత్రులు ఎనిమిది మంది. వారెలాంటివారు? నీతినిజాయితీలతో కూడిన వారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, సత్యవాక్పరిపాలకులు. అలాంటి మంత్రులు, శిష్టవామదేవుల వంటి గురువులు, దశరథునివంటి రాజు ఉంటే ఇప్పుడు కూడా దేశం రామరాజ్యంగా మారిపోతుంది. దశరథుడనగా ఎవరు? దశేంద్రియములతో కూడిన ఈ దేహమే ఒక రథము. ఇందులో ఆత్మాభిమానియైన రాజు ఉంటున్నాడు. అతడే దశరథుడు. సత్వరజస్తమో గుణములే అతని ముగ్గురు భార్యలు. ఈ ముగ్గురు భార్యలకు ధర్మార్థ కామ మోక్షములనే నల్గురు కొడుకులు పుట్టారు. ధర్మము రాముడు, మోక్షము భరతుడు, అర్దకామములు లక్ష్మణ శతృఘ్నులు. ఈనాడు మానవుడు ధర్మమోక్షములను విస్మరించి అర్థకామముల నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు. ఇది రామభక్తికి సరియైన లక్షణం కాదు. జానెడు పొట్టకు పట్టెడన్నం పెట్టలేడా భగవంతుడు? పైరు నాటిన వాడు నీరు పోయక మానడు. ఇట్టి నమ్మకాన్ని అభివృద్ధి పర్చుకోవాలి. ఇది లేకుండా ఎన్ని చోట్లకు తిరిగినా శాంతి చిక్కదు. కారణమేమిటి? ఈ లోకంలో ఎక్కడా శాంతి లేదు. దృష్టిని హృదయం వైపు మరల్చాలి. హృదయంలో మాలిన్యం నింపుకొని శాంతి కావాలంటే ఎలా చిక్కుతుంది? ముందు ఆ మాలిన్యాన్ని ఊడ్చిపారవేయాలి. గలీజుగా ఉన్న చిపురుతో ఊడ్చితే ఇల్లు కూడా గలీజైపోతుంది. మన మనస్సే ఒక చీపురు. ముందు దానిని పరిశుద్ధం గావించుకోవాలి. అది భగవదర్పితమైనప్పుడే పరిశుద్ధ మవుతుంది. కనుక ప్రేమచేత రామచింతన చేయండి, విశ్వాసంచేత రాముణ్ణి స్మరించండి. ప్రేమ, విశ్వాసంచేత రాముణ్ణి స్మరించండి. ప్రేమ, విశ్వాసములే మానవుని ప్రధానమైన ప్రాణములు.
(స.సా.మే.97 పు.134)
అయోధ్యానగరములో నిత్యోత్సవములును, నూతన వినోదములును జరుగుచుండెను. అనుదినము శ్రీరాముడు దానములకింద ధనమును వినియోగించెను. ఒకరినొకరు నిందించుకొనకూడదు. దుర్భాషలాడరాదు. ప్రతిగృహమునందు దినమూ వేదపారాయణము, పురాణశ్రవణం పెరుగుచుండెను. ఎవరి కులధర్మముల ననుసరించి వారు సంచరించిరి. కానీ, పరకులములను తిరస్కరించువారు కానీ, చిన్నబరచుట కాని రామ పరిపాలనలో ఎక్కడనూ కానరాదు. రామునకుప్రజలయందు దయానురాగములు పెరిగెను. రాముని కాలములో భక్తి శ్రద్ధలతో భర్తలకు స్త్రీలు శుశ్రూష చేయుటచూచి దేవతా స్త్రీలు సహితము సిగ్గుపడెడివారు ఆనాటి భర్తలు కూడను వారికి తగినవారై యుండిరి. భార్యలకు కంటినీరు తెప్పించెడివారు కారు. సతీపతులు ఇరువురు అర్థదేహములుగా భావించి ఒకరినొకరు అనుసరించి, అన్యోన్యానుకులముగా మెలగెడివారు. అసత్యములు రామ కాలమున యెట్టి సమయము నందైననూ ఆడుటకు పూనుకొనెడివారు కారు. తల్లిదండ్రుల ఆజ్ఞలు, గురువుల ఆజ్ఞలు, బాలబాలికలు మన్నించుచుండిరి. అందరూ దేవేంద్ర భోగములనను భవించిరి. కుబేరునితో సమానముగా ధనధాన్యములు సమృద్ధిగానుండెను. శరత్కాల చంద్రబింబమును చూచి, చకోరములు సంతసించునటుల ఆంతఃపుర స్త్రీలు రాముని చూచి ఆనందించెడివారు. శ్రీరాముని దివ్యమంగళ విగ్రహమున కన్నులారా చూచి భరత లక్ష్మణ శతృఘ్నుల మనసున కాప్యాయము కలిగెడిది.. రాముని ప్రభుత్వములో లోకమంతయు సంపూర్ణ కళలతో నిండియుండెను. పాపమను మాటలేదు. మునీశ్వరులునిర్భయముగ వనములలో సంచరించుచుండిరి. రాజునకు ప్రజలకు అన్యోన్యానురాగము పెరిగెను. భూమి అంతయు శోభాకరముగా నుండెను. వనములు కళ కళలాడెను. పక్షులు, మృగములు స్వాభావిక విరోధమును విడిచి పరస్పరమైత్రితో మెలంగెను.రామరాజ్యములో వైరమను మాట లేదు. అందరూ పరమసఖ్యముగా నుండిరి. ప్రతి వ్యక్తి శ్రీహరి ప్రభావమును వర్ణించుటలో యోంతయో ఉల్లాసపడు చుండెడివారు.
(రా.వా.రె.పు.230/231)
ధర్మమును, ధరణిని, ధర్మపత్నిని రక్షించుకొనుటే పురుషధర్మమని బోధించి ప్రజాక్షేమమే తన కర్తవ్యమని భావించి, నీచ ఉచ్చ అను తారతమ్యము లేక ప్రజాపరిపాలన జరిపి, ధర్మమును బోధించి తానే దైవమని నిరూపించిన దివ్యమూర్తి శ్రీరామమూర్తి. అతని ఆరాధనే భారతీయుల నిత్యపారాయణము, అతడు మానవాకారమును ధరించి, ధర్మసంస్థాపనకై ధర్మమూర్తిగా అవతరించిన శ్రీమన్నారాయణుడు. అతను సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వవ్యాపకుడు, అతడే అందరియందు ఆత్మారాముడై వేలాది వేల బల్బులలోని కరెంటువలె అందరి హృదయములలో ఆత్మరూపుడై ప్రకాశించుచున్నాడు, అతని ఆదర్శములే మన నిత్యాచారములు కావలెను. రామరాజ్యమున దురాచారములకు చోటులేక ఒకరికొకరు సోదరులవలె ప్రజలు మెలగెడివారు. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు 2)