రాముడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు కదా! మరి తాను కూడా ఎందుకిన్ని కష్టాలను అనుభవించవలసి వచ్చింది? అని మీరు ప్రశ్నించవచ్చు. భగవంతుడైనప్పటికీ శరీరమును ధరించిన తరువాత ప్రవృత్తి ధర్మాన్నే అనుసరించాలి. అవతారపురుషులు కొన్ని సమయములందు మాత్రమే తమ దైవత్వాన్ని వెల్లడి చేస్తారు గాని, మిగిలిన అన్ని సమయములందు మానవత్వపు ప్రవృత్తినే ప్రకటి స్తూంటారు. రాముడు మానవాకారము ధరించినప్పటికీ తాను మానవుడు కాదనే సత్యము తనకు తెలుసు. అయితే, శారీరకంగా లోకానికి ఆదర్శమునందించేనిమిత్తం తాను కూడా ఒక సామాన్య మానవునివలె మాయచేత కప్పబడినట్లు, భార్యా వియోగంతో కుమిలి పోయినట్లు, యుద్ధం చేసి విజయం సాధించినట్లు నటిస్తూ వచ్చాడు. సత్యాసత్యములకు, ధర్మాధర్మములకు, మంచి చెడ్డలకు మధ్య జరిగిన సంఘర్షణే రామరావణయుద్ధం.
(స. సా... మే. 2002 పు. 155)